ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, July 6, 2013

‘సీమ జనం’ వెతలకు దర్పణంఅక్షర
అనుభూతి కి కవిత్వం. వాస్తవికాభివ్యక్తి కి వచనం. ఈ రెండూ కలిసి పచనం చేస్తే రెండు వైపులా నాణ్యమైన బతుకు విలువ చెలామణీ. వేంపల్లి గంగాధర్ వస్తుతః కథకుడు. తన ‘మొలకల పున్నమి’ కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ తొలి యువ పురస్కారం అందుకున్న రచయిత. ‘నేల దిగిన వాన’ గంగాధర్ మొదటి నవల. నవల కాన్వాస్ విస్తృతమైంది కనుక తన కవిత్వ రచనాభిలాష, వ్యాసరచనా మమకారం, పరిశోధనా కౌతుకం, జానపద గీత సేకరణాసక్తి అన్నింటినీ తీర్చేసుకుంటూ, నవలను సీమ ప్రజల సమస్యలకు, సంస్కృతీ సంప్రదాయాలకు, వర్తమాన కల్లోలాలకు తలకెత్తిన ఒక కలగూర గంపగా అందించాడు.

నవల రాయలసీమ రైతు చెబుతున్నట్లుగా సీమ మాండలికంలో సాగుతూనే, ఆ రైతే రచయిత ఆశల, ఆశయాల ప్రతినిధి కనుక రచయిత గొంతు కవిగా, వ్యాసకర్తగా, పరిశోధకునిగా పరిపరి విధాల వివిధ సందర్భాలలో ద్యోతకమవుతూంటుంది. రాయలసీమ నీటి కరువు ప్రాంతం. రైతుకు భూములున్నా వాన లేకపోతే పంటలు పండవు. కరువు తాండవించే కాలమాన పరిస్థితులే అధికం. ఆ కారణంగానే బతకడం కోసం సీమలో జనం అప్పులు చేయడం, భూములు అమ్ముకోవడం, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకో, అనైతిక చర్యలకో పాల్పడుతూండటం గల్ఫ్ దేశాలకు వలస పోవడం, ఇసుక అక్రమ రవాణాలు, పిల్లల్ని వ్యభిచారంలోకి దింపడం వంటి వాటికి పాల్పడుతూంటారు-అన్న కటిక నిజాన్ని చెప్పడమే నవల లక్ష్యం. వ్యధార్థ జీవిత యధార్థ దృశ్యాన్ని చిత్రించడమే రచయిత సంకల్పం. ఆ సంకల్ప సిద్ధి మాత్రం పాఠకుడు గ్రహించ గలుగుతాడు. మాండలికం కొందరికి, కవిత్వ వచనం కొందరికి మింగుడు పడకపోవచ్చేమో గానీ రెండింటినీ పాఠకుడికి సవ్యంగా సరళంగా అందించే కృషి చేశాడు రచయిత. ఏ పాత్రలతో పాఠకుడు సహానుభూతి చెందాలో అది చెందుతాడు.

సినిమా రీళ్లలా సాగిపోయే దృశ్యాల పరంపరతో పాఠకుడిని నవల తన వెంట తీసుకువెడుతుంది. గ్రామీణ సమాజంలోని బహుముఖీన పార్శ్వాల్ని రచయిత నవలలో చిత్రించారు. రహస్యంగా ఎర్రచందనం చెట్లు నరికి అమ్ముకునే నైచ్యం, మట్కా జూదం ప్రభావం, ముంపు సమస్య కారణంగా వలసల భావం, రేపిస్టే బాధితురాలిని వివాహం చేసుకోవాలనే గ్రామ పెద్దల తీర్పు వంటి సంఘటనలతోపాటు సంక్రాంతి నాటి పల్లె అందాలు, సంస్కృతి, ఎద్దుల పోటీలు, వర్షం కోసం కప్పలను పూజించే తంతు వంటి అంశాలను కూడా సాకల్యంగా వివరించారు. పత్రికలకు స్పెషల్ ఫీచర్స్ రాసే అలవాటు, పరిశోధనాత్మక విమర్శ వ్యాసరచనా నైపుణి గలవాడు కావడం కారణంగానే గంగాధర్ నవలలో సందర్భానుగుణంగా వెల్లడించే వివిధ విషయాలు ఆసక్తికరంగా తోస్తాయి. రాయలసీమ ఫ్యాక్షనిజంపైన, సీమ గిరిజన తండాల నుంచి వ్యభిచార వృత్తిలోకి తరలిపోయే మహిళల వృత్తాంతాలు వేంపల్లి గంగాధర్‌కు బాగా తెలుసు. అందువల్లనే ఆయా విషయాలు కథాగతంగా చెబుతున్నప్పుడు పాఠకుడిపై బలీయంగా ముద్ర వేయగలుగుతాయి. మధ్యతరగతి రైతు వెతకు ఎత్తిన కన్నీటి జోత ఈ నవల. అయితే వేంపల్లిలోని ఆశావహ దృక్పథం గొప్పది. కన్నీటి బతుకుల కథే అయినా జీవితంపై ఒక ఆశనూ, విశ్వాసాన్ని పాదుకొల్పేలా నైరాశ్యపు తెరలు తొలగిస్తూనే రాశాడు.

‘ఆ రోజుల్లో.. ఆ బంగారు కాలాల్లో.. రైతు రాజుగా లోకాలు ఏలే కాలాల్లో.. మట్టి మిద్దె వసారాలో దూలానికి జొన్న కంకుల గుత్తి తగిలించి తను పండించిన పంట వైభవాన్ని ప్రదర్శించే రోజుల్లోని మాధుర్యం కావాలి’ అంటాడు.

‘దేవుడా! నువ్వంటూ ఉంటే ఈ మనిషిని రక్షించు ఈ ప్రపంచాన్ని రక్షించు. కాలి బూడిదై పోతున్న నైతిక విలువల్ని పరిరక్షించు. దోచుకోవాలని చూస్తున్న మనిషి ఆలోచనల్ని మార్చు. సాటి మనిషికి సాయం చేసే విశాల హృదయం ఇవ్వు. నైతికంగా పతనమైన మనిషికి పవిత్ర ఆత్మను ప్రసాదించు. ఈ విలువల వత్తి ఆరిపోతే విశ్వమంతా గాడాంధకారం అలుముకుంటుంది. అదే అసలైన ప్రళయం. దయ వుంచి అలాంటి ప్రళయం వద్దు తండ్రీ. జీవితం కొందరికి విలాసాల వేడుకవుతోంది. మరి కొందరికి విషాదాల వలయం.. ఇలా కొందరి జీవితాలు శోకాక్షరాలతో లిఖించిన కన్నీటి గీతం ఎందుకవ్వాలి? ఈ హెచ్చు తగ్గుల సమాజమెందుకు? వద్దు.. వద్దు.. వద్దు తండ్రీ!’
మానవ సంబంధాల మధ్య అంతర్వాహినిలా ప్రవహించే ప్రేమను ప్రసాదించు’ అని వేడుకుంటాడు కర్షకునిగా ఈ కవి రచయిత ‘నేల దిగిన వాన’లో. ప్రార్థించే పెదవులు కన్నా పనిచేసే చేతులు గొప్పవి. గంగాధరుడు ‘నేల దిగిన వాన’ నందించడం సంతోషం.

నేల దిగిన వాన (నవల)
-డా.వేంపల్లి గంగాధర్
వెల: రూ.70/-
పాలపిట్ట బుక్స్, 4/432,
వివేకానంద నగర్,
కడప - 516 001


0 comments: