ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, August 16, 2013

దేవు‘డే’దిక్కు?



‘‘తుంటి మీద కొడితే మూతి పళ్ళు రాలాయ’ని ఓ సామెత. ‘పొసగనివన్నీ’అనుకుంటాం కానీ, ఎలాగోలాగా ‘పొసిగేలా’ చేయడం ఓ తమా షా విద్య! ‘పుండు ఒకచోట (వుంటే) మందు ఒకచోట’ రాయడం గొప్ప రాజకీయమే! జరిగే పరిణామాలకు- ‘నిమిత్తమాత్రుల్లా’ వుండేవారు కొందరయితే, తమ ‘నిమిత్తమే’జరుగుతోందని భావించేవారు కొందరు. కంగాళీ అవకతవకలు సృష్టించి, ఆకుకూ అందక పోకకూ అందక, మొత్తానికి ‘సున్నం’రాసే పరిస్థితులే- పొడచూపుతున్నాయంటే, పార్టీల దృష్టిలో పౌరులెంత ‘వెర్రిపప్పాయలుగా’ కనిపిస్తున్నారో అర్థం అవుతోంది.’’అన్నాడు రాంబాబు.

‘‘నేతలకూ, పార్టీలకూ ఎవరి స్వలాభం వారికి కావాలి గానీ, సామాన్యుడి గోడు పట్టిందెవరికి చెప్పండి? ‘నువ్వు దంచుతూ వుండు నేను భుజాలు ఎగురవేస్తాను’ అన్నట్లుగా, జనాన్ని ‘గోదా’లోకి దింపి, తాము మాత్రం తమ భద్రతల్లో ‘దాగి’వ్యవహరించే దరిద్ర నేతృత్వమే అంతటాను! పైగా ఈ నేతలకూ, బడాబడా వ్యాపారవేత్తలకూ సంబంధ బాంధవ్యాలుంటాయి. శాసించేది అంతా ఆర్థికమే. ఆ ఆర్థికబలం అంతా వ్యాపారవేత్తల వద్దే పోగుపడి వుందాయె! ‘విదేశీ హస్తం’ ఒకటి వుంటుంది. ‘కనబడని చెయ్యేదో ఆడుతోంది నాటకం’అన్నమాట అర్థరహితమేమీ కాదు. దేశ ఆర్థికవ్యవస్థ కూడా విదేశీ ‘డాలర్’తో ఎప్పుడో ‘పీటముడి’ వేసుక్కూర్చుందాయె! రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా మన తెలుగువాడు దువ్వూరి సుబ్బారావు స్థానంలో ఆర్థిక మంత్రి చిదంబరంగారికి సలహాదారుడైన రఘురామరాజన్ నియమించబడడంలో వింతేమీ లేదు! ఆయన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ‘ఐ.ఎం.ఎఫ్’కు ప్రధాన ఆర్థికవేత్తగానూ పనిచేసినవారే! రూపాయి విలువతో పోలిస్తే డాలర్ విలువ పెరగడం పెద్ద విషయమేంకాదనీ, దాన్ని పట్టించుకోకూడదనీ, రూపాయి స్థిరీకరణతో రిజర్వ్ బ్యాంక్‌కు ఏమిటి సంబంధమనీ? అడిగిన పెద్దమనిషాయన! పెద్దఎత్తున విదేశీ బ్యాంకులను అనుమతించాలని సూచించిన వారాయన! ఇంకా సెప్టెంబర్ నాలుగున రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందే, ఇప్పుడే-ఆయన అభిప్రాయాలు ఇలా వున్నప్పుడు, ఆయన ఎవరికి ‘రెడ్‌కార్పెట్’ పరవగలరో ఊహించలేమా? డాలర్ రేటు డెబ్భై రూపాయలకి చేరినా, ఇవాళ సామాన్యుడి కూడులో ముఖ్యావసరమైన ఉల్లిపాయ ధర వంద రూపాయలైనా ఈ ఆర్థికవేత్తలకు ఏం పట్టింది? దేశ అభివృద్ధి రేటు పెంచినట్లు చూపించడమే, ‘మసిపూసి మారేడుకాయ’ చేయడమే గానీ, సామాన్యుడి జీవన స్థితిగతులను ‘బాగుపరచాలనే చిత్తశుద్ధి ఏదీ?’’ అన్నాడు సుందరయ్య ఆవేదనగా.


‘‘అవును సుందరయ్యా! క్రిందటి నెల 28న ఆర్థిక మంత్రిత్వశాఖలో విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్.ఐ.పి.బి) కోట్ల ఒప్పందాలకు తలూపిన రోజునే, మన ప్రధాని మన్మోహన్‌సింగ్‌గారు తన నివాసంలో మన దేశపు అంబానీలూ, బజాజ్‌లూ మొదలైన వ్యాపారవేత్తలతో సమావేశం నిర్వహించి, భారతదేశంలో అభివృద్ధిరేటు పెంచేందుకు తోడ్పడమనీ, అందుకు వారికెలాంటి సహాయం కావలసినా తాము ఇవ్వసిద్ధమేననీ, పెట్టుబడులు, ఆదాయాలు పెరగాలి అనీ, వాక్రుచ్చారట! తమాషా ఏమిటంటే-మన దేశంలో అగ్రస్థాయి పారిశ్రామికవేత్తలనుకునే పది మందీ, బ్యాంకులకు లక్షాముప్ఫైవేల కోట్లమేరకు ‘బాకీ’వున్నారుట! ఫైనాన్స్ కమిటీలోని పెద్దమనిషి చెప్పిన సంగతే ఇది! మరి బ్యాంకుల్లోని ఈ డబ్బంతా నిజానికి ఎవరిది? ప్రజలు దాచుకున్నదే! అంటే ఏమిటన్నమాట? ప్రజలను కొట్టి, వ్యాపారవేత్తల బొక్కసాలు నింపడంలో ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది గానీ, నిజానికి ప్రజలకోసం, వారి బాగోగులకోసం చేస్తున్నదేమిటనే ప్రశ్నకు సమాధానం ఏదీ’’ అన్నాడు రాంబాబు.


‘‘తాము చెల్లించాల్సిన అప్పులపై మారటోరియం కోసం, విదేశీ పెట్టుబడులపై ఆంక్షల సడలింపుకోసం బడా పారిశ్రామికవేత్తలు నిస్సిగ్గుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ‘ప్రజాసంక్షేమం’అని వల్లించే ప్రభుత్వం- ‘దెయ్యాలు వేదాలు వల్లించిన’చందాన, వారివైపే మొగ్గడానికి తయారవగలదు గానీ, ప్రజాసమస్యల పరిష్కారం విషయంలో ‘పిల్లిమొగ్గలే’ వేస్తూంటుంది! పేద ప్రజలకు ఇల్లుకట్టించి ఇచ్చే పథకానికి పనె్నండువేల కోట్లు ఇవ్వడానికి నిధులులేవన్నారట ప్రధానమంత్రిగారు. కేవలం తన ఇంటినే అంత ఖర్చుచేసి నిర్మించుకున్న ఓ పారిశ్రామికవేత్తను మాత్రం తలకెత్తుకుంటారు. ఇవాళ రాష్ట్ర విభజన నాటకంలోనూ- కనబడని పాత్రధారులు, వ్యాపారవేత్తలూ వున్నారు. ‘కొత్త రాజధాని’అన్నమాట వెలువడగానే ‘అలర్ట్’అయిపోయి, ఎందరు ఎన్ని రకాలుగా ఎలా సంసిద్ధులవుతున్నారో పాపం! ఈ రోడ్డెక్కి ఆందోళనచేస్తున్న సామాన్యులకేం తెలుస్తుంది?
ఆందోళనలతో నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు పెరిగిపోతూంటే- ఆ ప్రభావం పడేది సామాన్యుడి మీదే గానీ, భుజం భుజం రాసుకు తిరిగే పార్టీల నేతలదీ వ్యాపారవేత్తలదీ ‘భద్ర జీవనమే’ కదా! పైకి ఆడే నాటకాలు వేరు, ప్రజలకు కనబడే తీరు వేరు, వెనక వ్యవహార సరళి వేరు. కానీ ఇదంతా ప్రజల విచక్షణలోకి వచ్చేది ఎలా? వచ్చినా, వారేం చేయగలుగుతున్నారు? ‘సమ్మె’ట పోట్లు ప్రజలనెత్తికే! నాయకులకు కావలసింది ‘ఓట్లు’. పారిశ్రామికవేత్తలకు కావలసింది ‘నోట్లు’. ‘తూట్లు’పడేది ప్రజా జీవనానికే. ‘పాట్లు’పడేది వాళ్ళే! ‘మాట్లు’వేసుకున్నా- అతుకులు అతుకులే! ఈ పేదలవి చితికిన ‘బతుకులే’! ‘నిర్ణయాలు మారవు, ప్రక్రియలు ఆగవు’...‘దిక్కులేని వారికి దేవుడే దిక్కు’ అంటారు గానీ, ‘‘నిన్నూ, ఈ దేశాన్నీ రక్షించడం నావల్ల కాదయ్యా!’’అని ఆయనే ‘చెయ్యి’చ్చేట్లున్నాడు.’’ అంటూ నిట్టూర్చి లేచాడు సుందరయ్య.




0 comments: