‘‘అదేమో తెలియదు గానీ, వాక్యంలో ఆది మాత్రం- ‘ఆడది’తో మొదలైందిట! ఆడమ్ అండ్ ఈవ్ సృష్ట్యాది అంటారుగదా! మగవాడిని సృష్టించి దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. కానీ ఆడదాన్ని దేవుడు సృష్టించాక, ఎవరికీ విశ్రాంతి లేకుండా పోయింది’’ అన్నాడు నవ్వుతూ రాంబాబు.
‘‘ ‘ఆది’మధ్య ‘డ’ చేరితే - ‘ఆడది’ అయ్యింది. తెలుగులో వ్యస్తప్రయోగం లేదుగానీ, ‘డ’ అనే ఏకాక్షరానికి- ధ్వని, భయము, బడబాగ్ని, ఢాకిని అని అర్థాలున్నాయి. అంచేత ఆది యందు- నడుమ ‘డ’చేరగానే, అవన్నీ చెలరేగుతున్నాయి’’ అన్నాడు ప్రసాద్.
‘‘స్త్రీల గురించి అలా మాట్లాడటం ఓ గొప్ప, ఫ్యాషన్, సరదా అనుకుంటున్నారేమో మీరు? స్త్రీలను గౌరవించే దేశం మనది. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతా’అని స్త్రీలు పూజింపబడినచోటే దేవతలు అంతా సంతోషిస్తారని చెప్పబడింది’. స్త్రీలను గౌరవించవలెను. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం’అని సిటీ బస్సుల్లో కూడా స్లోగన్లు చూడ్డంలేదూ మీరు! రానురాను అమ్మాయిలు తగ్గిపోతున్నారట తెలుసా! ఈ లెక్కన మున్ముందు మగ జాతి మాత్రం ఎలా పుట్టుకురాగలదు? అది గుర్తించండి.’’ అన్నాడు సుందరయ్య కొంచెం గంభీరంగా.
‘‘స్త్రీలను కించపరచాలని ఎవరూ కంకణం కట్టుకుని కూచోలేదు లేవోయ్! కానీ అందరు స్త్రీలూ- అలా గౌరవించదగిన వారుగా వుంటున్నారా? సంఘ పతనానికీ, యుద్ధాలకూ కారణభూతమైన స్త్రీలు లేరా? ‘ఆడదె ఆధారం- మన కథ ఆడనె ఆరంభం’అన్నట్లు, మంచికీచెడుకీ కూడా మూలాధారమవుతున్నవారు మగువలే! కొన్ని పదాల సమూహం ‘వాక్యం’అయినట్లు- కొందరిని ఏకీకృతం చేసి, కుటుంబాన్ని నిలబెట్టేదైనా, పడగొట్టేదయినా స్త్రీయే అవుతోంది’’అన్నాడు సన్యాసి.
‘‘ ‘డ’కారం గురించి కదూ నువ్వన్నావ్ ప్రసాద్! నిజంగానే బ్రతుకు ‘ధ్వని’ శ్రుతి సుభగంగా వుండాలన్నా, డిసిబుల్స్ అధిగమంచి భరించలేని స్థాయి తేవాలన్నా హేతువుతానే! నిజంగా ‘భయము’అనేది స్త్రీవల్లా, స్త్రీచుట్టూరా, స్త్రీగురించే అధికం. ‘‘అర్థరాత్రి ఒంటరిగా స్త్రీ స్వేచ్ఛగా తిరగ గలిగినప్పుడే అసలైన స్వాతంత్య్రం’’అన్నారట గాంధీగారు. అసలు అర్థరాత్రి తాను ఒంటరిగా, స్వేచ్ఛగా తిరగడం ఎందుకు? అని ఎవరూ అడగలేదు. వెన్నెలయినా, అమావాస్యయినా అసలు రాత్రికీ స్త్రీకి కూడా అవినాభావ సంబంధం వుంది. మనీ, మద్యం, మగువ అనే ‘మ’కార త్రయ సంబంధాలన్నీ- రాత్రుళ్లే మరీ విచ్చలవిడి విహారం చేస్తాయి. అనేక రాజకీయాలు, వ్యాపార లావాదేవీలు, డబ్బు, సంపద, అధికారం వీటన్నిటికీ వౌలికమైన లంకె ఇవాళ ‘స్త్రీ’గా మరింత విస్తృతమైంది.’’ అన్నాడు రాంబాబు.
‘‘ఆ మాట నిజం! ఇవాళ ‘తారాచౌదరి’ కథనం ఎంత సంచలనంగా వుందో తెలుస్తూనే వుంది కదా! అలాంటి స్త్రీలు సమాజంలో నేడు ఎందరో ఎదుగుతున్నారు. ఆడదాని ప్రధాన ఆయుధం కన్నీరని ఎవడో కవి అన్నాడు గానీ, అసలు ఆయుధం ‘అందం’. తన అందంతో- అనేక వ్యవహారాల చందం చక్కబెట్టే చక్కనమ్మలు మిక్కుటమవుతున్నారు. ‘బ్రహ్మకైనను పుట్టు రిమ్మతెగలు’అని, సృష్టించిన వాడైనా కాంతముందు దాసుడే కాగల ఆదిశక్తి-‘ఆడది’మరి! ప్రకాశం జిల్లా నుంచి సినిమా వేషాలకోసం నగరానికి వచ్చిన ఆడది ‘రాజేశ్వరి’- తారాచౌదరిగా సినిమాల్లో కాదుగానీ, రాజకీయ నాయకులను, పోలీసు అధికారులను, బడావ్యాపారవేత్తలను తన కనుసన్నలలో తిప్పించుకునేదిగా ఎదిగి కోట్లకు పడగెత్తిందంటే ఎలా అర్థంచేసుకోవాలి?’’ అన్నాడు ప్రసాదు.
‘‘బలహీనతలు మనలో పెట్టుకుని వాళ్లను ఆడిపోసుకోవడం ఎందుకు? ఇప్పుడు ప్రవరులు, ఋష్యశృంగులు ఏరీ? తరతరాలుగా అణగద్రొక్కబడిన స్త్రీ జాతికి ఇప్పుడు నిజంగానే కొంతమేరకయినా స్వేచ్ఛ లభించింది. ఆమె వంటింటి కుందేలు కాదనీ, ఏ రంగంలోనయినా మగవాడికి దీటుగా, వీలుంటే మగవాడికన్నా అధికంగా రాణించగలదని కాలం నిరూపించింది! ‘సవ్యత’తోబాటు ‘వక్రత’లూ వుంటాయి.సమాజం మీద ఓ రకం కసితోనే- తారాచౌదరి లాంటి వారూ, తమకున్న అవకాశాలను కుయుక్తులతోనైనా అందిపుచ్చుకుంటారు. రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, బిగ్‌షాట్స్ ఎందరో ఆమె గురించి భయపడి ఛస్తున్నారంటే- తప్పు వాళ్లదే కానీ, ఆమెది కాదుగా! ఇంతకీ ఆమె అరెస్టయ్యింది. ఆమెమీద వున్న నేరాలకు విచారణ జరుగుతోంది. ఆమె చేసిన నేరాలకు ఆసరా అయి, ఆమెను ఉపయోగించుకుని, తమ అవసరాలూ, తమ లాభాలూ చూసుకున్నవారున్నారు కదా! వారికి అందుకే వెన్నులో వణుకు పుడుతోంది. ఇలాంటి స్త్రీల కథలకు ముగింపు భయంకరంగా ఏ హత్యతోనే పడిన కథలూ ఈ సమాజంలో విన్నాం! చూసాం! ‘‘అందనంత ఎత్తా ‘తారా’తీరం! సంగతేంటో చూద్దాం రా!’’ అని సమాజం తెగబడుతూనే వుంది. అనవసరంగా ఆడదాన్ని అంగడి సరుకు, కన్స్యూమర్ వస్తువు చేసి- నేటికీ పురుషాధిక్య సమాజం చెరలాటలాడుతూనే వుంది. తారలు లేని పగలు వెలగాలంటే పగలవలసిన ‘పగలు’ చాలా వుంటాయి’’అని లేచాడు సుందరయ్య.
0 comments:
Post a Comment