ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, September 7, 2012

ఇల్లాలికీ జీతం






‘‘నా భార్య రోజూ నేను ఆఫీసుకు వెళ్ళేటప్పుడల్లా ఓ వంద రూపాయలు ఇమ్మని అడుగుతూంటుంది’’ అన్నాడు శంకరం.

‘‘ఏం చేస్తుందిట ఆ వంద రూపాయలతో’’ అడిగాడు సన్యాసి.

‘‘ఏమో మరి? నాకు తెలీదు. నేనెప్పుడైనా అసలు ఇస్తేగా!’’ అన్నాడు శంకరం.

‘‘సిగ్గు లేకపోతే సరి, అలా అనడానికి!’’ ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా?’’ అన్నట్లు, ఆవిడకు డబ్బులివ్వడం నీ బాధ్యత కాదుటయ్యా?’’ నిలదీశాడు సన్యాసి.

‘‘రోజూ వంద రూపాయలు అడుగుతూంటే ఎలా?’’

‘‘అసలు ఏరోజయినా నువ్విచ్చినట్లయితే కదా? మర్నాడు అడగడం, అడగకపోవడం సంగతి తెలిసేది? అందునా భార్య ఉద్యోగస్తురాలు కాక, ఇంట్లో వట్టి ఇల్లాలు మాత్రమే అయినప్పుడు, ఆవిడకు మాత్రం ఖర్చులుండవటయ్యా?’’

‘‘కూరా నారా దగ్గర్నుంచి నేనే కొని పట్టుకెడతానాయె! నెలవారీ సరుకులు ఇంటికి కావలసినవన్నీ ముందుకొనేస్తానాయె! ఇంక పెద్ద ఖర్చు ఏముంటుంది ఆవిడకి?’’

‘‘ ‘పెద్ద ఖర్చు’ ఏమీ వుండదు. చిల్లర ఖర్చులే వుంటాయి! వాకిట్లోకి మల్లెపూలు వస్తే ఓ మూరెడు కొనుక్కోవాలనుండచ్చు. సడన్‌గా ఏ బాత్రూం మోరీయో పాడయితే, మనిషిని పిలిపించి బాగుచేయించి, నాలుగు డబ్బులు వాడి చేతిలో పెట్టాలా? నువ్వు ఆఫీసుకు వెళ్లినప్పుడు ఇంట్లో వ్యవహారాలన్నీ చక్కదిద్దుకోవాల్సింది తానేకదా! బండెడు చాకిరీతో అలిసిపోయి, ఏ తలనొప్పో వస్తే, మాత్ర కొనుక్కుని వేసుకోవాలన్నా తన దగ్గర కొంత డబ్బు వుండాలి కదా! ఈ రోజుల్లోనూ నీలాంటి మొగుళ్ళున్నారంటే నాకు పరమ ఆశ్చర్యంగా వుంది’’ అన్నాడు సన్యాసి శంకరాన్ని ఉద్దేశించి.

‘‘శంకరం! నీలాంటి వాళ్లకు ఇంక ప్రభుత్వమే ‘చెక్’పెట్టబోతోంది. నీలాగే- భార్య ఇంట్లో ఖాళీగా కూర్చోని చేసేదేమీలేదని భావించేవారికీ, వాళ్ళ శ్రమను గుర్తించని భర్తలకూ, కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ ఒక ముసాయిదా బిల్లుకు రూపకల్పన చేస్తోంది. ఇంట్లో భార్యచేసే సేవలకు భర్త నెలకు ఇంతని ఇవ్వవలసిందేనని ప్రతిపాదన చేస్తోంది. ఆ బిల్లు తొందరలోనే కేబినెట్ ముందుకూ తీసుకువస్తుందిట. బిల్లుకు చట్టరూపం కల్పించడం ద్వారా, ప్రతి భర్తా భార్య పేరున బ్యాంకు ఖాతా తెరిచి, తన సంపాదనలో పదినుంచి ఇరవై శాతం డబ్బును ఆమె ఖాతాలో నెలనెలా జమచేయాల్సి వుంటుంది. రోజుకూలీ అయిన మగాడి దగ్గరనుంచి, అత్యున్నత స్థాయిలో వున్న పెద్ద ఆఫీసర్ వరకూ అందరూ ఈ బిల్లు పరిధిలోకి వస్తారుట’’ అన్నాడు సుందరయ్య.

‘‘స్ర్తిలకు సమాన హక్కులు అంటూ, వాళ్లూ మగ వారితో సమానంగా ఉద్యోగాలు చేస్తూ, సంపాదిస్తూన్నప్పుడు భర్తల జీతంలో వాటా ఇవ్వాలా? ఇంట్లోనే వుండే ఇల్లాలికి ఇస్తే అర్థం వుంది- అయినా తాను సంపాదించినదంతా తెచ్చి భార్య చేతిలోనే పోసి, గృహ నిర్వహణను ఆమెనే చేయమనే భర్తలూ, బస్సుకోసం టిక్కెట్టు డబ్బులు భార్యనే అడిగి తీసుకునే మొగుళ్ళూ వున్నారు. అది సంఝో!’’ అన్నాడు శంకరం.

‘‘మహిళా సాధికారతకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగానే ఈ ఆలోచనకు రూపకల్పన చేస్తున్నామనీ, భార్యకు ఏ భర్తయినా వేతనం చెల్లించాల్సిందేననీ, మహిళా శిశు సంక్షేమశాఖ సహాయ మంత్రి ‘కృష్ణతీర్థ్’ అన్నారు. మగవాళ్లకు ఆదివారమైనా ఆఫీసులకు సెలవుంది గానీ, గృహిణికి ఆదివారం వస్తే ఇంటి చాకిరీ మరింత పెరుగుతుంది. భర్త స్నేహితులు, చుట్టాలు వస్తే- ఇక వారికి కాఫీలు, టిఫిన్లు, భోజనాలు అంటూ, అందునా సండే స్పెషల్ వంటకాలంటూ, వంటింటి ‘చాకిరీ’ మరీ ఎక్కువవుతుంది! ఉద్యోగం చేస్తున్న స్ర్తిలయినా ఇంటికి వచ్చి వారే పనులు చేసుకోవాలి కదా! ఆఫీసు పనికి జీతం వస్తుందేమోగానీ, ఇంటి పనికి ఎవరిస్తారు? గృహిణికి ఇంటి పనుల్లో సహాయపడే భర్తల సంఖ్య ఇప్పటికీ తక్కువే. ఆ తక్కువ శాతం భర్తలు చేసే సాయమూ- ఆవిడ శ్రమ ముందు తక్కువే! అంచేత ఆ శ్రమకు విలువ కొంతమేరకయినా చెల్లించాలంటే, ఇలాంటి బిల్లు అవసరమే’’ అన్నాడు సుందరయ్య.

‘‘పార్లమెంట్‌లో ఇప్పటిదాకా మహిళా బిల్లే ‘పాస్’కాలేదు. ఎప్పటికప్పుడు అది అటక ఎక్కుతూనే వుంది. సవాలక్ష సవరణల ప్రతిపాదనలతో వీగిపోతూనే వుంది. ఇప్పుడు ‘భార్యకు వేతనం’అనే ఈ బిల్లు మాత్రం పడనిస్తారా మనవాళ్ళు’’ అన్నాడు సన్యాసి.

‘‘స్ర్తిల ఆర్థిక అవసరాలు తీరడం ముఖ్యం! వాళ్లు సంపాదనా పరులైనా, మన దేశంలో ఉద్యోగినుల నెల సంపాదనలపై అధికారం వారికి వుండడం అనేది ఇప్పటికీ లేదు. ఆమె సంపాదనపై భర్తో, తండ్రో, కొడుకో పెత్తనం చేసే వైఖరే నేటికీ వుంది! భర్తను కాదని- తన సంపాదనే అయినా, అతనికి చెప్పకుండా, తెలియకుండా కానీ అయినా ఖర్చు పెట్టుకునే స్వాతంత్య్రం లేని స్ర్తిలు నేటికీ వున్నారు! పేద కుటుంబాల్లో భర్త తన సంపాదన ఏ త్రాగుడు, జూదానికో ఖర్చుపెడుతూంటే, ఇల్లాలే పాపం కష్టపడి తన సంపాదనతో ఇంటిని నెట్టుకొస్తోంది. భర్తకు తిండి పెడుతూ అతని దుర్మార్గాలను సహించి నెత్తినెత్తుకుంటున్న వాళ్లున్నారు. నన్నడిగితే- ‘్భర్యకు వేతనం’అనే బిల్లు చట్టబద్ధమై, ప్రతి మగవాడి సంపాదనలో శాతం అనివార్యంగా అతని భార్య ఖాతాలోకి వెళ్లాలి! పైగా ఆ ఖాతా నెలనెలా సరిగ్గా భర్త సంపాదనా శాతంతో జమ అవుతోందా లేదా అనే ‘నిఘా’ ప్రభుత్వమే చేయాలి! అసలు భర్త పనిచేసే ఆఫీసు యాజమాన్యమే- ఆ వేతన శాతం మొత్తాన్ని అతని భార్య అక్కౌంట్‌లో నేరుగా, భర్త జీతంనుంచి కట్‌చేసి వేసే, చట్టం కల్పించాలి’ శంకరం! అప్పుడు గానీ నీవంటి వాళ్లలో మార్పు రాదయ్యా! నీకు కోపం వచ్చినా సరే! ఇది యధార్థం’’అంటూ లేచాడు సుందరయ్య.





3 comments:

సుభ/subha said...

waiting andii billu kosam :)

శ్రీ said...

chaalaa baagundi sudhama gaaroo!
@sri

సుధామ said...

Ante kadaa 'Subha' garu...
Thank you 'Sri' garu