ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, November 29, 2013

సంక్షిప్త సందేశ సంరంభం







‘ఈ సెల్‌ఫోన్లు రాకముందు కొన్నాళ్ళు ‘పేజర్లు’అని వుండేవి. వాటితో మాట్లాడడం అనేది కుదిరేది కాదుగానీ ‘మెసేజ్’లు పంపబడేవి. ఆరోజుల్లో అదే గొప్ప. ముఖ్యంగా వృత్తిపనివారలకు అందునా ఎలక్ట్రీషియన్స్, కార్పంటెర్స్, మెడికల్ రిప్రజెంటేటివ్స్, సేల్స్‌మెన్స్‌కు అవి చాలా ఉపయుక్తంగా వుండేవి. పేజర్‌కు మెసేజ్ రాగానే కావల్సిన చోటికి హుటాహుటిన బయలుదేరి వెళ్ళగలిగేవారు. ఇప్పుడు సెల్‌ఫోన్లు విరివిగా వాడుకలోకి వచ్చినా మెసేజ్‌లు పంపడం అనే దాని విలువ తగ్గలేదు. ‘ఎస్సెమ్మెస్’లు పంపడం అనేది గొప్ప రివాజుగా చెలామణీ అవుతోంది. మాట్లాడాల్సిన అవసరం లేకుండా సందేశాలు పంపడం అనేది అలవాటుగా బాగానే చెలామణిలో వుంది మరి’’ అన్నాడు శంకరం సెల్‌ఫోన్ చూసుకుని జేబులో పెట్టుకుంటూ.

‘‘సందేశాలు అనగా మెసేజెస్ అనే వాటికి గిరాకీ ఎప్పటికీ వుంటుందోయ్! మేఘసందేశాలు, పావురాల సందేశాలు గతంలోనే వున్నాయిగా! ‘సందేశం’అంటే మహాత్ముల వచనాలే కానక్కర్లేదు. ఈ వ్యవహార సందేశాలు వేరులే! అందునా సంక్షిప్త సందేశాలు విలువగలవి. అసలు ఎస్.ఎమ్.ఎస్. అంటే ‘షార్ట్ మెసేజ్ సర్వీస్’ అనేకదా! సెల్ ఫోన్‌నుండి సెల్‌ఫోన్‌కు ఎస్సెమ్మెస్‌లు పంపుకోవడం నేటి కుర్రకారు మరీ ఎక్కువగా చేస్తూంటారు. ‘‘పొన్ చేయకపోతే పోయారు. కనీసం ఓ మెసేజ్ ఇవ్వచ్చుకదా!’’ అని సహచరులను నిలదీయడం జరుగుతూ వుండే వ్యవహారమే. అసలు ఈ ఎస్సెమ్మెస్‌ల కారణంగానే భాష కూడా అదీ ఇంగ్లీష్ కూడా బోలెడు పరివర్తనం చెందుతోంది. కొత్తకొత్త ప్రయోగాలు భావ వినిమయంకోసం ఈ ఎస్సెమ్మెస్‌ల కారణంగా రూపుదాలుస్తున్నాయి. ‘బిఫోర్‌యు’ అనడానికి ‘"B4U'’ అనీ, ‘గ్రేట్’ అనడానికి ‘Gr8’ అనీ ఇలా సంధేశం పంపడంలో ఒరవడులు మారిపోయాయి. ‘LOL’, ‘DUDE’ లాంటి ప్రయోగాలు వచ్చాయి. దానికితోడు ‘స్మైలీస్’అంటూ హావభావాల ముఖకవళికల గుర్తుల బొమ్మలు కూడా ఎస్సెమ్మెస్‌లతోటి చేరిపోతున్నాయి. చూస్తూంటే ఒక్కసారి ఆశ్చర్యం కలుగుతూంటుంది కూడాను.’’ అన్నాడు ప్రసాదు.


‘‘అసలు పెరిగిన సాంకేతికతే ఒక గొప్ప అచ్చెరువు! ‘టెక్స్ట్’రూపంలో షార్ట్‌మెసేజ్ సర్వీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా వినియోగింపబడుతున్న ‘డేటా అప్లికేషన్’. ఫోన్స్‌లో, అంతర్జాలంలో మూడున్నర బిలియన్లకంటే అధికంగా నిత్యం వినియోగిస్తున్న వారున్నారుట. 2010నాటికే మొబైల్ ఫోన్ వినియోగదారుల్లో 80శాతం మంది ఎస్సెమ్మెస్‌లకు అలవాటుపడిపోయారట. గ్లోబల్ సిస్టమ్ ఆఫ్ మొబైల్ కమ్యూనికేషన్స్ జిఎస్‌ఎమ్‌లో భాగంగా 1985నాటికి ఇది గుర్తింపబడింది. సంక్షిప్త సందేశాలు పంపడానికి 128 బైట్స్‌కన్నా ఎక్కువ పొడుగు సందేశం పంపడానికి మొదట్లో కుదిరేది కాదు. 160 కేరక్టర్లవరకూ సందేశం పంపడానికి సరిపోతాయని ఫ్రాంకో జర్మన్ జిఎస్‌ఎమ్ కోపరేషన్‌కు చెందిన దీని సృజనకర్తలనదగిన ఫ్రైడ్లెమ్ హిల్లీబ్రాండ్, బెర్నార్డ్ గిల్బెర్ట్ 1984లోనే భావించారట. మల్టీ నేషనల్ కొలాబరేషన్ సహకారంతో ఎస్‌ఎంఎస్‌ల సాంకేతిక సాధ్యమైంది. ఈ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకోగల అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు ఎస్సెమ్మెస్‌ల విలువ బాగా పెరిగింది. బ్యాంకునుంచి మీరు ఎటిఎం నుంచి డబ్బు డ్రాచేయగానే మీ మొబైల్ ఫోన్‌లో ఎస్‌ఎంఎస్ వచ్చేస్తుంది. ఆన్‌లైన్లో రైలు టిక్కెట్టు కొనగానే కూడా ఎస్‌ఎంఎస్ వచ్చేస్తుంది. అసలు కాగితం పొదుపు పేర ఈ టిక్కెట్టు ఏదయినా ప్రింటవుట్ తీయకుండా మీ ఫోన్లో ఎస్‌ఎంఎస్ అందుకున్న సందేశం చూపితే చాలు పని జరిగిపోతుంది. ఇంట్లో టిక్కెట్టు మర్చిపోయామన్న బెంగ అక్కర్లేదు. అయితే బ్యాంక్‌ల నుండి ఇలా ఎస్‌ఎంఎస్‌లు అందుకోవడానికి ఇకపై వినియోగదార్లనుండి సర్వీస్ ఛార్జీలు వసూలు చేయాలని కొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు జారీచేసిందట. మీ పేర పోస్టులో ఓ ఉత్తరమో, పార్సిలో ఏదయినా వస్తే ముందస్తుగా మీకు ఉచితంగానే ఆ విషయం ఎస్‌ఎంఎస్ సందేశంగా పంపడానికి తపాలాశాఖ సరికొత్తగా నిర్ణయం తీసుకుంది. అంతెందుకు ‘వేటు ఎస్సెమ్మెస్ డాట్‌కామ్’వంటి సైట్స్‌నుండి గ్రూప్‌గా ఒక సందేశం అనేకమందికి ఉచితంగా పంపగల సౌకర్యమూ ఇవాళ వ్యవహారంలో వుంది. నేర పరిశోధనలకు కూడా ఎస్‌ఎంఎస్‌లు సహకరిస్తున్నాయిట. ఇదంతా ఎంత మార్పు?
టీవీ షోలకు, గేమ్‌షోలు కౌన్‌బనేగా కరోడ్‌పతి వంటి వాటికి ఎస్సెమ్మెస్‌ల ప్రాధాన్యత ఎంతో చెప్పక్కర్లేదు. ‘‘మీకు నా పెరఫార్మెన్స్ నచ్చితే ఫలానా నెంబర్‌కు ఫలానా విధంగా ఎస్‌ఎంఎస్ పంపండి’’అని తెరమీద అభ్యర్థనలు చూస్తూనే వున్నాంగా! ప్రపంచపు ఏడు వింతల్లో తాజ్‌మహల్ వుండాలా వద్దా అని కూడా ఆమధ్య ఎస్‌ఎంఎస్ సర్వే చేశారు. ఇవాళ ప్రతిదానికీ ఈ ఎస్‌ఎంఎస్‌ల ‘హవా’కూడా పెరిగిపోతోంది. మా కబుర్లు మీకు నచ్చితే గుడ్ కీపిటప్ అని టైప్‌చేసి 9849297958 అనే నెంబర్‌కు ఎస్సెమ్మెస్ చేయండి అని మనంకూడా మిత్రులను, ఇతర సాహితీ అభిమానులను అడగాలేమో మరి! సంక్షిప్త సందేశాల సంరంభం అలా వుంది మరి’’ అని నవ్వుతూ లేచాడు ప్రసాదు.








1 comments:

సుధామ said...


Kameshwari Prasad బాగుంది సుధామా. నిజంగా ఇవి చాల పనికివస్తాయి. నా ఫొన్ బిల్ ఎంతొ తగ్గింది దీనివలన. అదీ కాక అవతలవాళ్ళు పనిలో ఉంటె ఇది చూసుకుని వీలు ఉన్నప్పుడు తిరిగి ఫొన్ చెయ్యవచ్చు. నేను పూర్ణా అలాగె టచ్ లో ఉంటాము. నాకు ఆఫీసులో తనని ఇబ్బంది పెడుతున్నాన్న గిల్ట్ ఉండదు కూడ.