ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, December 13, 2013

ఆమె ఆర్మీ- ఆమ్ ఆద్మీ
‘‘గుడి కడుతున్నారట ఆవిడకు. అంత మహిమాన్వితమైన విషయం ఏముందట’’ అన్నాడు ప్రసాదు ముఖం చిట్లిస్తూ.

‘‘అమ్మమ్మ! అంత మాటనేయకు. ఆవిడతో ముడిపడి బోలెడు దైవికం వుంది. ఇటలీలో బార్‌లో వైట్రెస్‌గా వున్న ఆమెకు అసలు ఇండియాకు ఇందిరాగాంధీ హయాంలో యువరాజు లాంటి రాజీవ్‌గాంధీ పరిచయం కావడమే ఓ దైవికం. ఆ ప్రణయం పరిణయంగా పరిణమించడం ఓ దైవికం. అత్తగారూ, భర్తాకూడా దారుణంగా హత్యలకు గురికావడం అంతా ఓ దైవికం. అట్టి దైవిక స్ర్తి భారతదేశపు ప్రధాని బాధ్యతను ఇటలీ పౌరసత్వం వదులుకోవడం ముందు పణంపెట్టి వదిలేసుకుని త్యాగమూర్తి రూపెత్తిందా లేదా? భజనపరులు, పూజారులు వున్నప్పుడు పసుపు పూసిన రాయి అయినా దేవతామూర్తి రూపెత్తినట్లు ఈవిడకు దేవతా ముద్ర అంటగట్టడంలో ఆశ్చర్యం ఏముంది’’ అన్నాడు శంకరం.


‘‘క్షుద్ర దేవతలకు కూడా గుడికడతారు లేవోయ్ ప్రసాదూ! నూట పాతికేళ్ళ పైబడిన కాంగ్రెస్‌ను అవినీతితో ఈనాటికి గొప్పగా క్షుద్ర పరచిన ఘనత ఆవిడదే కదా! స్కామ్‌ల జాడ్యంతో మంత్రివర్గంలోని ప్రముఖుల పేరున కూడా గొప్ప నాచు పట్టింది ఆమె హయాంలోనే కదా! ప్రధానిని ఓ ‘వెర్రిపప్ప’ను చేసి కూచోబెట్టిందీ నిరంకుశ ధోరణిలో గొప్ప వెలుగులీనుతున్న తెలుగుజాతి విచ్ఛిత్తికి సంకల్పించిందీ ఆవిడే కదా! అంతకు మించిన మహిమలు ఏం కావాలి? ప్రజాస్వామ్యం పేరుతో అవతలివారిని నోరెత్తనీయకుండా తాను చేయాల్సిందంతా చేసేయగలిగే శక్తి స్వరూపిణి కదా! గుడి కట్టడానికి సమకట్టే తిక్క శంకర్రావులుండడంలో ఆశ్చర్యం ఏముంది’’ అన్నాడు సన్యాసి.


‘గుడి కట్టినా గుంట తిప్పి గంటకొట్టేసే పరిస్థితులున్నాయిలే. అయినా ‘మనవాళ్ళు వట్టి వెధవాయిలోయ్’ అని గిరీశంగారు ఊరికే అనే్లదు. మనవాళ్ళ రూటే వేరు. ‘గుడి కడుతున్నాం’అని ఒకరంటే, ‘సమాధి కడుతున్నాం- చందాలివ్వండి’ అంటారింకొకరు. ఆవిడ వైభవ ప్రాభవాలు క్రమంగా వెలవెలబోతున్నాయి. కట్టకుండానే ఆలయం శిథిలమయ్యేలా తోస్తోంది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాక ఆవిడ శక్తి ఏమిటో ఏది దైవికమో ఏది దేశికమో అర్ధమవడం లేదా?’’ అన్నాడు మళ్ళీ ప్రసాదే.
‘‘మానవుడే మహనీయుడూ- శక్తిపరుడు- యుక్తిపరుడు మానవుడే అని సినీ కవిగారు ఊరికే అనలేదు. కూకటి వ్రేళ్ళతో సహా బలంగా పాతుకున్న మహావృక్షాన్ని కండలు కరిగించే మనిషే నిలువునా కూల్చేయగలడు. అందునా చీడ సోకిందంటే ఎంతటి వృక్షాన్నయినా పెకలించక తప్పదేమో! ఇప్పుడు ‘ఆమ్ ఆద్మీ’అంటే సామాన్య మానవుడు ఢిల్లీలో దానికే పూనుకున్నాడు. కేజ్రీవాల్ నెలకొల్పిన ఆమ్‌ఆద్మీ ‘్ఢల్లీ పీఠాన్ని’ గడగడలాడించింది. కొద్ది మాసాల్లోనే ఒక చైతన్యం తేవడమేకాదు ఎన్నికల బరిలోకి దిగి ఊహించని సీట్లు గెలుచుకుంది’’ అన్నాడు శంకరం.


‘‘మన రాష్ట్రంలో లోక్‌సత్తాపార్టీకి జనంలో ముందు మంచి పేరే వుండేది. అయితే ఒక్క జయప్రకాశ్‌నారాయణ్ తప్ప ఎవరూ ఆ రాజకీయ పార్టీనుండి గెలవలేదు. అసెంబ్లీలో ఆయన వట్టి ‘ఏకోనారాయణ!’ అయినా ఆయన ప్రసంగిస్తూంటే వినబుద్ధి వేస్తుంది. వివేకం కనిపిస్తుంది. తీరా ఆచరణ దగ్గరకు వచ్చేసరికి మాత్రం అదేదో వట్టి ఆదర్శవాదంగా తేలిపోతూంటుంది. అన్నాహజారే, కిరణ్ బేడీ వంటివారి సమర్ధనంతో కేజ్రీవాల్‌గారి ‘ఆమ్‌ఆద్మీ’ పార్టీ సరణీ అంతేననుకున్నారు. కానీ అనూహ్యంగా కేవలం ఆదర్శాలు వల్లిస్తున్నారనుకున్న స్థితిలోంచి ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల బరిలోకి దిగి రెండు పదులకు పైగా స్థానాలు గెలుచుకోవడం సామాన్యమైన సంగతేమీకాదు. బి.జె.పియే నివ్వెరపోయింది. నిజానికి కాంగ్రెస్‌పై వ్యతిరేకతవల్ల బి.జె.పి. ఆ మాత్రం లాభించింది కానీ కొత్తగా వచ్చిన ‘ఆమ్‌ఆద్మీ’ మీద ప్రత్యామ్నాయ విశ్వాసం నెలకొనడం గాఢంగా జరగలేదు గనుక రెండు పదులపై సీట్లు మాత్రమే వచ్చాయి. మార్పుకు ప్రజలు ఆత్రంగా వున్నారని మాత్రం బాగా అర్ధమవుతోంది’’ అన్నాడు సన్యాసి.


‘‘ ‘మార్పు మేమే తెస్తాం అని కదా’కాంగ్రెస్ కూడా బీరాలు పలికేది. మార్పు అంటే ఉన్నది మారడంతో చాలదర్రా! ఉన్నతికి స్థానం చేకూరగలగాలి. ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితమే కవి సుధామ రాసిన కవిత ఒకటి గుర్తుకొస్తోంది నాకు.


మార్పు రావలసిందే
ప్రజలంతా అరిచారు
మాకూ సమ్మతమే
ఏలినవారి తల ఊపుడు


చైతన్యం చెంగలించి
వెలుగువెల్లువ ప్రవహించి
మార్పుకు
ప్రజలంతా చేతులెత్తితే


ఏలినవారు
చేతుల్లోని చైతన్యశక్తినికాక
చంకలోని వెంట్రుకలు చూస్తున్నారు.


ఇవాళ కాంగ్రెస్ తెస్తానంటున్న, విభజనతో సమకూరుస్తానంటున్న ప్రగతి వీక్షణం వైఖరి ఇలాగే వుంది. ఇప్పటి ఎన్నికల ఫలితాలు కేవలం ఆయా రాష్టాలవే. కానీ 2014 సాధారణ ఎన్నికలను జాతీయ దృక్పథంతో ప్రజలు చూస్తారు కనుక మాదే మళ్ళీ అధికారం అన్న ధీమా కాంగ్రెస్ వ్యక్తీకరిస్తోంది. కానీ కాంగ్రెస్ శక్తులన్నీ ఇవాళ క్షుద్రశక్తులుగా పరిణమిస్తున్నాయి.
తెగ నరకడాలు, తెగ ఉరకడాలు కనిపిస్తున్నాయి. మొండితనం, నిర్లక్ష్యం వంటి క్షుద్ర ధోరణులే వ్యక్తమవుతున్నాయి. ఒక ప్రక్క మోడీతో ఢీకొట్టాలి. మరోపక్క చాపకింద నీరులా విస్తరిస్తున్న ఆమ్‌ఆద్మీ చైతన్యశక్తిముందు తన ఆధిపత్యశక్తి ప్రజావిశ్వాసంతో నిలబెట్టుకోగలగాలి. అలా కానప్పుడు ఆమె-‘ఆర్మీ’ అయినా, ‘ఆమ్ ఆద్మీ’ ముందు బలాదూరే! ఇతరేతర శక్తులు లేస్తే ఎనే్నళ్ళ భవంతులయినా పడిపోయెను పేకమేడలై అనుకోక తప్పదు.’’ అన్నాడు రాంబాబు ప్రసాద్ భుజం తట్టి లేస్తూ.


2 comments:

Ganti Lakshmi Narasimha Murthy said...

చాలా బాగుంది సుదామ గారూ-గంటి

narayana said...

హ హా..భలే విశ్లేషించారు సర్...ఈ సందర్భంగా ఓ జోక్ గుర్తొచ్చింది...మోడీ, ఆమ్ ఆద్మీ బలపడకుండా నిరోధించాలంటే,, కాంగ్రెస్ నేతు --వాటిలో చేరితే సరి...అని ఎవరో సలహా....మీ వ్యాఖ్యానం చాలా బాగుంది