ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, March 22, 2014

సున్నితమైన పోహళింపు ‘జూకామల్లి’




ఎంత చేయి తిరిగిన రచయిత్రి (త్రు)లయినా కథలుగా కొన్ని ఇతివృత్తాలను ఎన్నుకోవడానికి వెనుకాడతారు. మరీ ముఖ్యంగా సామాజికమైన ప్రచారాంశాలుగా వుండే వాటి జోలికి పోదలుచుకోరు. అందులో సృజనాత్మకత లేదని కొందరి భావన అయితే ఆ అంశాలకు ప్రచారకులుగా తమపై ముద్రపడుతుందేమోనని కొందరి జంకు. కానీ నిజానికి ప్రతిభామతి అయిన రచయిత (త్రి) ఎలాంటి ఇతివృత్తాన్ని ఎన్నుకున్నా పఠితలో ప్రభావోపేతంగా దానిని కథనం చేయవచ్చు. నిజానికి రచయితగా సమాజహిత చింతనతో అలాంటి అవసర విషయాల పట్ల పఠితను ఆలోచనాత్మకంగా చేసి ఆచరణ శీలిని చేయడం బాధ్యత కూడాను.
మునుపు ‘మనసున మనసై’ కథా సంపుటితో జ్యేష్ఠ లిటరరీ అవార్డును కూడా అందుకున్న ఉత్తమ కథారచయిత్రి డాక్టర్ కె.బి.లక్ష్మి ఇటీవలే వెలువరించిన ఇరవై ఒక్క కథల సరికొత్త సంపుటి జూకామల్లి. అనుభూతి గాఢత, కవితాత్మకత, రమణీయశైలి గల కె.బి.లక్ష్మి ఈ కథల సంపుటిలోని కొన్ని కథల ద్వారా సమాజం పట్ల బాధ్యతగల రచయిత్రిగా కూడా తనను తాను నిరూపించుకుంటోంది. ఇది ఆహ్వానించదగిన పరిణామం. ఎందుకంటే ‘కాంతా సమ్మిత తయోపదేశయుజే’ అని కావ్యప్రయోజనాన్ని ప్రాచీనులు నిర్దేశించినట్లు- ఎవరు ఎలా చెబితే నలుగురూ వింటారో, చెప్పిన మంచిని అనుష్ఠిస్తారో అలా చెప్పగల కమనీయ కథనశైలి కె.బి.లక్ష్మిలో పుష్కలంగా వుంది.
‘జూకామల్లి’ అని సంకలనానికి పేరుండడంలోనే మంచి విజ్ఞత కనబడుతుంది. నిజానికి జూకా అంటే చెవులకు స్ర్తిలు పెట్టుకునే ఒక నగ. మల్లి అంటే సౌరభాలు వెదజల్లే పుష్పం. అలంకారం ఏదయినా అలంకారం కోసం కాక నలుగురికీ పరీమళాలు అందించే ప్రయోజనశీలమైనప్పుడే సార్థకత అని ధ్వనింపచేశారు. జూకామల్లి అంటే నిజానికి ఒక రకం మల్లెపూవే! అది వ్రేలాడే అందమే కాదు పరీమళ పరివ్యాప్తి కూడాను. రచయిత్రియే అన్నట్లు ఊహలు తక్కువ. చాలావరకు జీవితాను భవంలోనుంచి వచ్చిన వాస్తవాలే. అత్యల్పంగా అనిపించే వాటినే విలక్షణంగా, హత్తుకునే రీతి సందేశ సంభరితంగా, అందరికీ పరిచితిలోని సినిమా పాటల మాటల ఔచిత్యప్రయోగ మధురిమలతో, సంసార సరాగాల సంభాషణలతో శృంగార హాస్యాల సున్నితమైన పోహళింపులతో చెప్పడం లక్ష్మీ కథన కళ.
ఈ సంకలనంలోని మొదటి కథ జనని. వీరేశం, సావిత్రిల అపురూప పుత్రిక జనని. వీరేశానికి కూతురంటే ప్రాణం. అతని బావమరిది సదాశివకు చెల్లెలు సావిత్రి అంటే ప్రాణం. సదాశివ కోరిక మీద జనని అయిదో పుట్టినరోజు వేడుకలు అతని ఊళ్లో జరిపించారు వీరేశం దంపతులు. వీరేశం ఆరోగ్యంకోసం మొక్కుకున్న సావిత్రిని జనని తమ దగ్గర వదిలి సిరిపురం గుడికి వెళ్లడానికి ఒప్పించినా తీరా బయలుదేరే వేళకి రోడ్డుదాటిన వారిని చేరుకోడానికి ‘నాన్నా నేనూ వస్తా’ అంటూ జనని పరుగుతీసి వేగంగా వస్తున్న వాహనం గుద్దుకుని ఆసుపత్రికి తీసుకెళ్ళగా మరణిస్తుంది. అసలే అనారోగ్యపు వీరేశం స్పృహ తప్పిపడిపోతాడు.
‘‘మీ ముందు ఒక్కటే పరిష్కారం వుంది. పాప ప్రాణం ఏ క్షణంలోనైనా పోవచ్చు. కొన ఊపిరితో వుంది. అయితే కళ్లు కాలేయం, మూత్రపిండాలు ఇతర రోగులకు ఉపయోగించవచ్చు. ఆలోచించండి. సమయం తక్కువగా ఉంది’’ అని పాప పోయేముందు డాక్టర్ చెప్పగా సావిత్రి గుండె రాయి చేసుకుని ‘డాక్టర్ చెప్పినట్లు చెయ్యి అన్నయ్యా’ అంటుంది. పాప కిడ్నీతో వీరేశం పునర్జన్మనెత్తుతాడు. పాప రెండు కళ్ళు కంటి ఆస్పత్రికి, లివర్ గ్లోబల్ ఆస్పత్రికి పంపుతారు. మరో కిడ్నీతో అదే ఆస్పత్రిలో ఇంకో రోగికి అమరుస్తారు. అలా జనని తన తండ్రినే బ్రతికించుకుని నలుగురికీ మహాప్రాణదాత అయింది. ఈ కథ ‘అవయవదానం’ అన్న అంశం మీదనే అయినా కథాకథనం పఠితను కదిలిస్తుంది.
సంకలనం పేరిట ‘జూకామల్లి’ ఓ కవితాత్మక కథనంగా ఉత్తమ పురుషలో సాగుతుంది. నడుము కింది భాగం పోలియోవల్ల చచ్చుబడిపోయినా ఆమెను ప్రేమించి పెళ్లాడిన కృష్ణ సాంగత్యంతో అనురాగవల్లిగా ఎదిగి సాధికారతను సాధించిన ఉద్యోగిని అయిన మహిళ కథ జూకామల్లి. ఆ చెవుల జూకాల తూగులో, ఊగులో సంతోషం పరివ్యాప్తం చేసిన సుతార భావుక కథ ఇది. పల్లెలో దూరాల్ని పట్నం దగ్గరచేసిందనిపించే ‘ఊరుమారినా ఉనిక మారునా’, సభావేదికల మీద గ్రంథ సమీక్ష చేసే వారి స్థితిని పరిస్థితిని వ్యంగ్యంగా విశదపరిచే ‘సమీక్ష’, బాల కార్మిక సంక్షేమ స్ఫూర్తి తెలిపే ‘చెలిమి’, టీవీ ఛానెళ్ళ అర్థం పరమార్థం అందుకోవాల్సిన తీరు తెన్నులను చమత్కారంగానూ, విచక్షణాత్మకంగానూ అందించే ‘ఇప్పుడు కాసేపు బ్రేక్!’ వంటి కథలు ఎన్నో ఇందులో. వైవిధ్యంతో, విలక్షణతతో చదివించి అలరిస్తాయి. కథలో సంభాషణలు నడపడంలో కె.బి.లక్ష్మిది ఓ ప్రత్యేకత. సరసంగా, సహజంగా, సున్నితంగా విషయాన్ని విశదం చేస్తూ కన్విన్స్ చేయగల రచనా ప్రతిభ తనది. కేవలం కథారచయిత్రి మాత్రమేకాక బాధ్యతగల ఓ జర్నలిస్టు, ఒక సాధికారిక వనిత కూడా కాబట్టే లక్ష్మి కథలు ఉపదేశాన్నీ ఉత్సాహాన్నీ కూడా రంగరించుకుని జీవితం పట్ల ఒక మమకారాన్నీ, మనుషుల పట్ల ప్రేమనీ, మానవీయ విలువల పట్ల ఆచరణాత్మకతనూ ప్రేరేపించేవిగా భాసిస్తూంటాయి.

జూకామల్లి (కథలు)-
డా.కె.బి.లక్ష్మి
- స్నేహనికుంజ్ ప్రచురణలు
206, బిషన్ అపార్ట్‌మెంట్స్, 
పంజగుట్ట, హైదరాబాద్- 82; 
వెల: 140 రూ/-





0 comments: