ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, December 23, 2011

అంతా మన మంచికే

"గర్జించు రష్యా
గాండ్రించు రష్యా
పర్జన్య శంఖం పూరించు రష్యా"

అని ఒకప్పుడు శ్రీశ్రీగారు రాసారు. ‘నవయుగ భగవద్గీతా ఝంఝ’ని ప్రసరిస్తానన్నారాయన. కానీ అసలు ‘భగవద్గీత’ అంటే- ఎవరయినా చచ్చిపోయినప్పుడు వినిపించే ‘కండోలెన్స్’ వ్యవహారంగా మన దగ్గర ఇవాళ చెలామణీ అవుతున్నప్పుడు, పతనమయ్యాక కూడా కంటి లెన్స్‌లు మార్చుకోక- అందులో ఆ ‘దేశం’ ఉగ్రవాదం చూడడం తమాషాగా లేదూ!’’ అన్నాడు రాంబాబు.

‘‘ఓ బేసిక్ విషయం మీరు మరిచిపోతున్నారోయ్! యుద్ధం చేయనని విల్లంబులు కిందపడేసిన అర్జునుడికి యుద్ధోన్ముఖంగా సమాయత్తం చేయడానికేకదా కృష్ణుడు గీతా బోధ చేసింది. అంటే ఏమిటన్న మాట? అది వీరత్వాన్నీ, శూరత్వాన్నీ, అధర్మంపై పోరునీ ప్రేరేపించేది అని కదా! కర్తవ్యం బోధించేది - కళ్లకద్దుకోవలసింది అవుతుంది గానీ, నిషేధించుకోవాల్సింది ఎందుకవుతుంది’’ అన్నాడు శంకరం.

‘‘సరే! రష్యావాడికి అందులో ‘తీవ్రవాదం’కనబడినందుకు నన్నడిగితే ఒకందుకు సంతోషించాలి! మనమే దాన్ని చావువేళ ఏడుపుగొట్టు సానుభూతి స్థాయికి దిగజార్చుకున్నాం. ఇప్పుడు మళ్లీ మన కళ్లు తెరిపించింది రష్యాయే అనుకోవాలి’’అన్నాడు సుందరయ్య నవ్వుతూ.


‘‘రామాయణం రంకు- భారతం బొంకు అంటూ, భగవద్గీతని ‘క్రుంకు’గా మార్చుకుంటున్నది మనమే నర్రా! భగవద్గీత యుద్ధాన్నీ తీవ్రవాదాన్నీ రెచ్చగొట్టేదిగా అతిగా భావించడం ఒక పార్శ్వం అయితే, మృత్యువయ్యాక శ్మశానానికి తరలించే సందర్భంలో పార్థివ శరీరం దగ్గర పార్థుడుకి బోధించిన గీతను మనం కర్మ సిద్ధాంతంగా ‘ప్లే’ చేసుకుంటున్నది మరో పార్శ్వం! ఒక విధంగా మనకంటే రష్యా భావనే ఔచితీవంతంగా వుందేమో ఇవాళ’’అన్నాడు శంకరం.

‘‘మన వేదాలు, పురాణేతిహాసాలు వీటి గొప్పదనం వేరేవాళ్లు చెబితే గానీ పట్టించుకోలేని స్థితిలో వున్నామా మనం? అదీకాక భగవద్గీతకు అనేక వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ఇస్కాన్ వారి వ్యాఖ్యాన గ్రంథం సైబీరియా కోర్టుకెక్కింది. కానీ వాస్తవాలు గ్రహించినప్పుడు కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కూడా మూలకందంగా ‘భగవద్గీత’వుంది. పది మంది బాగుకోసం ఒక అధర్మంపై యుద్ధంచేయడం తప్పుకాదు అనీ, స్వజనులే అయినా స్వార్థపూరితులై అధర్మవర్తనులైనప్పుడు వారిమీద ఆయుధం ఎక్కుపెట్టడం అవసరమేననీ చెబుతోందికదా గీత! ఇవాళ న్యాయస్థానాల్లో మనదగ్గర ‘గీత’పై ప్రమాణం చేసి కూడా, అక్రమాలు పెచ్చుమీరే స్థితి సంక్రమించినప్పుడు, నిజానికి సి.బి.ఐ. ‘లక్ష్మీనారాయణులు’ కర్తవ్యోన్ముఖులవుతున్నారంటే సంతోషించాలి. ‘సవ్యసాచి’ అయినవాడు ఇవాళ రెండుచేతులా సంపాదించే అక్రమార్జునపరుడిగా, స్కామ్‌ల నేర్పరిగా పరిణమిస్తున్నప్పుడు భీష్ముడి మీదకు కృష్ణుడే చక్రం ఎత్తినట్లు, ఇవాళ పాలనా వ్యవస్థపైనే, రాజకీయ కశ్మలంపైనే, ‘చక్రం’ తిప్పాల్సిన తరుణం ఆసన్నమయింది! ‘అన్నీ వేదాల్లోనే వున్నాయిష’ అన్నట్లు- నిజంగానే వేదోపనిషత్తుల సారమనదగిన ‘భగవద్గీత’నరుడిని మానవధర్మం పాటిస్తూ నారాయణుడిని చేరుకొమ్మని ప్రబోధించేదే. రష్యా అన్నమాటవల్లనైనా ‘శిష్యా! అసలు గీతాసారం గ్రహించు’అని పునర్మూల్యాంకనంతో సమాయత్తం చేసినట్లవుతోంది. ఇది ఒక విధంగా మంచి పరిణామమే సుమా’’అన్నాడు సుందరయ్య.

‘‘మార్క్సిస్టులు వేసే మార్కులు వేరేగా వుంటాయర్రా! సీత రావణుడిని వలచిందన్నట్లుగా ఓ రంగనాయకమ్మగారు రాస్తే, మరో యార్లగడ్డ నాయకమ్మన్యులు ద్రౌపది కర్ణుడినే కాదు కృష్ణుడినీ వలచింది అన్నట్లు ధ్వనింపచేస్తారు. అసలు వేదాలనూ, పురాణాలనూ తిట్టి నిరసించడమే అభ్యుదయమనే భావన కొందరిది.’ ‘భారతీయత,’ ‘హిందూత్వం’అనేది మతానికి అంటగట్టుకునే దౌర్భాగ్యంలో పడ్డాము. అదేదో ‘బి.జె.పి’ మానిఫెస్టో అనుకుంటారు కొందరు. జర్మనీలో మన వేదాలు నెత్తికెక్కించుకుంటారు వాళ్లు. కృష్ణభక్తిని ఇస్కాన్ పూనుకుని హరేరామ హరికృష్ణ ఉద్యమంగా విదేశంనుండి దిగుమతి చేస్తే ‘గొప్ప’ అనుకున్నాం. ఒకప్పుడు హిప్పీ కల్చర్‌తో దాన్ని ముడిపెట్టి, మన యువతను అపమార్గం పట్టించడమూ జరిగింది. ఇంతకీ- మనను మనం తెలుసుకునే స్థితిలో లేకపోవడం విచారకరం. మన వేద పురాణాల ఔన్నత్యాన్నీ, మన భారతీయ సంస్కృతి గొప్పదనాన్నీ, మనిషి గురించీ, మానవత్వం గురించీ ఒక ‘సుపథ’గాములను చేసే వాటి ఉదాత్తత గురించీ, మనం గ్రహించుకోగలగాలి. విశ్వనాథవారు ‘వైరభక్తి’ అన్నారు. ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అని- అసలు రాముడి తత్త్వాన్ని మారీచుడే గొప్పగా ఆవిష్కరించినట్లు వాల్మీకి రచించారు. అంచేత ఒక్కొక్కసారి ఇలాంటి కదుపులు, కుదుపులు అవసరమే! భగవద్గీతను నిషేధించే విషయంలో రష్యా వెనక్కి తగ్గిందంటే- హిందువుల మనోభావాలు దెబ్బతింటాయనే కాదు, నిజానికి అందులోని మనిషి కర్తవ్యోన్ముఖతా సారాంశాన్ని గ్రహించగలగడమే. అంచేత ‘అంతా మనమంచికే’. అధర్మం, అశాంతి పెరిగినప్పుడే యుద్ధం. యుద్ధం అనేది శాంతి కోసమే! మనిషి బ్రతుకే బహిరంతర యుద్ధం. ఆ యుద్ధారావమే ఆలోచనామృతమైన సాహిత్య సంపద. ‘భవద్గీత’అన్నా,‘భగవద్గీత’అన్నా ‘అంతా మనమంచికే’ అంటూ లేచాడు శంకరం.

0 comments: