ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, July 5, 2013

‘తల’పెట్టుకోగలం
‘‘మెడమీద తలకాయ ఉన్నవాడు ఎవడయినా ఒప్పుకునే విషయం-సర్వావయాల్లోకి ‘శిరస్సు’ అనగా, ‘తల’యే ప్రధానం అని. దీనికి మీరు ‘శిరఃకంపం’ చేస్తారా లేదా?’’ అన్నాడు సన్యాసి నవ్వుతూ.

‘‘నాయనా! ‘తల ఊచకపోతే’ నువ్వూరుకుంటావా? ఆ ‘శిరోవేద’నకన్నా బుద్ధిగా ‘బుర్రూపడమే నయంలే!’’ అన్నాడు ప్రసాదు. 

‘‘ఒక మనిషిని గుర్తించడానికి అతని కనుముక్కు తీరూ, నోరూ ఇవే ప్రధానం. ఇవి అన్నీ ‘ముఖం’లోనే ఉంటాయి. ‘తలకాయ’ లేకుండా ఒట్టి ‘మొండెం’ వుంటే, ఎవరెవరో అస్సలుగుర్తించలేం.బాంబువిస్ఫోటనాలప్పుడు-అలాంటి ప్రమాదాలెదురవుతుంటాయి. ఓ మనిషి తల 2.27 నుండి 13.61 కేజీల వరకూ బరువుంటూంటుందట! తెలివైన వాడని చూపడానికి కార్టూన్లలో ఒక్కోసారి, పెద్ద తలకాయ వేస్తూ వుంటారు. అలాగే ఇంట్లో పెద్దవారిని -‘పెద్ద తలకాయ’గా వ్యవహరిస్తుంటారు. ‘తల’భాగం అంటే ముందు భాగం అని అర్ధం. స్ర్తికి ‘తలోదరి’ అనే వ్యవహారం ఉంది. దరిద్రుడిని ‘తలమాసినవాడు’ అనీ, అందరితో చనువుగా వుండే వాడిని ‘తలలోనాలుక’ అనీ, అవమానాన్ని ‘తలవంపులు’ అనీ, విజయాన్ని ‘తలఎత్తుకు తిరగడం’ అనీ, ఇలా ‘తల’తో ముడిపడిన భావాభివ్యక్తులు ఎన్నో ఉన్నాయి! ఆర్థికాభివృద్ధిని కూడా ‘తల’సరి ఆదాయంతో గుర్తిస్తూంటాము. తలమీద ముసుగులు, పాగాలు, టోపీలు పవిత్రతకు, హుందాతనానికి, హోదాకీ సంకేతాలు. పోలీసులు, జవానులు తలమీద టోపీతోనే గౌరవింపబడతారు. అంచేత ‘తల’గొప్పది. గొప్పదంటే గొప్పది!’’ అన్నాడు సన్యాసి మళ్లీ. 

‘‘ఒప్పుకున్నాం కదు నాయనా! కాదన్నా-తలలు మార్చే బంటువి నీవని మాకు తెలుసు. నువ్వన్న దానికి ఔనని తలవంచుకు వెళ్లి పోవలసిందే తప్ప, కాదని ‘తల’ ఎవరెగరేయగలడు’’ అన్నాడు ప్రసాదు వినయం చూపుతూ.

‘‘తలలు మార్చడమా? అదొక్కటే ఇంకా సాధ్యం కానిది. మాటవరసకు అంటారుగానీ-మన వున్న తలతీసి, కొత్త తల తగిలించుకోవడం అసాధ్యం. గుండె మార్పిడీ, కాలేయ మార్పిడీ, మూత్రపిండాల మార్పిడీ ఇలా ఏవన్నా మార్చేయచ్చుగానీ, తల మార్చేయడం కుదరదుగదా! పురాణాల్లో పార్వతి సృష్టించిన వినాయకుడి తలను, శివుడు నరికేసి, ఆ తరువాత ఏనుగు తలపెట్టి బ్రతికించాడని-మనకు తెలుసు. అంతేగానీ, మానవ మాత్రులెవరికీ అలాంటి పని అసాధ్యం మరి’’ అన్నాడు సన్యాసి.

‘‘సన్యాసీ! నువ్వింకా ఎక్కడో ఉన్నావ్? నువ్వు ఎదగాలి. అంటే అడ్డంగా కాదు. ‘తల’లోనే ఎదగాలి. ఇవాళ ‘సైన్సు’ ఎంతగానో అభివృద్ధి చెందింది. ఇటీవలే ఇటలీ శాస్తజ్ఞ్రులు-ఇప్పుడు మనిషి తలను కూడా మార్పిడి చేసే అవకాశం ఉందని చెప్పారు తెలుసా?’’ అన్నాడు సుందరయ్య. 

‘‘అవునా? అదెలా?’’ ఒక్కసారిగా ఆశ్చర్యం ప్రకటించారు సన్యాసి, ప్రసాదు కూడాను. 

‘‘సెల్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో సాధించిన ప్రగతి కారణంగా-మరో రెండేళ్లలో, తలను మార్చేయగల ‘శస్త్ర చికిత్స’ సాధ్యమేనంటున్నారు వారు. ఇటలీకి చెందిన ‘ట్యూరిన్ అడ్వాన్స్‌డ్ న్యూరో మాడ్యులేషన్’ గ్రూపు పరిశోధకులు, తలమార్పిడీశస్త్రచికిత్సలపైఅధ్యయనంచేస్తున్నారు.‘‘తలమార్చేయచ్చు...
ఇక ముందు ముందు’’ అని తలస్పర్శిగా కాక, ఘంటాపథంగా చెబుతున్నారు’’ అన్నాడు సుందరయ్య. 

‘‘ఓ!అవునా? మై హెవెన్’’ అన్నాడు ఆశ్చర్యంగా ప్రసాదు ముక్కున వేలేసుకుంటూ. 

‘‘దాన్ని వాళ్లు ‘హెవెన్’ అనే పిలుస్తున్నారోయ్ ప్రసాదూ!‘హెడ్ అనెస్టొమోసిస్ వెంచెర్’-హెవెన్‌గా పిలుస్తున్న ఈ తలమార్పిడి ప్రక్రియకు సంబంధించిన ప్రతిపాదిత ప్రాజెక్టు గూర్చిన వివరాలన్నింటినీ, ఇటలీ శాస్తవ్రేత్తలు తాజాగా వెల్లడించారు’’ అన్నాడు సుందరయ్య. 

‘‘అది కాదు సుందరయ్యా! తలనుంచి శరీరానికి చేరే నరాలు అనేకానేకం ఉంటాయి కదా! తల మార్పిడి ఎలా సాధ్యం అవుతుంది? తలను అతికించడం అంటే మాటలా? సరిగ్గా ఎలా అతుక్కుంటుంది?’’ సందేహంగా అడిగాడు సన్యాసి. 

‘‘చూడు బ్రదర్! తలనుంచి శరీరానికి చేరే నరాల్లో కనీసం పదిశాతం వాటిని అనుసంధానం చేస్తే సరిపోతుందని శాస్తవ్రేత్తలు వెల్లడిస్తున్నారు. ‘పాలిమర్ జెల్’తో తలను అతికించవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఇంకా విస్తృతమైన అధ్యనాల వల్లా, పరిశోధనల వల్లా తప్పకుండా సత్ఫలితాలు సాధించగల అవకాశం ఉందని శాస్తవ్రేత్తలు అంటున్నారు’’ అన్నాడు సుందరయ్య. 

‘‘అయితే మునుముందు అమ్మకానికి కూడాతలకాయలుదొరుకుతాయేమో! ‘కొబ్బరికాయ’ కొనుక్కున్న ట్లు, కావలసిన ‘తలకాయ’ కూడా కొనుక్కోవచ్చునేమో! మన ‘తల’ మనమే మార్చేసుకోవచ్చునేమో! ‘తల’పోస్తేనే చిత్రంగా ఉంది సుమా! ఏమైనా మానవుడి తలకాయే తలకాయ!’’ అన్నాడు ప్రసాదు తల పంకించి లేస్తూ.
2 comments:

kapilaram said...

తలలు మార్చి తలలు పెట్టుకోగలం...కాని మంచి పని మాత్రం తలపెట్టలేం ....

సుధామ said...

మంచిమాట అన్నారు రామకుమార్ గారూ!