ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, January 17, 2014

బెట్టింగ్ పండుగ



‘‘ ‘పండుగ’ అంటే ఈ రోజుల్లో సంప్రదాయబద్ధమైనది మాత్రమే అనుకుంటే సరికాదు. ఓ గెలుపుని- ‘పండుగ’ చేసుకోవడం అనే అంటున్నారు. ఎన్నికల్లో గెలిస్తే పండుగ, క్రికెట్‌లో గెలిస్తే పండుగ, ఓ వెధవపని విజయవంతంగా చేస్తే కూడా పండుగ. అంచేత పండుగకు అర్థం మారిపోయింది. ఇవ్వవలసిన దానికన్నా ఓ రూపాయి ఎక్కువిచ్చి ‘పండగజేస్కో’ అంటారింకొకరు. ఇలా పండుగకు అర్థాలే మారిపోయాయి’’ అన్నాడు సన్యాసి.

‘‘అవును. ఏ వేడుకకయినా ఏ ఉత్సవానికయినా పండగ అనే పదం వుంది. పండగ అనకుండా ‘పర్వం’ అంటారు కొందరు. పర్వం అన్నా పండుగ అనే అర్థమే అయినా, అదనంగా పర్వం అనేదానికి అవసరం, లక్షణభేదం, అంశం, భాగం అనే అర్థాలున్నాయి. భారతంలో అనుశాసన ‘పర్వం’ అంటే- అక్కడ ‘పర్వం’ అన్నదానికి ‘్భగం’, ‘అంశం’ అని అర్థం. అలాగే ‘పబ్బము’ అనే మాటా వుంది. ‘పబ్బం గడుపుకోవడం’ అంటే పండగ చేసుకోవడం అనేదానికన్నా, ‘అవసరం తీర్చుకోవడం’ అనే అర్థం రూఢి అయింది. నువ్వు అర్థాలే మారిపోయాయి అంటే నాకు ఈ అర్థాలు గుర్తుకువచ్చాయి’’ అన్నాడు ప్రసాదు.


‘‘అర్థాలు మారడం సరే! అర్థవంతంగా పండగలు జరుగుతున్నాయా నేడు అనేది గ్రహించుకోవాల్సిన సంగతి. ఉదాహరణకు సంక్రాంతి పండుగే చూడండి. ఒకప్పటిలా హరిదాసులు, జంగమదేవరలు, బుడబుక్కల వాళ్లు ఎక్కడ కనబడుతున్నారు? గంగిరెద్దుల వేడుక కూడా మందగించింది. కొంతలో కొంత నయం ఏమిటంటే ఇంటి ముంగిళ్ళలో రంగు రంగుల రంగవల్లికలు కనబడుతున్నాయి. సంస్థలవాళ్ళు, పత్రికలవాళ్ళు కూడా ముగ్గుల పోటీలు అంటూ పెట్టి కనీసం వాటిని ప్రోత్సహిస్తున్నారు. బహుమతుల కోసమైనా స్ర్తిలు ముగ్గులు వేసే అలవాటు నిలుపుకుంటున్నారు. అసలు సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ. పెద్దల పండుగ. ఎందరు ఈ పండుగకు కనీసం పెద్దలతో కలిసి వుంటున్నారనేదీ నేటి రోజుల్లో సందేహంగానే ఉంది. పోయిన పెద్దలకు తర్పణాలు వదలడం కాదు, ఉండగానే వాళ్ళను వృద్ధాశ్రమాలకు తరలించి చేతులు కడుక్కునే వారు తయారవుతున్నారు. ఇది విచారించదగిన విషయం’’ అన్నాడు శంకరం.


‘‘అవును శంకరం! గొప్ప సమాజం అంటే అనాథాశ్రమాలను, వృద్ధాశ్రమాలను వీలయినంత ఎక్కువగా కలిగినది అనుకుంటే అది పొరపాటు. వాటి అగత్యం లేని వ్యవస్థ కావాలి. అభివృద్ధి అంటే మనం ఎన్ని ఎక్కువ పోలీస్ స్టేషన్లున్నాయి, ఎన్ని సి.బి.ఐ కోర్టులు పెరిగాయి అన్న లెక్కన ఆలోచించే దురవస్థలో పడ్డాం. రాజకీయ వ్యవస్థలో ఇనే్నళ్ళ తరువాత ఓ ఆమ్ ఆద్మీ పార్టీ రావడం గొప్ప అనుకునే దుస్థితిలో వున్నాం. కేంద్రంలో అధికారంలో వున్నవారే దేశ సమైక్యతకు, పటిష్ఠతకు నలుగురినీ కలిపి నడిపించలేని నేతృత్వ దరిద్రంతో, విడగొట్టడం గొప్ప అభివృద్ధి అని ఆలోచించే దౌర్భాగ్యంలో పడ్డారు. డివైడ్ అండ్ రూల్ పాలసీ బ్రిటీష్ ప్రభుత్వానిది అని ఒకప్పుడు నిరసించినవారే నేటి అధికార రాజకీయాలకు అదే విధాయక సూత్రం లా జపిస్తున్నారు. అవినీతి తిమింగలాలనూ, హింసానేరాల అనకొండలను అదుపు చేయలేక ఒక నిర్భయ చట్టం రావడం గొప్ప పండగ అనీ, సెక్స్ నేరంలో ఇరుక్కున్న ఓ హైకోర్టు జడ్జిని అరెస్టు చేయడమే గొప్ప పండుగ అనీ అనుకునే వైఖరులకు నెట్టబడుతున్నాం. ఇది నిజానికి పరమ విషాదం కాక మరేమిటి?’’ అన్నాడు సన్యాసి.


‘‘పండుగకని అందరూ పల్లెలకు తరలి వెడుతున్నారనీ, నగరాలు ఈ సందర్భంగా ఖాళీ అయి నగర వీధులు బోసిపోతున్నాయని వార్తలు రాసుకుని, ఫొటోలు వేసుకుని అదే పండుగ వైశిష్ట్యంగా మురిసిపోతున్నాం. పల్లెటూళ్లు కూడా ‘బెట్టింగ్ పర్వా’లతో మురుస్తున్నాయి కానీ పర్వాలేదనుకునే సంప్రదాయ ఆచారాల పాటింపులతో కాదు. కోడిపందేలు పేర బెట్టింగ్ వ్యాపారాలు సాగుతున్నాయి. నగరాల్లో గుర్రపు రేసులకన్నా ఇవాళ సంక్రాంతి రోజుల పల్లెల కోడిపందేలు జూదపర్వానికి ఏమీ తీసిపోవడంలేదు. అవి కూడా కక్షలు, కార్పణ్యాలకు దారితీస్తున్నాయి. పట్నాల బడాబాబులు పండుగకు పల్లెలకు తరలివెళ్ళడం ఊరిమీద ప్రేమతోనూ, మనుషులమీద ఆప్యాయతానురాగాల కోస మే నిజంగా అయితే బానే వుంటుంది. కానీ దాని ముసుగులో ఇలాంటి కోడిపందెపు జూదక్రీడల ఆర్థిక వ్యవహారాలే మూలకందమవుతే అది సంతోషించదగిన పరిణామం ఎలా కాగలుగుతుంది. ఇది ‘పబ్బం గడు
పుకోవడమే’ అవుతుంది మరి’’ అన్నాడు ప్రసాదు.


‘‘మీరన్నది నిజమే కావచ్చు. కానీ అంతా ఇంతే అని నిరాశాజనకంగానూ, కేవలం నెగెటివ్ ధోరణులతోనూ ఆలోచించడం సరికాదు. గతంలోని మంచిని నిలుపుకోవాలనే ఆరాటం ఈ తరంలో లేకపోలేదు. ఎంత ఎంత ఎడమైతే అంత విలువ తెలిసి వస్తుందన్నట్లు కన్నవారికీ, జన్మభూమికీ దూరంగా విద్యా ఉద్యోగార్థమై తరలిపోయిన వారిలో ఈ విషయం బాగా తెలిసి వస్తోంది. తాము కోల్పోతున్నదేమిటో ఆర్థికంగా ఎంత ఉన్నత స్థితిలో వున్నా మానసికంగానూ, హృదయగతంగానూ తమకు లోపిస్తున్నదేమిటో ఆ లోపం ఎలా పూడ్చలేనిదో సుఖం ఎలా తృప్తిలో ఇమిడివుందో సంతోషం ఎలా వైయక్తికంకాక సామూహిక సంబంధియో అర్థమవుతున్నకొలదీ తమ జీవితాలు ఎంత అర్థరహితమైవో ఎంత సంపన్నులకయినా అర్థమవుతోంది క్రమంగా. మార్పు కోరుకుంటున్నారు మనుషులు. అది కాదనలేని సత్యం. ఆ మార్పులు కేవలం ఆర్థికంతో కాక హార్దికంతోనూ ముడిపడాలన్న కాంక్ష బలీయమవుతోంది. అది ఆహ్వానించదగిన పరిణామమే. డబ్బూ దస్కం భారీగా ఖర్చుచేసి చేసుకున్నది కాక నలుగురితో కలిసి హృదయుగమంగా చేసుకునేదే అసలైన పండుగ. కాదని బెట్టింగ్ చేసేవారుంటారా?’’ అన్నాడు రాంబాబు లేస్తూ.




0 comments: