ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, January 29, 2012

చిన్ని కథల్లో ఇమిడిపోయిన జీవితసారం



భమిడిపాటి సోమయాజిగారు మిడిసిపాటు లేని చిన్న కథా రచయిత. చిన్న కథారచయిత అంటే చిన్న కథలు రాసే రచయిత అనేగానీ నిజానికి ఆయన పెద్ద రచయిత. ముఖ్యంగా హాస్యం, వ్యంగ్యం ఆయన కథల్లో దట్టించే దినుసులు. అందువల్ల ఏ కథ అయినా హాయిగా చదువుకోవచ్చు. ఇవన్నీ కథలేనా అంటే కొన్ని గల్పికలు కూడాను కానీ వాటి అల్లికలు వాటికున్నాయి. పైకి హాస్యం పేరిట సరదా కథలే అనిపిస్తాయి గానీ కొన్ని కథల్లోని లోతైన తాత్త్వికత సరదాని అధిగమించి కొన్ని పరదాలను తొలగించి ఉదాత్త విలువలను వెలిగించి హృదయంలో కాంతులు నించుతాయి.

‘‘ఓ చెట్టు పచ్చగా వుండి, ఆహ్లాదాన్ని కలిగిస్తూ, తియ్యని పళ్ళు యిస్తుంది! దీనికి కారణం మట్టిలోనున్నదాని వేళ్ళే! ఆ వేళ్ళు ఎప్పుడూ బయటికి కనిపించవు. సరికదా, అసలా చెట్టు పచ్చదనానికి తామే కారణం అని కూడా ఎప్పుడూ భావించవు. పైకి కనబడకుండా ఉపయోగపడే చెట్టు వేళ్ళ వంటి వారు మీరు’’ అన్న ‘పరిపూర్ణ మాతృమూర్తి’ కథలోని ఓ సంభాషణలో హాస్యం అనే వేళ్లు మూల కందంగా మానవీయ విలువల విస్తరణ చేయడం సోమయాజిగారి కథల యజ్ఞం అనిపిస్తుంది ఈ 29 కథలూ చదివితే. ‘సంస్మరణ’ చేసుకోదగిన విలువలకు ‘అంకితం’గా ఈ కథలో రచయిత చిత్రించిన సన్నివేశాలు, పాత్రల అభివ్యక్తులు నిస్సందేహంగా ప్రశంసనీయమైనవి. చిన్న కథల కాన్వాస్ మీదే వైవిధ్య భరితమైన జీవన వర్ణచిత్రాలు తీర్చిన కథకుడికి కేవల అభినందనలు ఏపాటి సోమయాజి భమిడిపాటి గారి ఈ పుస్తకం సంస్కారవంతమైన కథల సంపుటి.

-అల్లంరాజు

(భమిడిపాటి సోమయాజి కథానికలు
రూ.50/-
శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ ప్రచురణలు, బ్లాక్-6, ఫ్లాట్-10, హెచ్.ఐ.జి.1,
బాగ్‌లింగంపల్లి,
హైదరాబాద్-44)


(ఆంధ్రభూమి-దినపత్రిక-'అక్షర ' 29.1.2012)

1 comments:

Padmarpita said...

నేను కూడా ఈ కధలు చదివానండి సరళమైన రీతిలో చక్కగారాసారు.