ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, March 31, 2012

ప్రత్యయాలతో ప్రసన్నత




భాషలోని సొబగులను వివరించడానికి ఒకప్పటి రోజుల్లో పాఠశాల్లోనూ, ఇంట్లోనూ కూడా పెద్దలు క్రీడల వలెనే మాటల ఆటలాడించేవారు. పద సంపదను పెంచుకోవడానికీ, అందంగా అర్థవంతంగా మాటలాడుకోవడానికీ ఆ వైఖరి పిల్లలకు వ్యవహారంలో ఎంతగానో సహకరించేది.

హారము అన్నమాటే తీసుకోండి. ఆ పదానికి ముందు మరి ఒక అక్షరమో, కొన్ని అక్షరాలో చేరుస్తూ పద సంపదను గ్రహించడం విద్యార్థులకు ఓ ఆట.

హారము, ఆహారము, విహారము, సంహారము, సమాహారము, ప్రహారము, భాగాహారము, ఉపహారము, వ్యవహారము, నీహారము అంటూ వివిధ పదాలుగా విస్తరించినట్లే కారము, ఉపకారము, మమకారము, అపకారము, గుణకారము, అధికారము, అంధకారము, పరోపకారము, సాకారము, ప్రాకారము, సహకారము అంటూ ఎవరు ఎన్ని పదాలను గ్రహించగలరనేది వారికి భాషపై, పద సంపదపై గల పట్టుననుసరించి తెలుసుకోవచ్చు. భాషావిషయకమైన ఇలాంటి క్రీడలు మాటలుగా, రాతలుగా విద్యాలయాల్లో తరగతి గదిలో వినియోగిస్తూంటే తెలుగు భాష తేజరిల్లదా! ఈ తరానికి అందుబాటులోకి రాకమానుతుందా?

ఎటు చదివినా అర్థం మారని పదాలున్నాయి. 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్' అన్నాడు కవి. కుడినుంచి ఎడమకు చదివినా ,ఎడమనుంచి కుడికి చదివినా అర్థం మారని పద సంపద భాషలోని ఒక సొగసు. వికటకవి అనే పదాన్ని ఇలాంటి పదంగా అందరూ ప్రాథమికంగా పేర్కొంటూ వుంటాం.

మిసిమి, కిటికి, నల్లన, పులుపు, సంతసం, కనక, కునుకు, సరస, జలజ, నటన ఇలాంటివి కొంత విస్తరించి- కట్టకట్టక వినమని మనవి. వినమని మనవి కూడా అలాంటి సొగసు పదమని గమనించారా మరి.

మందారదామం, పాలునలుపా, కడపలో పడక, నీ పంచనే చంపనీ, రంగనగరం, పంచాస్త)చాపం, నేతచేతనే ఇలా గ్రహించదగిన పదాలు ఎన్నో వున్నాయి. మాటలాడుకునేప్పుడు ఇలాంటి పద ప్రయోగాలు అర్థవంతంగా ప్రయుక్తం చేసినపుడు వినేవారికి ఆసక్తిదాయకంగా వుండడమేకాదు, వక్తలోని ప్రతిభకు, సరసతకు భావపటిమకు దోహదపడేవిగా ఇటువంటి మాటలుంటాయి. ముందు వెనుకలొకటేగా ఈ పదాలు అందాలొలికిస్తాయి.

‘జంబీరబీజం’, ‘రామాకురా రాకుమారా’, ‘నటన కడ నడక’, ‘ముత్యము’వలె ‘సంతసం’ కలిగిస్తూ ‘మడమ’ తిప్పని భాషా సౌందర్యానికి ‘జేజేలజేజే’గా భాసిస్తుంటాయి. పిల్లలు ఇటువంటివి పలికినప్పుడు అది ‘నందనందనం’. వినేవారికి ఆనందస్యందనం.


మునుపు మనం జంట పదాలు గురించి మాటాడుకున్నాం. ఒకే పదం మళ్లీ వెంటనే పునరుక్తమవుతూ మానవస్వభావ భావ ప్రతీకంగా భాషలో సొబగులీనుతున్నవాటిని గురించి ఇక్కడ ప్రస్తావించుకుందాం. చరచర అనేది గబగబ అనేది వేగవంతమైన నడకకు ప్రయుక్తవౌతున్న అలాంటి పదాలే. కణకణ, భుగభుగ, భగభగ అనేది మంటకు, సలసల అనేది క్రాగుటకు, జరజర అనేది ప్రాకుటకు, పటపట అనేది పళ్లు కొరుకుతూ వ్యగ్రతా సూచనకు వినియోగిస్తుంటాం. వడవడ, బడబడ అనేది మాట్లాడడంలోని వేగిరానికి, దూకుడుకి సంకేత పదాలు. తళతళ, ధగధగ మెరుపుకు, నకనక ఆకలికి, గలగల గాజుల వంటి చప్పుడుకు, కరకర నమిలి మ్రింగడానికి, వలవల ఏడుపుకు, లబలబ మొత్తుకోవడానికీ, మలమల మాడడానికీ ఉపయుక్తమయ్యే అర్థవంతమైన పదాలుగా ధ్వనిమంతంగా వ్యవహరిస్తుంటాం.

చినుకులు టపటప రాలుతాయి. డోలు డమడమ మ్రోగుతుంది. భయంవల్ల గడగడలాడడం ,చలికి గజగజలాడడం జరుగుతుంది. తలుపు దబదబ బాదడం, హరహర అని భగవన్నామ స్మరణం చేయడమూ వుంది.

భాషలోని పద సౌందర్య వైవిధ్యంలో ఇవన్నీ విస్తృత పార్శ్వాలే. ఈ సొబగు మన భాషలోనే అధికంగా కనిపిస్తుంది. వీటన్నింటితో పరిచితి తెలుగులో మాట్లాడుకోవడం, రాయడం జరుగుతున్నప్పుడే కలిగి నిలబడుతుంది. మాటల అందాలు మాట్లాడుకుంటేనే కదా తెలిసేది. వ్యవహారంలో చ్యుతమైపోతున్న ఇటువంటి భాషలోని సొగసులను నిలుపుకోవడం అనేది భాషాప్రేమికుల కర్తవ్యం.


  • సుధామ
  • 31/03/2012
  • 3 comments:

    సి.ఉమాదేవి said...

    తెలుగుభాషలో పదసంపదకుకొదవలేదు.ప్రచారంలేనిదే వినిమయంలోకి రాని వస్తువులా పదప్రయోగాలు సైతం వినియోగించకపోతే మాటలోను,రాతలోను అంతరించిపోతాయి.మీ వ్యాసాలు పునశ్చరణకు అవకాశాన్నిస్తున్నాయి.

    సుధామ said...

    ధన్యవాదాలు ఉమాదేవి గారూ! నా ఉద్దేశ్యం అదే!పాండిత్యప్రకర్షకోసమో,నాకే బాగా తెలుసుననో కాదు.మీరన్నట్లు మనంమనం ఒకసారి పునశ్చరణ చేసుకుందామనీ,తెలుగు యువతకు గుర్తు చేద్దామనీ అంతే!

    మరువం ఉష said...

    "ఒకే పదం మళ్లీ వెంటనే పునరుక్తమవుతూ మానవస్వభావ భావ ప్రతీకంగా భాషలో సొబగులీనుతున్నవాటిని గురించి ఇక్కడ ప్రస్తావించుకుందాం." చక్కగా చెప్పారండి. మా బడి పిల్లలకి ఇలాంటివి ఒక 60 పదాలు నేర్పాను. మీరు, ఉమాదేవి గారన్నట్లు పునశ్చరణకు, పదసంపద పదునుపెట్టుకోడానికీ ఈ వ్యాసాలు చాలా బావున్నాయి.