ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, December 19, 2015

తివాచిపై త్రిలోక సంచారం!




కీలుగుర్రాలూ, మాయ తివాచిలు 
ఫాంటసీ బాల సాహిత్యం అనుకోనక్కర్లేదు.

వై.రామకృష్ణారావు మాయతివాచీ పేరుతో సంతరించిన దీర్ఘకవిత 
సహజ దర్పణంగా వుంటూనే త్రిలోక సంచారం చేయిస్తుంది. 
పాదలేపనం ఏమీ లేదు. ఆ పసరేదో మనసుకే ఉంది. 
మాయతివాచి మీద కూచుని లోకాలోకనం చేయడంలో 
నరకలోకం, స్వర్గం ముందు చూసి ఆ తర్వాతే 
భూలోక సంచారం కావించేలా చేస్తాడు. 
నరకసీమ అంతా హైదరాబాద్ వీధుల్లో క్రిక్కిరిసిన జనంతో వుందట. 
కానీ స్వర్గం మటుకు నిర్మానుష్యం. స్వర్గానికి గిరాకీ లేదు. 
ఈ కవి స్వర్గానికి వీసా దొరికేదెవరికి అంటాడు.

ఏ తత్వం, ఏ సిద్ధాంతమూ
ప్రకృతికి అతీతమైన పరిధిలో
అస్తిత్వం వెతుక్కోలేదు


అని ఆరంభంలోనే అద్భుత తీర్మానం చేశాడు. 

భూలోకంలో స్వామీజీ ఆశ్రయాలు, కార్పొరేట్ సీమలు, 
వేశ్యావాటికలు, స్వంత ఊరి స్థితిగతులు, బాలకార్మికులు, 
చట్టసభలు, వారసత్వ రాజకీయాలు, చెట్లు, పక్షులు, పర్వతాలు 
అన్నీ చూసి చివరకు భూగర్భం, గనులు, పాతాళంలో నాగులు సహా మాయతివాచీ అన్నిటినీ దర్శింపచేస్తుంది. 
లోకాలోనం పేర కవి అభివ్యక్తీకరించిన భావాలు 
పఠితులకు కటిక వాస్తవాలను ఆవిష్కరింపచేస్తూ 
అసమసమాజ వైఖరులను ఎండగడుతూ సువ్యవస్థా స్థాపన దిశగా ఆలోచనలను ఉన్మలనం చేస్తాయి. కవి జాగ్రత్ స్వప్నంలోనే వుండి 
నిశ్చల కవితా సమాధిలో కృష్ణగారడీ పన్నినట్టు 
మాయ తివాచిని తనే సృష్టించి పాఠకులను అధిరోహింప చేసి విహరింపచేశాడు. 
వ్యవస్థలోని ప్రస్తుత అవకతవకలను ఎలా దృశ్యీకరిస్తాడో చూడండి-

జపాన్ సునామీలను/ టర్కీ భూకంపాలను మించి
పచ్చి బూతును విచ్చలవిడిగా
ప్రసరిస్తున్న/ వినోద మాధ్యమాలు
*


కోకోనట్టును, చాక్లెట్టును
స్ర్తి రహస్యాంగాలకు/ ప్రతీకలు చేసిన
నీచ గీతాల సినిమా కాలుష్య దుర్గంధం
*


తాతగారి చిత్తకార్తె చిత్తానికి
ముదిమిప్రాయం/ ఒక అభేద్యమైన రక్షణ కవచం
*


అమ్మెవరు? నానె్నవరు/ గతిలేక, భృతిలేక
కన్నబిడ్డల్ని కసాయి వ్యాపారులకు
తెగనమ్ముకున్న దుర్భర దారిద్య్ర సర్పదష్టులు
*


పట్నం హాస్టల్లో చదివే/ కొడుకు భ్రష్టతతెలియని
పల్లెటూరి అమ్మానాన్నల్లా
పైన జరిగే పరిణామాలు ఎరుగని
అమాయకపు తల్లివేర్లు
*


అవినీతి సామ్రాజ్యం నుండి
అకస్మాత్తుగా వచ్చిన నరుడు
విషంకన్నా భయంకరుడు
అగ్నికన్నా దాహకుడు


ఇలా ఎనె్నన్నో దృశ్యాలు, వర్తమాన సమాజలాస్యాలు కవిత్వీకరించిన వైఖరి ఆకట్టుకుంటుంది. 
అభివ్యక్తులు వైచిత్రితో కూడుకున్నవిగా కనిపించినా అందులోని సామంజస్యం కవి హృదయాన్ని గౌరవించమంటాయి.

వేశ్యా వాటికకు కవి నమస్కరిస్తాడు. ఎందుకంటే-


ఈ కామాగ్ని సమిధలే లేకుంటే
అదుపులేని కామాంధుల
మదమెక్కిన మదన ప్రవాహాల పరవళ్లు
తల్లీ, చెల్లి మీదకు మళ్లేవేమో
ఆ ప్రమాదాన్నుండి నా సమాజాన్ని రక్షిస్తున్న
వేశ్యా దేవేరులకు వందనం- 


అంటాడు

చైతన్య స్రవంతిని శాసించేదెవరు? 

నా వస్తువుపై విధి నిషేధాల కత్తులు దూసేదెవరు? 

అనే ధీమాతో చేసిన సంచార యాత్ర ఇది. 
‘ఈ మాయ తివాచీకి ఈ మాయదారి తివాచీకి అంతా తెలుసు’ 
అన్న మాట నిజం. ‘ఒక్క ముక్కా చెప్పదు’ అనే మాట మటుకు తప్పే!

గతానుగతికంగా చదవడం కాదు
పారంపర్యంగా పాడడం కాదు
వీటి వెనుక ఏదో సూక్ష్మం ఉన్నది
దాగి వున్న గూఢమైన మర్మం ఉన్నది


అన్న మాట నిజం! 
ఏమయినా 
ఒక ఆహ్లాద పరిమళ తరంగం 
ఒక తాత్త్విక భావ దీప్తి అందించే దీర్ఘకవిత ఇది. 

ఉరికొయ్య చేయడం కోసం చెట్టును కూల్చేసే 
మానవ మనఃకాలుష్యానికి విచారిస్తాడు కవి.

భూలోక స్వర్గం అనుకునేవారున్న-
వ్యాపారానికి దాక్షిణ్యం వుండదు
ధనానికి హృదయం ఉండదు
ఈ పాపిష్టి స్వర్గంలో పరిభ్రమించే మనిషికి
మానవత్వం ఉండదు.. 


అని తీర్మానిస్తాడు.

జడత్వం నుంచీ/ పొటమరించే చైతన్యం బీజానిది
జడత్వంలోకి/ ఉపసంహరించుకునే చైతన్యం శవానిది


మాయ తివాచీ జడత్వాన్ని బాపి, చైతన్య పథంలో ఆలోచింపచేసి 

నడిపించే దీర్ఘకవితాయానం. 
మేక్ యువర్ ట్రిప్!

-సుధామ



మాయ తివాచి (దీర్ఘకవిత)
-వై.రామకృష్ణారావు
వెల: రూ.100
-నిర్మల ప్రచురణలు,
201, సౌత్‌ఎండ్ పార్క్
రోడ్‌నెం 10, మన్సూరాబాద్, ఎల్.బి.నగర్,
హైదరాబాద్-68



Akshara  19.12.2015

0 comments: