ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, November 11, 2011

ప్రత్యేక సౌకర్యాలు
"'అంతా సమానమే’ అన్న సిద్ధాంతం వినడానికి బాగుంటుంది కానీ, ఆచరణలో కుదరదు. ‘‘పురుషులందు పుణ్యపురుషులు వేరయా’’ అన్నట్లు-ప్రతి దాంట్లోనూ ‘వేరు’ అనేదొకటి వేళ్లూనుతూంటుంది. ‘స్ర్తి పురుషుల్దరూ సమానమే. అయితే మగవాళ్లు ‘మరింత ఎక్కువ సమానం’ అని ముళ్లపూడి ఏదో చిత్రంలో పేర్కొన్నట్లు, వాస్తవాలు ఎప్పుడూ ‘వేరు’గానే ఉంటాయి’’ అన్నాడు సుందరయ్య.

‘‘ఆ మాట మాత్రం నిజం సుందరయ్యా! అయితే తమాషా ఏమిటంటే-‘మంచి చెడ్డలు రెండే కులములు మనుజులందున ఎంచి చూడగ’ అని గురజాడవారన్నారు గానీ, మంచివారంతా ఒకటనీ, చెడ్డవారంతా ఒకటనీ కూడా వేరు చేయలేం. అదీ చిక్కు ఇవాళ! మంచిలోనూ మళ్లీ‘వేరు’, చెడ్డలోనూ మళ్లీ ‘వేరు’ ఉన్నాయి. వంచనలు, మోసాలు, దగాలు, అక్రమార్జలు చేసినవాళ్లని అరెస్టు చేసి జైలుకు పంపిస్తున్నారా? అయినా మామూలు ఖైదీలతో సమానంగా వారిని చూడరు. వారు ప్రత్యేక ఖైదీల క్యాటగిరీ’’ అన్నాడు రాంబాబు.


‘‘భలే అన్నావ్! గనుల అక్రమ తవ్వకం కేసులో అరెస్టయి, ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్న ‘గాలి’ సోదరులను ‘ప్రత్యేక ఖైదీలు’గా గుర్తించాలని నాంపల్లిలోని సి.బి.ఐ ప్రత్యేక కోర్టు ఆదేశించిందట! అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన డబ్బుతో వీరు సంపన్నులుగా మారారనీ, వీరికి ప్రత్యేక సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఏమాత్రం లేదనీ సిబిఐ వాదిస్తూ వచ్చింది. నిజానికి గాలి జనార్దనరెడ్డి ఓ మామూలు పోలీస్ కానిస్టేబుల్ కొడుకే. అయితేనేం! సంపన్నకుటుంబాలకు చెందిన తమకు జైలులో ప్రత్యేక సౌకర్యాలివ్వాలని వారి డిమాండ్. డబ్బున్నవారికి చట్టమైనా చుట్టమే కావడం ఈ దేశంలో విడ్డూరమేమీ కాదులే’’ అన్నాడు ప్రసాదు.


‘‘నిజానికి నన్నడిగితే ఇలా అవినీతి, అక్రమార్జనలు చేసి మందిని ముంచి, మోసాలు చేసి, సంపన్న స్థాయికి వచ్చిన వారిని-మామూలు ఖైదీలకన్నా తక్కువరకంగా క్యాటగరైజ్ చేసి శిక్షిస్తే తప్ప, సమాజంలో మార్పురాదు! దురదృష్టవశాత్తు ఇవాళ మంచికి కన్నా చెడుకే ప్రాచుర్యం ఎక్కువ లభిస్తోంది. విలువలు పెంచే విషయాలకన్నా, విలువల పతనాల అంశాలు, బలహీననతలను గ్లోరిఫై చేసే విషయాలు, నేరస్తులు, వంచకులు, అవినీతిపరులకే ఎక్కువ ప్రచారం ‘మీడియా’కూడా చేస్తోంది. ‘యశమునందనురక్తి’ సజ్జనులకు ప్రకృతి సిద్ధ గుణం అని భర్తృహరి అన్నాడు కానీ, నిజానికి ‘చిత్తశుద్ధి’ ‘నిజాయితీ’ గలవారు, సేవా తత్పరులూ ఈ ప్రచారార్భటులకు దూరంగానే ఉంటున్నారు.‘అన్నీ ఉన్నమ్మ అణగిమణగి ఉంటే-ఏమీ లేనమ్మ ఎగిరెగిరి పడిందని’ సామెత ఊరికే రాలేదు. ప్రతిభా శూన్యులు, లేక అల్ప ప్రతిభామతులు-కీర్తి ప్రతిష్టలు ఆర్జిస్తుండగా, గుర్తింపు నోచుకోక- మరుగున పడిన మాణిక్యాలవంటి వారెందరో ఉన్నారు. వారి సంగతి ఎవరికీ పట్టడమే లేదు’’ అన్నాడు ఆర్తిగా సుందరయ్య.


‘‘చొరవ ఉండాలి సుందరయ్యా! ధర్మం, న్యాయం నాలుగు పాదాలా నడుస్తున్న కాలమేమీ కాదుకదా ఇది! ప్రతిభ ఉన్న చోటికి అవకాశాలు వాటంతట అవే నడిచి వస్తాయి అనుకోలేని రోజులు ఇవి. అవకాశాల కోసం తలుపు తట్టడానికి సంకోచిస్తే,వచ్చిన అవకాశాలను చొరవ చూపక మిన్నకుంటే నష్టం ఎవరికి? ప్రపంచం, కాలం ఏ ఒక్కరి కోసమూ ఆగవు. పనులు ఏవీ ఆగిపోవు. నాణ్యతా ప్రమాణాలు, విలువల గాఢత, పూర్తి ‘పర్‌ఫెక్షన్’ అనే వాటికోసం ఏ రంగమూ నిరీక్షించడానికి రెడీగా లేదు మరి! పనులు అయిపోవాలి అంతే! ప్రజలూ అలాగే తయారవుతున్నారు. ప్రలోభాలకు లొంగనివారు అరుదైపోతున్నారు. మొన్న పాపం సహజనటి జయసుధ ఆవేదన పడినట్లు-‘‘ఎప్పుడైతే డబ్బు తీసుకుని ఓటేస్తున్నారో, ప్రజలు లంచగొండులవుతున్నారో, అప్పుడు వాళ్లకి నేతలను నిలదీసే హక్కు ఉండదు’’ ప్రజలను అలా లంచగొండులుగా మారుస్తూ రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ఎందరు జయప్రకాష్ నారాయణలు పూనుకున్నా, మార్పు అంత సులభం కాదు. రాజకీయ పార్టీల్లో లోక్‌సత్తా వేరు అని తెలిసినా, ప్రజలు ఆ ‘వేరు’కు నీరుపోసి, మహా వృక్షం చేయడానికి రెడీగా లేదు కదా’’ అన్నాడు శంకరం.


‘‘ కానీ ‘భగవంతుని దృష్టిలో అంతా సమానమే' అనయినా అంగీకరించాలి మనం. కానీ-దానికీ సమాయత్తం కాలేకపోతున్నాం. ఎవరి సంచిత కర్మలననుసరించి వారి జన్మలు, వారి ఆయురారోగ్య ఐశ్వర్యాల స్థాయి ఉంటుంది. కానీ దానినే మనం సాకుగా తీసుకుని భగవంతుడికే ‘వివక్షను’ అంటగడుతున్నాం! ధర్మవర్తనులైన కొందరు యదార్ధ ప్రవచకుల అవసరం నేడు మరింతగా ఉందనిపిస్తోంది." అన్నాడు ప్రసాదు.


‘‘నిజమే, ధర్మ ప్రచారం అనేది నిజంగా ఒక ‘వేరు’.అది హృదయాల్లో మొలకెత్తి శాఖోపశాఖలై విస్తరించగలిగితేనే అసలైన ‘నీడ’, అసలైన అమృతఫలమూను. మంచి చెప్పేవారు మంచిగ కనిపించినప్పుడే ఏ కొంచెం మంచి అయినా నిలదొక్కుకుంటుంది. ఇటీవల లలిత కళాతోరణంలో శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనాలకు వచ్చిన జనాన్ని చూస్తే నాలుగు మంచిమాటలు విని తమను తాము సరిదిద్దుకోవాలన్న కాంక్ష జనంలో బలీయంగా ఉంటుందనీ, ఆ కాంక్షాగ్నిని సవ్య క)తువుగా నిర్వర్తించగలిగి, ఉదాత్త ఆశయాల సంస్కార దిశగా మరలించగలిగితే ఇంత పాప పంకిల స్థితిలోను, ‘పావనత’ ప్రతిష్ఠాపితం కాగలుగుతుందన్న ఆశ పొడచూపుతోంది! పుట్టినప్పుడు తెచ్చుకున్నదీ, వెళ్లేటప్పుడు వెంట తీసుకుపోయేదీ ఎవరికీ ఏమీ లేదన్న విషయంలో ఖచ్చితంగా -‘అంతా సమానమే’ కదా! నడుమ ‘వేరు’ పాటులు, ‘వేరుబాటులు’ ఎంత ‘అభోరు’గా ఉన్నా, ఎన్ని ప్రత్యేకతలు ఆపాదించుకున్నా, సంపాదించుకున్నా, చివరకు మిగిలేది మట్టి, బూడిదే! అందరికీ అవే ప్రత్యేక సౌకర్యాలు. ఇవాళ ఈ పదకొండు-పదకొండు-పదకొండున గుర్తించాల్సిన ప్రత్యేకత అదే! అంటూ లేచాడు రాంబాబు.

0 comments: