మహిళా ఔన్నత్యానికి నినదించిన గళం
- -సుధామ
- 18/04/2015
:
పురాణేతిహాసాలను పునఃకథనం చేసే ప్రక్రియ సరికొత్తదేమీ కాకపోవచ్చు. రామాయణ భారతాలను సమర్ధించే కథనాలతోబాటు వ్యతిరేకించే కథనాలూ రాసినవారున్నారు. సంచలనాల కోసం వ్యాస వాల్మీకుల కవి దృష్టితోకాక తమ దృక్కోణాలతో ప్రసిద్ధ పురాణ పాత్రలను కొత్త రూపెత్తించిన వారున్నారు.
కాలావధులకు నిలిచి నేటికీ రామాయణ భారతాలు సమకాలీన సమాజంలో మనగలుగుతున్నాయంటేనే వాటి విశిష్టత సార్వకాలీనత అర్థమవుతున్నాయి. వక్రదృష్టితోనో, సంచలనం కోసమో అన్నట్లుకాక, ఈనాటి సామాజిక వ్యవస్థలో మహిళల పట్ల జరుగుతున్న ‘నిర్భయ’ ఉదంతాల నేపథ్యంలో తప్పుని సరిదిద్ది సద్భావనలను ప్రోదిచేసే సంకల్పంతో, భారతంలోని ఒక పాత్రను- ఆ పాత్రలోని ఔన్నత్యాన్నీ, ఆదర్శనీయతనూ ఉన్నతీకరిస్తూ చేసిన ఉదాత్త పునఃకథనమే డా.చింతకింది శ్రీనివాసరావుగారి వికర్ణ నవల.
వికర్ణుడు గాంధారీ సుతుడే. నూర్గురు కౌరవులలోని పదిహేడవవాడే. కానీ, గంజాయి వనంలో తులసి మొక్కలాంటివాడు. ద్రౌపదీ మానసంరక్షణ ఘట్టంలో వికర్ణుడు దుర్యోధన కృత్యాన్ని ఎదిరిస్తాడు. కాకలుతీరిన వీరులున్న సభలో అందరూ చేష్టలుడిగి చూస్తున్న ద్రౌపదీ వస్త్రాపహరణం తగదని ధర్మాధర్మ విచక్షణని వికర్ణుడు నిర్ద్వంద్వంగా ప్రకటిస్తాడు. అలా వికర్ణుడి పాత్ర పట్ల రచయిత బాగా ఆకర్షితులయ్యారు. తన తొలి నవలా రచనకు అతనినే ఆలంబనం చేసుకున్నారు.
‘‘అక్కడా ఇక్కడా అని లేదు. వారూవీరూ అని తేడాలేదు. ప్రతీ వీధిలోనూ, వాడలోనూ, కోటలోనూ, పేటలోనూ స్ర్తిలమీద దాడులు దారుణంగా సాగిపోతున్నాయి. వీటన్నింటి గురించి బాగా ఆలోచిస్తున్నప్పుడే మహాభారతంలోని వికర్ణుణని ఘట్టం గుర్తుకువచ్చేది. ద్రౌపది చీర వొలిచేయాలని తలచిన దుర్యోధనునికి వికర్ణుడే అడ్డుతగలటం ఆశ్చర్యమనిపించింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ గాంధారీ సుతులు. ఏకోదరులు అప్పుడనిపించింది. అప్పటి భారతంలో ఒక వికర్ణుడున్నాడు గానీ, ఇప్పటి భారతావనిలో వీధికో వికర్ణుడుంటేనే కానీ కాంతల కష్టాలు తీరబోవని. అలా వికర్ణుడు నామటుకు నాకు హీరో అయిపోయాడు’’ అంటారు శ్రీనివాసరావుగారు.
వర్తమాన సమాజానికి కురుసభలో ‘చిరుతడు’గానే సంభావింపబడిన ఒక ధర్మపరుని ఆదర్శమూర్తిగా నిలుపుతూ సాగిన నవల ‘వికర్ణుడు’. పఠనయోగ్యంగానే కాదు ఆలోచనాత్మకంగానూ రచన సాగింది.
పిండదశనుంచీ వికర్ణుడి విలక్షణతను ఆతని మహాభినిష్క్రమణం వరకూ ఈ నవలలో రచయిత చిత్రించారు. ఔచీతీమంతమైన కల్పనలు చేశారు తప్ప అభూతకల్పనలు చేయలేదు. అదికూడా ఒక సువ్యవస్థా స్థాపనాలక్ష్యంతో, మహిళా సమాదరణ దృష్టితోచేసిన రచన కావడంతో వికర్ణుడిని ఒక ధర్మపరుడైన ‘మంచి మగవాడు’గా, నిర్భయంగా చెడుకి ఎదురొడ్డి నిలిచే సాహసిగా చిత్రించిన తీరు అడుగడుగునా ఆకట్టుకునేలా వుంది.
అంపశయ్యపై వున్న భీష్మునినుంచి జ్ఞానబోధ పొందడానికి కృష్ణుడి సలహామేరకు పాండవులు దరిచేరినప్పుడు భీష్ముడు-
‘ధర్మజా ఆలోచించి చెప్పు. కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసిన పరిస్థితులు నీకు తెలుసు. ధర్మద్యూతమో, అధర్మద్యూతమో జరిగిన ఘటనలన్నీ ఎరుకే. సర్వం తెలిసినవాడివి. ఇటు నీ తండ్రి పాండురాజు కుటుంబంలోనూ, అటు నీ పెద తండ్రి ధృతరాష్ట్రుని కుటుంబంలోనూ ధర్మబద్ధుడెవరో చెప్పగలవా. ధర్మమూర్తిగా పదుగురికీ ప్రేరణ ఇవ్వగల ఆ మహనీయుడు ఎవరో తెలుపగలవా?’’అని అడుగుతాడు. ధర్మరాజుకే జవాబు అంతుచిక్కలేదు. చివరకు భీష్ముడే చెబుతాడు. ‘‘మన కుటుంబంలో పుట్టిన, ఆ ధర్మప్రభువు వేరెవరో కాదు. నాకంటే ముందే వీరస్వర్గం అలంకరించిన కౌరవ సోదరుడు వికర్ణుడు’’ అని.
దానితో కథ మొదలెట్టారు. మహోదయం, విషభేది, ప్రతిభకు పట్టం, నీతిబాట, కణికవ్యూహం, గురి..సిరి.. తప్పిన శిక్ష, రాజ(అ)సూయం, బహిష్కరణ, పూరుడు.. పూర్వజన్మ త్రివిష్టపం కొండల్లో, యుద్ధం యుద్ధం, పునరాగమనం, మహాభినిష్క్రమణం అనే ప్రకరణాలుగా ఈ నవల వికర్ణుని మహోదాత్త జీవితాన్ని మనకు సాక్షాత్కరింపచేస్తుంది. ఆపత్సమయాల్లో పాండవులకు అడుగడుగునా ముందే వార్త చేరవేసి, హెచ్చరికలు చేసి, వారిని కాపాడుతూ నిలిచిన సుహృదయునిగా వికర్ణుడు గోచరిస్తాడు. అతని సుగుణశీలత ధర్మబద్ధత, సాహసం రచయిత మనోజ్ఞంగా చిత్రించారు. గాంధారీదేవి తన గంతలు విప్పి పిండదశలోనూ, భూమీద పడ్డాక, రాజ బహిష్కార శిక్ష పడినప్పుడూ వికర్ణుని చూసిందని చిత్రించడంలో ధర్మబద్ధుడైన కుమారునిపట్ల ఆ తల్లిప్రేమను రూపుకట్టించారు. వికర్ణుడు ఏదో జన్మలో తన కడుపున పుట్టిన బిడ్డగా ద్రౌపదికి గోచరించాడని రాయడంలో శ్రీనివాసరావు చూపిన విజ్ఞత రసమంచితంగా వుంది.
ద్రౌపది ధర్మవిజితా అధర్మవిజితా అని తేల్చవలసింది జ్ఞానులు అని ధృతరాష్ట్రుడు అన్నప్పుడు.
‘‘జ్ఞానులు ఎవరు జ్ఞానులు. ద్రౌపదిని పణంగాపెట్టిన ధర్మజుడు జ్ఞానవంతుడా. తమ కళ్ళఎదుటే ఆడదానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూకూర్చున్న వయోవృద్ధులు, కురువృద్ధులు జ్ఞానవంతులు. మీ ఆజ్ఞకు వెరచి నోళ్ళు బిడాయించుకున్న సభాసదులు జ్ఞానవంతులా లేక వీరభోజ్యమైన రాజ్యాన్ని పాచికలతో గెలుచుకున్న శకుని, కర్ణ, దుశ్శాసనాదులు జ్ఞానవంతులు. ఎవరు జ్ఞానవంతులు మతితప్పిన కాకులు నిర్వహించే సభ లాంటిది ఈ కొలువు కూటమి ఇలాంటి రాజ్యంలో పుట్టినందుకు పెరిగినందుకు సిగ్గుపడుతున్నాను’’-అంటూ తననుతానే చీదరించుకున్నాడు వికర్ణుడు.
‘‘సమయం వచ్చినపుడు మాట్లాడగలగాలి. వేళమించిపోకుండా బలం చూపగలగాలి. కలసిరాని కాలంలో సైతం మంచివైపు నిలవగలగాలి. ధర్మం మాట్లాడగలగాలి. అదీ మనిషి జీవితానికి అర్థం. మానవ జీవితానికి పరమార్థం’’ అని నిండుకొలువులో ధర్మజుడితోనే అన్న వికర్ణుడి సందేశం నేటి భారతంలోనూ శిరోధార్యం. నేటి కొలువుకూటములు, నేటి నాయకులు కూడా వికర్ణుడు చెప్పినట్లుగానే కానరావడం విషాదమే!
‘‘రాజ్యాన్ని సక్రమంగా పాలించడానికి, పేదలను ఆదుకోవడానికి కొన్ని సందర్భాల్లో శాస్త్రాలు ఉపకరించకపోవచ్చు. ధర్మగుణం, నీతి నిజాయితీలు తప్పక ఉపయోగపడతాయి. స్ర్తిలు గౌరవాన్ని అందుకునేచోట మానవత ప్రకాశిస్తుంది. మహిళల ఔన్నత్యాన్ని కాపాడగలిగేది వికర్ణుని వంటివారే. వీరి సంఖ్య ఎంత పెరిగితే ప్రపంచానికి అంత ప్రయోజనం. వికర్ణుని చరితను ఔదలదాల్చగల సమాజం అమ్మలను గౌరవించగలదు. ఆరాధించగలదు. అందుకే వికర్ణుని నడత పదుగురికీ తెలియజేయండి అతని గుణగానం చేయండి. ఇదే నేను ప్రధానంగా చేయగల ధర్మబోధ. ఈ యుగానికైనా, రేపటి కలియుగానికైనా...’’అని భీష్ముని ముఖతః నవల చివరలో చింతకింది శ్రీనివాసరావు చెప్పించిన మాటలకు ఈ నవలా రచన ద్వారా ఆయన చెప్పిందే చేసి చూపించారు. భారతేతిహాసపు ఈ పునఃకథనం విహారిగారన్నట్లు ‘ఒక చారిత్రక అవసరం’. ఇదొక వాంఛిత ఫలం. రచయిత బహుధా అభినందనీయులు.
వికర్ణ (నవల)
-డా.చింతకింది శ్రీనివాసరావు-
వెల: 110 రూ./-
శ్రీనిజ ప్రచురణలు,
6-60/1, రవీంద్రనగర్,
పాత డెయరీ ఫారం
- విశాఖపట్నం-40;
-డా.చింతకింది శ్రీనివాసరావు-
వెల: 110 రూ./-
శ్రీనిజ ప్రచురణలు,
6-60/1, రవీంద్రనగర్,
పాత డెయరీ ఫారం
- విశాఖపట్నం-40;
0 comments:
Post a Comment