ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, October 19, 2012

రేపు గురించి...





‘‘రేపనేది రాదు.’’ అన్నాడు వస్తూ సన్యాసి.

‘‘అదే నిరాశావాదం అంటే! నిన్న వెళ్లిపోయాక, ఇవాళ తరువాత, రేపు రాకుండాపోదు. కాళోజీగారు ఏమన్నారు-’’ ఉదయం కానేకాదనుకోవడం నిరాశ- ఉదయించి అలానే వుంటుందనుకోవడం దురాశ’’ అన్నారా లేదా? అంచేత ఆశ వుండాలి’’ అన్నాడు ప్రసాదు.

‘‘ఎహే! నేనంటున్నది ఆ తెలుగు ‘రేపు’గురించి కాదు. మమతా దీదీ సెలవిచ్చిన ఇంగ్లీష్ ‘రేప్’ గురించి. బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అందునా స్ర్తి అయిన ఆవిడ- స్వయంగా, ఇవాళ స్ర్తిలపై ‘రేప్’లు, అత్యాచారాలు పెరిగిపోవడానికి ‘రాసుకుపూసుకు తిరగడాలే’ కారణమనీ, దానికితోడు పత్రికలూ, ఎలక్ట్రానిక్ మీడియా ఈ దుష్ట సంస్కృతిని బాధ్యత మరిచి మరింత పెంచి పోషిస్తోందనీ ఆరోపించారు. తాను చెప్పే మార్గదర్శక సూత్రాలను మీడియా పాటిస్తే ఆ ‘రేపనేది’ రాదు అని ఆవిడ పిండితార్థం’’ అన్నాడు సన్యాసి.

‘‘నాయనా! ఇప్పటికే మంత్రులూ, డి.ఐ.జి లూ ఎందరో స్ర్తిల వస్తధ్రారణల గురించీ, రెచ్చగొట్టే ధోరణుల గురించీ క్లాస్‌లు పీకారు. మమతాబెనర్జీ కూడా అదే కోవలో చేరుతున్నారు. ఆవిడా టీచర్ అవతారం దాల్చి క్లాస్ తీసుకుంటున్నారు అంతేకదా! కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వాధినేతగా ఆవిడేం చర్యలు తీసుకోదలుచుకున్నారో అవి చెప్పారా?’’ అని ప్రశ్నించాడు రాంబాబు.

‘‘మమతాబెనర్జీ స్ర్తి అయివుండీ స్ర్తిలనే తప్పుపట్టారు అనుకోకండి. ఆవిడ మారుతున్న వ్యవస్థ గురించి ‘ఆర్తి’తో చెప్పారు. ఆవిడ అన్న విషయం ఆలోచించవలసింది అవునా కాదా అని ఆలోచించండి. దీదీ అన్నట్లు- ‘‘ఒకప్పుడు ఆడామగా చేతిలో చెయ్యేసుకుని నడిస్తేనే పెద్దలు మందలించేవారు. మరిప్పుడో ఓపెన్ ఆప్షన్ వున్న ఓపెన్ మార్కెట్‌లాగా అంతా బహిరంగమే. ఎటుచూసినా ఒకర్నొకరు అతుక్కుపోయినట్లు తిరుగుతున్నారు.’’ అత్యాచారాల సంఖ్య పెరగడానికి అదీ ఒక కారణం అంటారావిడ. సామాజిక మానసిక పురోగతి లేకపోవడంవల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయని హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌సింగ్ తాజాగా వ్యాఖ్యానించారు. అంతెందుకు? మొన్నటికి మొన్న బెంగళూరు యూనివర్సిటీ ప్రాంగణంలో న్యాయశాస్త్రం చదువుతున్న నేపాలీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఒక ఐటీ సంస్థలో పనిచేస్తున్న స్నేహితుడితో ఆమె బయటకు వెళ్ళినపుడు, మద్యం మత్తులోని కొందరు యువకుల బృందం వారిని అడ్డగించి, అమ్మాయి కావాలంటే పర్సు, మొబైల్ ఇమ్మని ఆ స్నేహితుడిని బెదిరించి, అతను కారువద్దకు వెళ్ళినపుడు, ఆమెను దట్టమైన పొదల్లోకి లాక్కెళ్లి ఆ ఘోరం చేశారట! ఇలాంటి సన్నివేశాలకు మరి ‘సినిమాలూ’ దోహదం చేస్తున్నాయి కదా!’’ అన్నాడు శంకరం.

‘‘ఒక్కటి మాత్రం నిజమర్రా! ఇవాళ విలువల ధోరణి మారింది. ఒకప్పుడు ‘విలనిజం’ అనుకునేది ఇవాళ ‘హీరోయిజం’గా మారింది. ధీర లలితుడు, ధీరశాంతుడు ఇవాళ హీరోలుగా స్ర్తిలే గుర్తించడం లేదు. వాళ్లనో ‘వెర్రిపప్ప’లుగా చూస్తున్నారు. మగవాడు అంటే.. మ్యాన్లీగా, సిక్స్‌ప్యాక్‌లతో నలుగురిని చితకబాదేలా వుండాలని అనుకుంటున్న వాళ్లూ వున్నారు. తమను ఏడిపించినా, అల్లరి పెట్టినా, తమకోసం సాహసాలు చేసే మగవాడే హీరోగా యువతులూ అనుకునేలా సమాజం మీద ప్రభావంవేసే సినిమా సంస్కృతి పెంచి పోషిస్తోంది. ‘దాదాగిరీ’ అనేది ‘హీరోగిరి’గా మారిపోయింది’’ అన్నాడు రాంబాబు.

‘‘తృణమూల్ కాంగ్రెస్ అధికార పత్రిక ‘జాగోబంగ్లా’ ప్రత్యేక సంచిక విడుదల సందర్భంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘దాదాగిరి మానండి’ అంటూనే మీడియాకు హితవుచెప్పారు. కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రేడియో, టీవీలు నడచినప్పటి పరిస్థితికీ ఇవాళ అనేక ప్రైవేట్ రేడియోలు, టీవీ ఛానెళ్లు విస్తరించినప్పటి పరిస్థితికీ హస్తమశకాంతరం తేడా వుంది. ప్రభుత్వానికి బాకా వూదేదిగా, భజన చేసేదిగా ఆరోజుల్లో రేడియో, టీవీలను ఆడిపోసుకున్నవారు సైతం బాధ్యతాయుతంగా, విలువల పరిరక్షణతో ఒక సంస్కారవంతమైన సమాజ పరికల్పనకు అవి ఆసరాగా వుండేవని నేటికీ విశ్వసిస్తున్నారు. వ్యాపారమూ, ధనార్జనే తప్ప, ‘రేటింగ్’ల పేర ఛానెళ్ళమధ్య సంచలనాల ఫైటింగ్‌లే తప్ప నేడు మరే బాధ్యతలనూ, విలువలనూ పైకి బడాబడా కబుర్లుచెప్పే ఛానెళ్లు ఏవీ పాటించడం లేదు. బూతును నిరసిస్తున్నామన్న వంకతో- ఆ బూతు క్లిప్పింగ్‌లనే పదే పదే చూపిస్తే, చెప్పేమాటకన్నా చూసే దృశ్యం ప్రభావమే ఎక్కువ పడుతుంది మరి! అందుకే- పత్రికలు విలువలకు కట్టుబడి వుండాలనీ, సంఘంపై చెడు ప్రభావం చూపే దృశ్యాలను చూపరాదనీ ఆవిడ అన్నారు’’ అన్నాడు సన్యాసి.

‘‘ఇంతకీ దీదీ సాయించిన మార్గదర్శక సూత్రాలేమిటి నాయనా! ’’ అడిగాడు ప్రసాదు.

‘‘పత్రికలకు, టీవీ ఛానెళ్లకు ఆమె చేసిన సూచనలు ఏమిటంటే- ‘అత్యాచారాలు, ఆత్మహత్యలను ప్రముఖంగా ప్రచురించకండి.. టీవీ స్టూడియోల్లో కూర్చుని దాదాగిరీ చేయకండి. డబ్బు సంపాదించాలన్న కాంక్ష విలేకరులు తగ్గించుకోండి. పూర్వాపరాలు తెలుసుకుని ఏ కథనాలైనా ప్రసారం చేయండి గానీ పక్షపాతంతో, ప్రలోభాలతో ప్రచురించడం, ప్రసారం చేయడం చేయకండి. ఫోన్ ద్వారా సమాచారం సేకరించి ప్రసారాలకు తలపెట్టకండి. భయానక ఫొటోలను పత్రికల్లో గానీ, టీవీల్లోగానీ రానీయకండి. పనిగట్టుకుని ప్రభుత్వం పేరు చెడగొట్టేలా కథనాలు ప్రసారం చేయకండి. డబ్బు సంపాదనకోసం ప్రజలకు హాని కలిగించొద్దు.’ అంటూ మమతాబెనర్జీ విజ్ఞప్తిచేసారు. అందులో తప్పేమీ లేదు! పత్రికా స్వేచ్ఛ పేరుతో, జర్నలిజం పేరుతో సమాజానికి హానిచేసే అంశాలనూ, నైతిక విలువలను తుంగలోతొక్కి ధనార్జన, వ్యాపారాభివృద్ధే ధ్యేయంగా చెలరేగడం ఎలా చూసినా తప్పేమరి’’ అన్నాడు సన్యాసి.

‘‘స్వీయ నియంత్రణతో, ఎవరి బాధ్యతనువారు గుర్తెరిగి ఉదాత్త విలువలకు, సువ్యవస్థా స్థాపనకు మీడియా పనిచేయడం అభిలషణీయం’’ అంటూ లేచాడు ప్రసాదు.

***

0 comments: