‘అప్రస్తుత ప్రసంగం’ అనేది ఒకటుంది. సాధారణంగా ‘అవధానాల్లో’ అది ‘రంజకం’గా కనిపిస్తూంటుంది. కానీ దాని అసలు లక్ష్యం- ఒక సమస్యను పరిష్కరించడానికో, నిషిద్ధాలను దాటుకుంటూ నిర్దేశిత విషయాన్ని సాధించడానికో, సమాయత్తమైన వారి ఏకాగ్రతను భగ్నం చేయడానికే! చుట్టూ ‘పృచ్ఛకులు’ సంధించే వాటికి సమయోచితంగా సమాధానం చెప్పుకుంటూ, ‘అవధాన విజయం’ సాధించడం సామాన్యమైన సంగతేమీ కాదు.
ప్రస్తుతం ప్రత్యేక తెలంగాణకు సమాయత్తమైన కేంద్ర ప్రభుత్వం వ్యవధానం దొరకని అవధాన పరిస్థితిలోనే పడింది. నిషిద్ధాక్షరులు దాటుకుంటూ, వ్యస్తాక్షరి కూర్చుకుంటూ, పురాణ పఠనాలు గుర్తిస్తూ, దత్తపదులను పట్టుకుంటూ, సమస్యను పరిష్కరించడానికి సంసిద్ధమైనవేళ- అప్రస్తుత ప్రసంగం ఎక్కువైపోతోంది. తమాషా ఏమిటంటే ప్రతి పృచ్ఛకుడూ అప్రస్తుతంలోకి దిగబడుతూంటే ఎలా?రాష్ట్ర విభజన అనే అవధాన విజయంకోసం- హైదరాబాద్ రవీంద్రభారతి ఘంటసాల ప్రాంగణంలో శతరూప ప్రారంభంగా అవధాన సప్తాహం నిన్నటితో ముగిసిందేమోగానీ, కేంద్రంలో అవిచ్ఛిన్నంగా ఇంకా సాగుతోంది. మూడు నెలల్లో సమస్యకు పరిష్కారం దొరికి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడవచ్చని దిగ్విజయ్సింగ్గారు, షిండేగారు అభిలషిస్తున్నారుట! అంటే వంద రోజుల ‘శతరూప’ ఫలితం సాకారమవుతుందలా అనుకోవచ్చామరి?’’ అన్నా డు శంకరం ప్రవేశిస్తూ.
‘‘బాగుందోయ్! ‘అవధానం’ నీకు బాగా తలకెక్కినట్లుంది. సంతోషం! కానీ చూసావ్! ఇప్పుడు ‘నిషిద్ధాక్షరి’అని వుంది కదా! ‘నిషేధం’ అంటే ఏమిటి? ఒక సినిమానో, ఒక పుస్తకాన్నో నిషేధించారు అంటే- అది ముందు రూపొందాలి కదా అసలు! అప్పుడు ‘నిషేధం’ అన్న మాటకు ఔచిత్యం వుంది. అవధానంలో ‘నిషిద్ధాక్షరి’లో ఏం చేస్తున్నారు? అవధాని సమాయత్తమైన విషయం మీద- ఆశువుగా రచనా ప్రక్రియ ప్రారంభించగానే, ఆయన ఓ అక్షరం అనగానే, తరువాతి అక్షరం ‘ఇలా వుండబోతుంది’అని ఊహించుకుని, ‘అది వద్దు’ అని ఓ అక్షరం చెబుతాడు నిషేధాక్షరి నిర్వాహకుడు. అప్పుడు అవధాని మరో రకంగా ముందుకెడతాడు. అసలు ‘నిషేధం’ అంటే చెప్పబోయేది ఇతనే ఊహించి వద్దనడం ఏమిటి? చెప్పిన తరువాత అది వద్దని, దానికి ప్రత్యామ్నాయం చెప్పమనాలి. ఇదిగో! ఈ అసలు సిసలు ‘నిషిద్ధాక్షరి’ ఇప్పుడు సాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ప్రకటించాక ఆ ప్రక్రియ కొనసాగడానికి ‘అక్షరాలా’ హైదరాబాదే అవరోధం అవుతోంది. ‘విభజన’వద్దని ఓవైపు ‘సెగలు’. ‘హైదరాబాద్ అక్షరం’ విషయంలో మార్పు చేయమని మరోవైపు ‘సైగలు’. కంగాళీ అవకతవక పెరుగుతూ- అధిష్ఠానావధానిపై ఒత్తిడి పెరుగుతోంది. అవు నూ! ఇంతకీ నీవనే ‘అప్రస్తుత ప్రసంగం’ సంగతి కొంచెం వివరించకూడదూ?’ అన్నాడు రాంబాబు నవ్వుతూ.
‘‘ ‘హైదరాబాద్’ తెలంగాణాలో భాగం కాదు. అసలు ‘తెలంగాణా’యే హైదరాబాద్లోని భాగం. అంచేత హైదరాబాద్ తమదేననడం హాస్యాస్పదం’’ అని ప్రస్తుతంలో మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు ‘అసరుద్దీన్ ఒవైసీ’ ప్రసంగించారు. అది అప్రస్తుతం కాదంటారాయన! తెలంగాణ రాష్ట్రానికి ఈ పేరు ఎట్లా వచ్చిందో తెలియని వారంతా- ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంకోసం పోరాడుతున్నామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారట! సుమారు ఏడువందల సంవత్సరాల క్రితం కాకతీయులపై మొగల్ సైనికులు దాడిచేసి, రాజుని యుద్ధంలో చంపేసి, సైనికాధ్యక్షుడు యుగంధర్ని బందీగా ఢిల్లీ తీసుకెళ్ళారనీ, అక్కడ అతను తన పేరును ‘ఖాన్-ఎ-జహామక్బూల్ తెలంగాణీ’గా మార్చుకోడానికి ఒప్పుకుని, మళ్ళీ ఓరుగల్లు చేరుకుని, ఆ ప్రాంతానికి మొఘలుల ప్రతినిధిగా వ్యవహరించి, పరిపాలన సాగించాడనీ, ఆయన పేరుతో ఓరుగల్లు రాజ్యం- ‘తెలంగాణ’గా రూపాంతరం చెందిందనీ ఒవైసీ అన్నారు. ‘తెలంగాణ’ పేరు రావడానికి మూలమైన ఆ వీరుని గురించి తెలంగాణవాదులు పట్టించుకోకపోవడం, పైగా ‘తెలంగాణ’ పేరు ఎలా ఏర్పడిందో చరిత్ర తెలియకుండా, ఆ ప్రాంతాన్ని ‘ప్రత్యేక రాష్ట్రం’గా చేయాలని పోరాడడం ఏమిటనీ ఆయన విమర్శించారుట. రాష్ట్ర విభజన విధాయకమంటున్న తరుణంలో ఇదీ అప్రస్తుత ప్రసంగమే కదా!
అలాగే విభజనన్నదానికి వై.సీ.పి. నాయకురాలు షర్మిల ‘‘విభజన అంటే- తల, మొండెం వేరు చేయడమా?’’అంటూ- హైదరాబాద్ అనే ‘తల’ లేకుండా కోస్తాంధ్ర అయినా, సీమ అయినా, తెలంగాణ అయినా ‘మొండేలు’గానే వుంటాయనీ, మూడు మొండేలకు ఒకే తల అనేది వుండదు కనుక, ‘సమైక్య మొండెం’గానే ‘తల’తో తలెత్తుకు తిరగాలనీ- అభిభాషిస్తోందిట! ‘‘తలలు బోడులైన తలపులు బోడులా’’ అంటారు గానీ- సోనియాగారి విభజన తలంపు ‘బోడి’గానే వుందని ఇంకొందరు అప్రస్తుత ప్రసంగం చేస్తున్నారు. ‘‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’అంటే, బోడి తలకు పూలెక్కడ చుట్టగలం?’’అని అపహసిస్తున్నారు. ఇంతకీ శత రూపాలుగా విభజన గురించీ, విభజనను అడ్డుకోవడం గురించీ, ‘అప్రస్తుత ప్రసంగాలు’ సాగుతూనే వున్నాయి. ఏవి రంజాకాలో, ఏవి భంజకాలో మాత్రం తెలియడంలేదు. సమస్యాపూరణంతో, అవిచార ధారాధారణతో- కేంద్ర అధిష్ఠానావధాన విజయం ఎప్పటికోమరి!’’ అన్నాడు శంకరం రాంబాబు భుజం ఆసరాగా లేస్తూ.
1 comments:
కేంద్ర అధిష్టావధానం మూడునాలుగు నెలలలో విజయవంతమై తీరుతుంది!తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతుంది!ఇది సత్యం!పులుగడిగిన ముత్యం!ఇది సుధామధురం!!!
Post a Comment