ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, April 26, 2013

అకాలకృత్యాలు!



‘‘అసలు కలికాలం అంటే ఏమిటి అంటే ధర్మం దారి తప్పడమేననీ, విలువల పతనం అనీ, సక్రమం అక్రమంగా మారడమేననీ మన పెద్దలు ఊరికే అనలేదు? ఇంకా కలిపురుషుడు పూర్తిగా రాలేదట గానీ ఆ కలి ప్రభావాలు మాత్రం బహుథా కనిపిస్తూనే వున్నాయి’’ అన్నాడు సన్యాసి పేపర్ మడిచి టీపాయ్ మీద పెడుతూ.

‘‘సక్రమం అక్రమంగా మారడం అనేది మటుకు నిజమే అనిపిస్తోందోయ్! కాకపోతే అసలు మనకొక కాలమూ, ఋతువులూ, వాటి ప్రభావమూ అనే క్రమం ఒకటుంది కదా! మునుపు తదనుగుణంగానే ఫలితాలు, పర్యవసానాలు చాలామటుకు కనబడుతుండేవి. అలాంటిది ఇటీవల విపరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అంతెందుకు? మొన్నటికి మొన్న ఎండాకాలం అని మనం అనుకుంటూండగా వానాకాలంలో లాగా జోరువాన పడింది. ఉన్నట్టుండి ఈదురుగాలులు. అవి కూడా మామూలుగా కాదు గంటకు డబ్భై ఎనభై కిలోమీటర్ల వేగం. చెట్లు నేలపడేలా- ఇళ్ళ పైకప్పులు, పాకలు, రేకుల షెడ్లు ఎగిరిపోయేంతగా పెనుగాలి. జంట నగరాల్లో ఒక్కసారిగా బీభత్సంగా కుండపోతగా వర్షం కురిసింది. ఏప్రిల్ నెలాఖరు ఎండల్లో రోడ్లు చెరువులుగా మారే వర్షం సజావైన కాలసూచిక ఎలా అవుతుంది? హైద్రాబాద్ మైత్రీవనం దగ్గర రోడ్డుమీద నిలిచిన నీటిలో ఓ యువకుడు సాక్షాత్తూ పడవ వేసుకుని ప్రయాణించాడంటే ఆలోచించు? ఎండాకాలం వర్షాకాలంగా అక్రమ పరివర్తనం చెందినట్లే అనిపించడం లేదా?’’ అన్నాడు శంకరం.

‘‘నిజమే! అకాల వర్షాలవల్ల ఆనంద హేతువేమీ వుండదు మండుటెండల్లో వాన మధురానుభూతి అనుకుంటే అది తాత్కాలికమే. ఆ తరువాత మరింత ఉక్కపోత, ఉబ్బరింత పొడచూపుతుందే తప్ప సుఖం లేదు. అదీకాక అసలే విద్యుత్ కోతలాయె! వర్షం కారణంగా విద్యుత్తుకు కొత్త ఇబ్బందులు మరి! గాలీ, వానా కావడంతో విద్యుత్ వైరులు తెగిపడడం, స్తంభాలు కూలిపోవడం ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడం జరిగినప్పుడు సామాన్యుల దుస్థితి ఏమని చెప్పాలి?’’ అన్నాడు ప్రసాద్.

‘‘కాలంగాని కాలంలో వర్షంపడితే ముఖ్యంగా నష్టపోయేది రైతులే మరి! శివారు ప్రాంతాల్లో పంటలకు వడగండ్ల వాన తీవ్ర నష్టం కలిగించింది. మెదక్ సిద్ధిపేట దగ్గర రెండువేల మూడువందల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరి పంటతోబాటు పండ్ల తోటలు దెబ్బతిన్నాయిట. కాలంగాని కాలంలో వర్షాల కారణంగా రైతులు కోట్ల రూపాయల విలువైన దిగుబడులను కోల్పోయారు. కర్నూల్‌లో గాలివానకు రైతుబజార్లు, మార్కెట్ యార్డ్‌ల్లో రైతులు అమ్మకానికి తెచ్చిన కూరగాయలు, పండ్లు, ధాన్యం నీట మునిగాయి. వాము, మిర్చి, వేరుశనగ నీట తడిసి పాడైపోయాయి. వేసవిలో మనం మామిడిపండ్ల గురించి ఎక్కువగా ఆసక్తిచూపుతాం. కానీ అకాల వర్షాలతో మామిడి తోటలే కాదు అరటి, సపోటా తోటలు కూడా విపరీతంగా నష్టపోయాయి. శ్రీకాకుళంలో జీడిమామిడి బాగా దెబ్బతిందిట. కరీంనగర్‌లో వడగండ్ల వాన మహాబీభత్సం సృష్టించింది. పది రోజుల్లో పాపం పంట చేతికందివస్తుంది అని ఆశపెట్టుకున్న రైతులకు భారీగా పంట నష్టం తట్టుకోలేని గుండెకోత తెస్తోంది. గత రెండుమూడు రోజులుగా జంట నగరాలతోసహా గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, వరంగల్, ఆదిలాబాద్, కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖ, ఖమ్మం, కరీంనగర్‌లలో భారీ వర్షాలు ఏప్రిల్, మే నెలలు ఎండాకాలం అనే క్రమాన్ని త్రోసిరాజని వానాకాలాన్ని గుర్తుచేసేవిగా కనబడడం కలికాల మహాత్యంకాక మరేమిటనుకోవాలి?’’ అన్నాడు సన్యాసి.

‘‘ఔనుట! అరవై రెండువేల రెండువందల ఇరవై అయిదు హెక్టార్లలో పంట నష్టం ఈ వర్షాలవల్ల జరిగిందనీ, దాదాపు 24 మంది వడదెబ్బకు కాక వానదెబ్బకు మృత్యువాత పడ్డారనీ గణాంకాలు చెబుతున్నాయి. విపత్తు విభాగం వెల్లడించిన వివరాల మేరకే సుమారు ఇరవై రెండువేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు, ఒక్క వరి పంటే దాదాపు యాభై అయిదువేల హెక్టార్లలో దెబ్బతింది. మరి ఎండలు మండిపోతాయనుకుంటున్న గ్రీష్మంలో సజావైన తీరుకు విరుద్ధమై తీవ్ర వర్షాలు కురవడం ఎలా అర్థంచేసుకోవాలి? కలికాలం కాకపోతేను’’ అన్నాడు శంకరం.

‘‘ప్రకృతిని నిందించకండి. నిజానికి మానవ తప్పిదాలే ఈ అసాధారణ అక్రమ స్థితిగతులకు హేతువులు. పర్యావరణాన్ని మనమే చేజేతులా నాశనం చేసుకుంటున్నాం. పృథ్వివ్యప్‌తేజవాయురాకాశాలు అనే పంచభూతాలనూ మనం గౌరవించడం ఎప్పుడో మానేశాం! భూమిని భూమిగా వుండనిస్తున్నామా. అటవీ భూములు నరికి ఎడారులు చేస్తున్నాం. గనుల భూములను అక్రమంగా తవ్వి అపారాధాలు చేస్తున్నాం. చెరువులు అవీ పూడ్చిమరీ ఇళ్లుకట్టేస్తూ నీటినీ అవమానిస్తున్నాం. సహజ వనరైన నీటిని వ్యాపార సరుకుగా మార్చుకుంటూ మంచినీటిని కూడా సీసాలకు పట్టి అమ్ముకునే దుస్థితికి మనం దిగజారాం! సరే! వాయుకాలుష్యం సంగతి చెప్పనే అక్కర్లేదు. కార్లు, ఫ్రిజ్‌లు, ఏ.సీల వాడకం అంతకంతకు పెరుగుతూ వాయుకాలుష్యం పెరిగిపోతోంది. ఆకాశాన్ని కూడా ఆక్రమించుకుంటున్నాం. ఆకాశంలో సగమూ అన్యాక్రాంతమయ్యే దారుణ మారణ పరిస్థితులు దాపురించాయి. ఇక మానవీయ మూలాలు, విలువలు మంటగలుస్తూ మనిషి అనే వాడి తేజస్సే మటుమాయమై పోతోంది. దీనికి కారణం మనుషులమైన మనంకాక మరెవ్వరు? ఏ చెట్టూ ఏ పువ్వూ మనిషికి ద్రోహం చేయడం లేదు. వాటికి మనమే కీడుచేస్తున్నాం. కాలంగాని కాలంలో కాని పనులకు, అకృత్యాలకు, అమానుషాలకు, అవినీతికి అన్నింటికీ హేతువు మనమే అవుతున్నాం. ఏమయినా అంటే కలియుగ ధర్మం అని మనమే సరిపుచ్చుకుంటున్నాం. ఈ దైన్యత, అవ్యవస్థ మారాలి. కలికాలం మనిషికి రకరకాల ఆకలి కాలంగా మారే, అమానవీయ కృత్యాలను చేయిస్తోంది. ధర్మాన్ని అనువర్తించవలసిందీ, అపసవ్యతలను సరిదిద్దుకోవాల్సింది మనమే అంచేత ఉత్తిష్ఠోఉత్తిష్ఠ!’’ అంటూ కదిలాడు ప్రసాదు.

0 comments: