ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, April 7, 2012

అక్షరాలు అవే..అటొక అర్థం.. ఇటొక అర్థం




(7)



కుఢి ఎడమైతే పొరపాటు లేదోయ్ అన్నాడు కవి.
తెలుగు భాషలో కొన్ని పదాలు కుడి నుంచి చదివినా ఎడం నుంచి చదివినా ఒకే అర్థం ఇచ్చి పొరపాటు అనిపించవుగానీ, ఈ సూత్రం అస్తమాను వర్తించదు సుమండీ! కుడినుంచి చూస్తే ఒక అర్థం ,ఎడం నుంచి చూస్తే మరో అర్థం- అంటే ‘అటు ఇటు అయితే’ వేరు అర్థాలు ఇచ్చే అందమైన పదాలూ భాషలోని సొగసే!


కుడిచేత్తో అన్నం తింటూ అద్దంలో చూసుకుంటే ఎడంచేత్తో తిన్నట్టు వుంటుంది కదా! అలా అద్దంలో అర్థం తారుమారైనట్లు, పదాల అర్థమూ పసందుగా మారిపోయే పద సంపద మనకుంది.

రమ అంటే లక్ష్మీదేవి. ఆవిడని యంత్రంగా మార్చేసేయాలంటే రమ తిరగేసి మర అనాలి. వాల్మీకి బోయవాడుగా వున్నప్పుడు అతడిని మార్చడానికి నారదుడు అతగాడి నోరు తిరగడానికి వీలుగా 'మరా మరా' అనమని మంత్రోపదేశం చేసాడనీ, 'మరా మరా' అని పదే పదే బోయ జపిస్తూ, అది 'రామ రామ'గా మారి, రామ మంత్రోచ్ఛారణతో తపస్సిద్ధి పొంది, గొప్ప కవిగా మారి, రామాయణ మహాకావ్యాన్ని మనకందించాడనీ కథనం ఉంది.


నది దగ్గరకు వెళ్లి ‘కనుము’ అంటే సరిపోదు- తిరగేసి మునుక వేస్తేనే నదీస్నానం చేసినట్లు మరి! తల తిరిగిందనుకోండి- అది లత అయిపోతుంది. శ్రీశ్రీగారు ఓసారి తల తిరిగిన రచయిత్రి అని ఓ నవలా రచయిత్రి స్వభావాన్ని కూడా ధ్వనింపజేశారు.

ఒకరిపై కోపం వస్తే ‘కరచు’ స్వభావం ప్రకటించక్కర్లేదు. మాటల్లోనే ‘కరచు’ను తిరగేసి 'చురక' వేస్తే చాలుగా!
‘పడక’పోతే బాంబు తిరగేస్తారు. అదేకదా మరి సినిమాలు సీమ ప్రాంతం ‘కడప’కు సీమితం చేసిన భావజాలం.! పడక తిరగేసేది కడప! అలాగే ‘పడగ’ అటుగా ఎత్తి 'గడప' దగ్గర కన్పించవచ్చు. అది 'కలప'తో చేసింది చెక్కది అనుకుందామనుకున్నపుడు నాలుగువైపులా చెక్క చక్కగా వున్న ‘కలప’ తిరగేస్తే 'పలక’ అయిపోతుంది.


ఇలా అటొక అర్థం, ఇటొక అర్థం ఇచ్చే పదాలు భాషకు సొగసుల పరమార్థం! ‘పంచె’ అన్నది నిజానికి భారతీయ పురుషుడి ఒక సంప్రదాయ దుస్తు. ‘పంచె’ అటుగా ‘చెంప’ అయి క్రింద ఉడుపు, పైన ఓ నేత సానుభూతి యాత్రలో తడిమేది అయిపోవచ్చు.

‘తడుము’ అనేది తడుముతున్నప్పుడు అటుగా మరి ‘ముడత’ వచ్చేస్తుంది సుమండీ!

కాళ్లూ మొదలైన ఎడముగా సాగిన ‘శాఖ’కు ‘పంగ’ అనే వ్యవహారం వుంది. ‘పంగ’ అటుగా ‘గంప’ అయిపోతుంది. గంపలో నింపుకునేవి బోలెడుంటాయి.

'బాపురే' అని ఆశ్చర్యార్థక పదంగా వాడతాం. కాని అది ‘పురే’ అనే మూలరూపంగా వున్నదే. ‘పురే’ అనే పదం ఆశ్చర్యార్థకంగానూ, నిందార్థకంగానూ, ప్రశంసార్థకంగానూ కూడా కవులు ప్రయోగించారు. ‘‘చాలున్ బురే నరేశ్వరా ప్రచండతరం బగు నిట్టి సాహసం బేల యొనర్చెదీవు’’ అని హరిశ్చంద్రో పాఖ్యానంలో పద్యంలో ‘పురే’ నిందార్థకంగా వాడింది! ఇంతకీ తమాషాగా ఈ ‘పురే’ అటుగా వస్తే ‘రేపు’ అయిపోతుంది. ఇంగ్లీష్‌ది కాదండీ బాబూ! ఇవాళ తర్వాతదీ, ఎల్లుండికి ముందుదీ అయిన ‘రేపు’. నేడు కాక మరుసటి దినమన్నమాట.

తృణకాండము, సన్ననిపుల్ల, కట్టెపుల్లను- ‘పుడుక’ అంటాం. ఆ ‘పుడుక’ పదం అటుగా ‘కడుపు’ అయిపోతుంది.


విలాస విశేషాన్ని ‘గునుపు’ అంటాం. పిల్లలు మురిపెంగా గునుస్తూ వుంటారు కదా! అదే ‘గునుపు’. ఆ గునుపు పదం అటుగా ‘పునుగు’ అయి కూర్చుంటుంది. పునుగు పిల్లి గంధసారాన్నే మరి వేంకటేశ్వరస్వామి అర్చనలో నేటికీ తిరుపతిలో వినియోగిస్తుంటారు. 'పునుగు' గురించీ 'గునుపు' వుంది మరి!

‘గెంతు’ అని అంటూంటారు కానీ, అసలుకి ‘గంతు’ అనేది పదం. ‘గంతు’ అంటే ప్లుతగతిభేదం, దాటు, దుముకు అని అర్థాలు. ఆ ‘గంతు’ అటుగా ‘తుంగ’ అయ్యి ఓ చెట్టుగా మారిపోతుంది.

'టపటప' చినుకులు రాలుతాయి గానీ, ఆ పదం కుడి వైపుగా ‘పటపట’ చేస్తే- పళ్లు కొరకడం అవుతుంది. ‘కటకట’ వేరు ‘టకటక’ వేరు. ‘పీపా’ అటుగా ‘పాపీ’ అవుతుంది. నేతి మిఠాయి ‘నేతి’ అటుగా 'తినే’దవుతుంది. ఇలా అటొక అర్థం ఇటొక అర్థంగా భాషలో మాటల తికమకలు ఒక సొగసుగా అందాలొలికిస్తూ అలరిస్తూంటాయి. అందుకొని, మందహాసాలు చిలికించుకోండి మరి.

*

3 comments:

సో మా ర్క said...

చాలా బాగున్నాయి మకతిక పదాలను తికమక చేసి చూపించారు వేరు వేరు అర్ధాల్లో!
ధన్యవాదాలతో

సి.ఉమాదేవి said...

చిన్నప్పుడు తెలుగు వాచకం తెరవగానే ప్రశ్నలకన్నా ముందు అర్థాలు,నానార్థాలు,వ్యుత్పత్తి అర్థాలు,వ్యతిరేక పదాలు చకచకా చదివేసేవారము.ఇప్పుడు ప్రతి శనివారం నుడి ఆ స్థానాన్ని ఆక్రమిస్తోంది.పిల్లలకు కూడా చక్కగా అర్థమయే రీతిలో పదాల సొబగులను వివరిస్తున్నారు. తెలుగుభాషపై మరింత మమకారం పెంచుతున్నారు.

RAGHUPATIRAO GADAPA said...

బాగున్నాయి....