ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, December 30, 2011

భుజంగ ‘ప్రయాసం’
"కర్ర విరగకూడదు. పామూ చావకూడదు.’’

‘‘అదెలా?’’

‘‘అదంతే మరి! కర్ర విరిగితే నష్టం. పామును చంపితే పాపం.’’

‘‘పాము అనేది విష సర్పం. కాటువేసి హాని చేస్తున్నదానిని చంపితే పాపం అనుకుంటే ఎలా.’’

సన్యాసి, శంకరం మధ్య సంభాషణం నడుస్తూంటే కల్పించుకుంటూ ప్రసాద్ అన్నాడు- ‘‘పాముకు కోరలు తీసేస్తే పోలేదూ? చంపడం దేనికి? భూతదయ కూడా వుండాలి కదా!’’

‘‘నాయనా! ఇది కోరలు తీసేస్తే ఊరకునే పాము కాదు. దీని ‘బుస’, దీని ‘కాటు’ అలాటివిలాంటివి కావు! ఇది ‘అవినీతి’అనే విష సర్పం, పట్టి బంధించి, విషం కక్కించి, దానినేదో ఔషధాలకు వినియోగం చేసుకుందామనుకునే బాపతు కాదు. సమూలంగా అంతమొందించాల్సిందే!’’ అన్నాడు శంకరం.

‘‘పార్లమెంట్‌లో జరిగింది పాములాటే నర్రా! అవినీతి అంతంకోసం అన్నాహజారే పట్టుబట్టిన లోక్‌పాల్ బిల్లు’’ అన్నా! ఇది అజగరాల విష పన్నాగం’’ అన్నట్లు- రాజకీయ డ్రామాలానే జరిగింది మరి! రాజ్యాంగబద్ధత ఏమీలేకుండానే లోక్‌పాల్ బిల్లు ఆమోదించబడడం అంటే- ‘కర్రా విరగకూడదు. పామూ చావకూడదు’అన్న తంతేగా! తంతేనన్నా బుద్ధి వస్తుందనుకోడానికి వీలులేని ‘తంతే’ జరిగిందంతాను!’’ అన్నాడు సన్యాసి.
‘‘అవునర్రా! కోరికోరి ఎవరూ తమకుతాము ఇబ్బందిపడే వ్యవహారం అంగీకరించరు కదా! అసలు ‘అవినీతి’ పెద్దఎత్తున ‘మేట’ వేసిందే రాజకీయాల్లోనాయె! రాజకీయ ఒత్తిడుల కారణంగానే అక్రమాల, అవినీతుల పనులు చేయాల్సి వస్తోందని అధికార యంత్రాంగం కబుర్లు చెబుతూంటుంది. మూజువాణి ఓటుతో ‘లోక్‌పాల్’ ఆమోదించారే గానీ, బిఎస్‌పి, ఎస్‌పి, ఎం.పీలు ఓటింగ్‌ను బహిష్కరించారు. బిజెపి, అన్నాడిఎంకె, టిడిపి, లెఫ్ట్ సభ్యులు మధ్యలో ‘వాకౌట్’ చేసారు. తూతూ మంత్రపు లోక్‌పాల్ బిల్లుతో ప్రయోజనం లేదని అటు అన్నాహజారే దీక్షకు దిగి అనారోగ్యం పాలయినా, బలహీనమైన బిల్లుకు మద్దతిచ్చేది లేదని బీజేపి భీష్మించినా, కాంగ్రెస్ అధికారంలోని యుపీఏ ప్రభుత్వం దానిని ఆమోదించేసుకోగలిగింది’’ అన్నాడు ప్రసాద్.

‘‘కోరలు తీసేయడం అని నీవనుకుంటున్నావేమో గానీ ప్రసాద్! రాజ్యాంగ బద్ధత లేని బిల్లువల్ల- ఆశయానికి ‘చిల్లు’పొడవడం తప్ప ప్రయోజనం ‘నిల్లు’అనే చెప్పాలి’’అన్నాడు సన్యాసి.

‘‘అది కాదయ్యా! అసలు రాజ్యాంగబద్ధతవల్ల లాభాలేమిటి? చిత్తశుద్ధి, నిజాయితీ వుంటే తప్ప అసలు ఏ చట్టం అమలయినా కట్టుదిట్టం కాదుకదా! చట్టాలను చుట్టాలుగా మార్చుకుని, తమ స్వార్థప్రయోజనాలను ఎలాగూ సోకాల్డ్ పెద్దమనుషులు నిలబెట్టుకుంటూనే వున్నారుగా’’ అన్నాడు రాంబాబు.

‘‘చట్టబద్ధమైన సంస్థగా కాదు, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థగా ఏర్పడితేనే- అవస్థలు తప్పి, మరింత ప్రభావదాయకంగా, ‘అవినీతి’ ఇతర ప్రలోభాలకు దూరంగా మసలే వీలుంటుందన్నది అనుభవాలు నిరూపిస్తున్నాయని నిపుణులు చెప్పినమాటే! చట్టబద్ధమైన వాటి మౌలిక స్వరూపాన్ని మార్చడం సులభం. సాధారణ మెజార్టీ చాలు దానికి. అదే రాజ్యాంగబద్ధంగా ఆవిర్భవించిన వ్యవస్థను మార్పుచేయాలంటే- అది చాలా సంక్లిష్ట విధానం. లోక్‌పాల్ రాజ్యాంగబద్ధమైన సంస్థగా ఏర్పడితే- కేంద్ర ఎన్నికల సంఘం తరహాలో, నిర్ణయాత్మక అధికారాలు తీసుకునే వీలుండేది! శక్తివంతమైన వ్యవస్థగా ‘లోక్‌పాల్’ అవతరించేది. ఇప్పుడాపని జరగలేదు మరి’’ అన్నాడు సన్యాసి.

‘‘రాష్ట్రాలకు లోకాయుక్తల ఏర్పాటును ఐచ్ఛికం చేసారు. సాయుధ, వైమానిక, తీర గస్తీ సిబ్బందికి లోక్‌పాల్ పరిధి నుంచి మినహాయింపు ఇచ్చారు. మాజీ ఎంపీలకు వున్న మినహాయింపును అయిదేళ్లనుంచి ఏడేళ్లకు పొడిగించారు. కార్పొరేట్, మీడియా, ఎన్జీఓల విరాళాల వంటి అంశాలపై సవరణలూ వీగిపోయాయి. ‘సిబిఐ’ని లోక్‌పాల్ పరిధిలోకి తేవాలన్న డిమాండ్‌ను ప్రధాని తోసిపుచ్చారు. లోక్‌పాల్ సాయంతో అవినీతిపై తాము పోరుచేయడానికి మాత్రం కట్టుబడి వున్నామన్నారాయన’’ అన్నాడు ప్రసాదు.

అవునయ్యా! అలా అనకపోతే, ఎవరన్నా- ‘‘మేం అవినీతిని ప్రోత్సహిస్తా’’మంటారా? గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడుముకునే కాలం కూడా కాదిది. అవతలవాళ్ల భుజాలు తడిమి, అవసరమైతే ‘భుజం తట్టే’ కాలం ఇది! అంచేత- ఇవాళ వ్యవహారాలన్నీ ‘అవినీతి’మయాలే! దేని గురించి అడిగినా పైకి మాత్రం- ‘అది- నీతిమయాలే’ అని ‘ప్రొజెక్ట్’చేస్తారు. ‘ప్రాజెక్ట్’లయినా, ‘యాక్ట్’లయినా, అన్ని ‘టాక్ట్’ఫుల్‌గానే మలుచుకుంటారు! ప్రభుత్వం రూపొందించిన లోక్‌పాల్ బిల్లుకు వ్యతిరేకంగా దీక్ష సమకట్టినా- జ్వరపడడం, పల్స్ రేటు పెరగడం తప్ప, అన్నాహజారేకే కాదు.. అవినీతి గురించి ఆవేశపడే ఏ సామాన్యుడికయినా బలహీనపడే పరిస్థితే! అయితే ‘అవినీతి మనల్ని జయించినా ప్రస్తుతానికి, ఒకనాటికి అవినీతిని మనం జయించకపోము’’ అన్న దిశగా చిత్తశుద్ధి ప్రయత్నాలుంటే- చిన్నగా మొదలైన ‘నిప్పురవ్వే’ పెద్ద ‘మంట’గా మారి, చెత్తనంతా ‘దహించగలిగినట్లు ‘‘సర్వభక్షకుడే’ అగ్నిసాక్షిగా ‘పునీతుడు’కాగలడు! నిలువనీరు, పాతనీరు కొత్త వర్షంతో కొట్టుకుపోయి, కొత్తనీరు, స్వచ్ఛ జలం రాకుండా పోదు. అంచేత ‘అవినీతిని అంతమొందించడానికి, కొత్త సువ్యవస్థను ఆహ్వానించడానికి పాతకు గుడ్‌బై చెబుదాం! భూతాన్ని పాతర వేద్దాం. ఆగామిని స్వాగతిద్దాం’’ అన్నాడు శంకరం లేచి నిలబడుతూ.

2 comments:

Unknown said...

Congrats for successful launch of two of your poetry books. The function was a grand sucess, as many eminent personalities attended the same and appreciated your works.
-Amballa Janardhan

సుధామ said...

Thank you janardhan garu.Your presence added Glory to the Meeting