ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, December 16, 2011

టైముంటుంది
ప్రతిదానికీ ఓ టైముంటుంది’’ అన్నాడు సన్యాసి.

‘‘అందుకేగా ఠైల్వే టైంటేబుల్ ప్రింట్ చేసేది! పేపర్లలోనూ- విమానాల రాకపోకలూ, బస్సువేళలూ, ప్రకటిస్తూండడమూ చూస్తూంటాం’’ అన్నాడు ప్రసాదు.

‘‘నేనంటున్నది అది కాదోయ్. ‘నువ్వెక్కదలుచుకున్న రైలు జీవితకాలం లేటు’ అన్న డైలాగుంది చూసావూ! అదిరైళ్ళ రాకపోల గురించి కాదు. బ్రతుకులో జరగాల్సినవిషయాల గురించే. ‘టైం లేదు’, ‘టైం కలిసి రాలేదు’, ‘టైం సరిపోలేదు’ లాంటి మాటలు అలవోకగా వాడేస్తూ వుంటాం. కాలం మనల్ని జయించడం గొప్ప కాదు. మనం కాలాన్ని జయించాలి. ‘ప్రతిదానికీ ఓ టైముంటుంది’ అంటే - ఒక టైం ప్రకారం, నియమబద్ధ జీవితం గడపటం గురించి నేనంటున్నది’’ అన్నాడు సన్యాసి.

‘‘చెప్పడం ఈజీనే బాబూ! దిగితే తెలుస్తుంది. ‘టైం ప్రకారం’ అన్ని పనులూ ఠంచనుగా అయిపోవాలంటే, ఎల్లవేళలా సాధ్యమయ్యే పనికాదు! సాధ్యమయినా, అందరివల్లా సాధ్యమయ్యేదికాదు! ‘టైం టేబుల్’ ప్రకారం స్కూల్లో తరగతులు, టైం ప్రకారం ఆఫీసుల్లో పనులు జరుగుతున్నాయా? టైంకి చేయాల్సిన వాళ్లుకూడా-చేయడానికి ‘టైం రాలేద’న్నట్లే వ్యవహరిస్తున్నారు కదా’’ అన్నాడు ప్రసాదు.

‘‘ ‘ప్రతిదానికీ ఓ టైముంటుంది’ అనడంలో నా ఉద్దేశం ‘ఏ వయసుకు జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరగాలి అన్నది’ ఒకటి! ఇవాళ కుర్రకారు చదువులూ, ఉద్యోగాలూ అంటూ- వయసు ముదరబెట్టుకుని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు చాలామంది. ‘డబుల్ ఇన్‌కమ్’ వస్తోందన్న మాటేగానీ, శారీరకంగా సుఖపడడం, పిల్లల్ని కని పెంచిపోషించడం- అన్న విషయాలు కూడా అప్రధానంగానూ, ఆలస్యమైపోయేలానూ చేస్తున్నారు. రెండోది అసలు తమకంటూ ఒక ‘లీజర్ టైం’ అనగా, ‘తీరిక సమయం’ కుదుర్చుకోవడం, దాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా మందగిస్తోంది అనిపిస్తోంది’’ అన్నాడు సన్యాసి.

‘‘ ‘ఏ వయసులో పెళ్ళి చేసుకోవాలి’ అన్నది అలా వుంచు. ‘ప్రతిదానికీ ఓ టైముంటుంది’ అంటున్నావు కదా! ‘ఏ వయసులో విడాకులు తీసుకోవచ్చు’? అది చెప్పు’’ అన్నాడు రాంబాబు వారి మాటల్లో జోక్యమవుతూ.

‘‘ఏమిటి! విడాకులకు వయసా?’’ అని ఆశ్చర్యంగా అడిగాడు ప్రసాదు.

‘‘అవును! అరవై ఏళ్లు వచ్చిన స్నేహలతా దీక్షిత్ ప్రముఖ తెలుగు నటుడు శరత్‌బాబు భార్య. అతగాడితో 1990లో ఆమె పెళ్లయింది. ఇంక ఈ మొగుడిని భరించలేనని ఆవిడ కోర్టుకెక్కిందట’’ అన్నాడు రాంబాబు.

‘‘అదేమిటి? శరత్‌బాబు మంచి నటుడు. ఎన్నో మంచి పాత్రలు ధరించాడు కదా?’’ అని అడిగాడు ప్రసాదు.

‘‘అదే కదా మరి! తెర జీవితాలకూ, తెరవెనుక జీవితాలకూ బోలెడు తేడా వుంటుంది. అతను మొదట్లో ప్రముఖ హాస్యనటి రమాప్రభను పెళ్లాడి, ఆ తర్వాత విడాకులిచ్చాడు. ఇప్పుడున్న భార్య విడాకులు కావాలంటోంది. కమల్‌హాసన్, అమీర్‌ఖాన్‌లు, సంజయ్‌దత్తులు సెలబ్రిటీలనుకుంటున్న వాళ్ల బ్రతుకులు ప్రజలు, అభిమానులు చాలా గొప్పగా ఊహిoచుకుంటూంటారు. కానీ వాళ్లు మామూలు మనుషులే! నిజం చెప్పాలంటే ఒక్కోసారి మామూలు మనుషులే నయం! వీళ్లు తమ పేరు, హోదా, డబ్బువల్ల అసలు సర్దుకుపోలేక- ఎప్పటికప్పుడు తమ జోడీ, తమ తోడు తమ ఆశయాలకు, అభిరుచులకు లేదని సతమతమయ్యే ప్రమాదంలో పడుతూంటారు. సృజనశీలురు చాలామంది జీవనాదర్శాల విషయంలో- విలక్షణంగానూ, విపరీతంగానూ కనబడడం చూస్తూనే వుంటాం’’ అన్నాడు రాంబాబు.

‘‘నువ్వన్నది నిజమే రాంబాబూ! నిజానికి ఏ‘టైం’లో నిజంగా ఒక తోడూ, ఆసరా అవసరమో- ఆ వయసులో బ్రతుకును ‘అతలాకుతలం’ చేసుకునేవారి సంఖ్య, ఇటీవల బాగా పెరుగుతోంది! నిజానికి ఓ పాతికేళ్లో, ముప్ఫై ఏళ్లో సంసారం చేశాక కూడా- భార్యాభర్తల మధ్య అవగాహన ఏర్పడక, విశ్వాసరాహిత్యమో, విసుగుదలో పెరిగి ‘విడాకుల’ ఆలోచన చేస్తున్నారంటే- ‘లౌకికత’, ‘వ్యాపారాత్మకత’ ఎంతగా అధిగమించి, ‘యాంత్రికత’ ప్రధాన పాత్రవౌతోందో అర్థం అవుతోంది! ‘ధర్మం’ అనేదానికీ నిర్వచనాలు మారిపోయాయి. ‘స్వధర్మ’మే, స్వార్థచింతన, స్వప్రయోజనాలే- ‘పరమ ధర్మం’గా మారిపోతుండడంవల్లనే, ఉదాత్త భారతీయ సంస్కృతీ ‘టైం’ బాగులేని దౌర్భాగ్య స్థితిలో పడుతోంది! ఏ వయసుకు ఆ ముచ్చటలు, ఏ టైంకు ఆ అనుకూల్య పరిస్థితులు, వుండకుండా పోతున్నాయి. ‘అకాల పరిణామాలే’ ముంచెత్తుతున్నాయి. ‘సమయమూ- సందర్భమూ’ అన్నమాట ఔచితిని కోల్పోతోంది! క్రమం తప్పి వ్యవహరించడం, పనులు సానుకూలం కాకుండా వ్యవహరించడం అధికమవుతోంది. పార్లమెంట్‌పై దాడి జరిగి పదేళ్లయింది.
ఆ కేసులో ఉరిశిక్ష పడిన ‘అఫ్జల్ గురు’ను 2006లోనే ఉరి తీయాల్సి ఉండినా, ఇంతవరకూ అమలుకాలేదు. క్షమాభిక్ష రాష్టప్రతి ఇస్తారో, ఇవ్వరో అయిదేళ్ళకు కూడా తేలకపోవడం విడ్డూరమే మరి! కోర్టులో కేసులు ఏళ్లుగా తీర్పులు రాక పడి వున్నవి- లక్షలాదిగా వున్నాయి. ‘ఆలస్యం అమృతం విషం’ కాదు, కొన్నింటిలో విషతుల్యమైనవి కూడా ఆలస్యమవుతున్నకొద్దీ- అవ్యవస్థకు ‘అమృతం’ పోసి, సమాజపతన కారణవౌతున్నాయి. ‘ఏడు మారినా ఈడు ముదిరినా ఏమి మారినది ఈ లోకంలో’ అన్న కవి కాళోజీ ఆర్తియే ఋజువవుతోంది. మరి మంచికి ‘టైం’ వచ్చేదెప్పటికో’’ అంటూ లేచాడు సన్యాసి.

0 comments: