ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, October 28, 2011

కుడి ఎడమలు తేడాలా?


 

''ఒక నవలలోగానీ, సినిమాలోగానీ ‘హీరో’ని చూడ డం మనకు అలవాటైపోయింది గానీ, అసలు ‘హీరోకూ’, ‘ప్రొటాగనిస్టు’కూ అంతరం నిర్ధారించుకోలేమా?’’ అన్నాడు సుందరయ్య.


‘‘అదేనోయ్ తమాషా! సినిమాలో ఆడపిల్లని ఏడిపించడం, ఆమెను వెంటాడటం, మోసం చేయడం అనేది చూపించడం సాధారణంగా జరుగుతుంటుందా? - ఒకేరకం పనులే ఆమెపట్ల చేసినా, ఒకడిని హీరో అంటున్నాం, ఒకడిని విలన్ అంటున్నాం! ఆ సదరు హీరోయిన్ ముందు ఇద్దరినీ ద్వేషించినా, నిరసించినా, త్రోసిరాజన్నా, చివరకు పంతంతో నెగ్గించుకోవడంలోనే ఒహడు హీరో అవుతున్నాడు, ఒహడు విలనవుతున్నాడు. ఆ చిత్రీకరణకు మరి కొలబద్దలేమిటంటావ్?’’ అన్నాడు ప్రసాదు.


‘‘ఒకప్పుడు ‘హీరో’ అంటే మనవాళ్ళు ‘ధీరోదాత్తుడు’ అని నిర్ధారించారు. ధీరలవితుడు, ధీరశాంతుడు గట్రాలూ నాయకులుగానే గుర్తించినా, ‘ధీరోదాత్తుడు’కే పెద్దపీట. ఒకడితో మొదలెట్టి వందమందిని దాకా ఒంటిచేత్తో చితగ్గొట్టడమే సినిమాలో హీరోయిజంగా.. మనం నిర్ధారణకు వచ్చాం. ‘త్రాగుడు’ వంటి బలహీనతులున్న ‘దేవదాసు’నీ హీరో అనే అనుకున్నాం! ఆ త్రాగుడు ఒక తిరస్కృత వ్యవస్థకు ధిక్కారస్వరంగా ఆమోదించుకోవడం వల్లనే నిజానికి పిరికి వాళ్ళనిపించే ఆ రకం పాత్రలనూ హీరోలుగా గ్రహించాం! నెగిటివ్ అప్రోచ్‌లోనే - పాజిటవ్ లుక్ ఇచ్చి, నిజానికి ప్రతినాయక స్వభావ పాత్రలను కూడా హీరోలుగా ప్రొజెక్ట్ చేసిన నవలలూ, సినిమాలూ మనకు కొత్తేమీ కావు’’ అన్నాడు రాంబాబు కూడాను.


‘‘అదేకదా నేనంటున్నది! నిజానికి ఓ నాటకానికో, సినిమాకో - ‘ముఖ్యపాత్ర’ లేక ‘ప్రధానపాత్ర’ హీరోయే కావాలని రూలేం లేదు. కానీ మనం ‘ప్రొటాగనిస్టు’ అనబడే ఆ ప్రధాన పాత్రకూ, హీరోకీ మధ్య విభజన రేఖను పట్టుకోలేని వారమవుతున్నామనే నా భావన కూడాను! రామాయణానికి రాముడు, భారతానికి ధర్మరాజు, భాగవతానికి కృష్ణుడు హీరోలని మన నిర్ధారణ లాగానే, నవలలూ, సినిమాల విషయంలో కొన్ని కొలమానాలతో హీరోని నిర్ధారించుకున్నాం’’ అన్నాడు సుందరయ్య.


‘‘దీనినేనయ్యా మరి ‘మూస’ ఆలోచన అనేది! రంగనాయమ్మ ‘రామాయణ విషవృక్షం’ రాసి, సీత రాముడిని కాక రావణాసురుడిని ప్రేమించిందంటేనూ, మరో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ద్రౌపది కర్ణుడిని వలచిందంటేనూ కొందరు గగ్గోలు పెట్టారా లేదా? రాముడిని ‘హీరో’గా కాక ఒక ‘ప్రొటాగనిస్టు’గా చూడడానికి కూడా మనం సిద్ధంగా లేమనే కదా దానర్థం! కానీ నిజానికి ‘రావణుడు’ లేనిదే ‘రాముడి’ గొప్పతనం, ‘దుర్యోధనుడు’ లేనిదే ‘ధర్మరాజు’ గొప్పతనం ఏమీ ‘ఎలివేట్’ కావు కదా! అంచేత ‘ప్రతినాయకుడు’ ఎంత బలీయమైన పాత్రగా ఉంటే హీరో అంతగా ‘ఎలివేట్’ అవుతాడు. కానీ హీరోయే ప్రతినాయకుడి గొప్పతనాన్ని కూడా సమ్మిళితం చేసుకోవడం ఇవాల్టి ట్రెండ్ మరి’’ అన్నాడు శంకరం నవ్వుతూ.


‘‘హీరోని కాదు, విలన్‌నే అభిమానించే నైజమూ స్వభావంలో బలీయంగా ఉన్న మనుషులు సమాజంలో ఉన్నారు. అది మరిచిపోకండి! రంగనాయకమ్మ విషవృక్షం గురించి - విశ్వనాథ వారిని అడిగితే "అది ‘శత్రువుగా భగవంతుడిని చేరే మార్గం’ "అని నవ్వేసారు. మిత్రవైరుధ్యం, శత్రువైరుధ్యం అని రెండు రకాలున్నాయి కదా! నిజానికి ఆస్తికుని కంటే ఒక్కోసారి నాస్తికులే దైవం గురించి అధికంగా ఆలోచిస్తూంటారు! అలాగే ‘రావణుడే’ హీరోగా భావించే వారూ ఉంటారు! మొన్న మొన్ననే నరకచతుర్దశినాడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘నరకాసురుడి’ భారీ ఫ్లెక్సీ బోర్డుకు దండలు వేసి, బహుజనవర్గానికి చెందిన నరకాసురుడిని అగ్రకులాలు కుట్రలు చేసి యుద్ధనీతికి విరుద్ధంగా సత్యభామ అనే మహిళతో చంపించారనీ, దళితులే ఈ దేశానికి రక్షకులనీ, నరకాసురుని స్ఫూర్తితో దేశాన్ని పాలించాలనీ పి.డి.ఎస్‌యు., ఎ.ఐ.ఎస్.ఎఫ్., బి.ఎస్.ఎఫ్., దళ, టి.వీ.వీ., టీ.వి.ఎస్., ఓ.యు. డాక్టరేట్స్ అసోసియేషన్, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం, ఔసా తదితర సంఘాలు సంయుక్తంగా ఆర్ట్స్ కళాశాలవద్ద నరకాసుర వర్ధంతిని నరకుని కీర్తిస్తూ ఘనంగా నిర్వహించారుట! ప్రొఫెసర్ కంచె ఐలయ్యగారు ‘‘బహుజన విద్యార్థులు ఆంగ్లభాష నేర్చుకుని దేశపాలకులు కావాలనీ, సాంస్కృతిక విప్లవాన్ని మొదలు పెట్టాలనీ’’ పిలుపునిచ్చారట. రావణ సమర్థకులు లాగానే ఇక నరకుని వర్గంవారూ ఎదుగుతున్నారన్నమాట’’ అన్నాడు రాంబాబు!



‘‘ హిరణ్యాక్షకశిపులు, రావణుడు, నరకాసురుడే హీరోలని కీర్తించే సమాజం రూపొందుతోందంటే అందుకు దారితీస్తున్న పరిస్థితులేమిటని విశ్లేషించాల్సిన అగత్యమూ ఉంది. ‘అగ్రకులాలు, అగ్రకులాలు’ అంటారు గానీ - దేవుళ్ళందరూ అగ్రకులాలు వారే అనుకోవడం పొరపాటు! ‘కృష్ణుడు’ కూడా యాదవుడు. ఆ మాటకొస్తే ‘రావణబ్రహ్మ’ అన్నారు. ‘శ్రీరాముడు’ - క్షత్రియుడే; మర్యాదా పురుషోత్తముడనిపించుకున్నవాడు. దైవత్వమూ, గురుత్వమూ అగ్రకులత్వంవల్ల ప్రాప్తించ గలదనుకోవడమూ - సరికాదు. ఒకటి మాత్రం నిజం! హీరోలు అని మనమే కొందరిని ముందు నిలుపుతాం. ఒక ఆచార పద్ధతి మొదలైన వాటి విషయంలో అనుకూలంగా వాదించేవాడు. నిబద్ధుడై ఉండి వాదించేవాడు. సమర్థించేవాడు. అందుకై ముఖ్యపాత్రగా ప్రధానంగా వ్యవహరించేవాడూ నిజానికి ‘ప్రొటాగనిస్టే!’ - ఒక రచయిత తన రచనలో ఎవరిని హీరో చేస్తాడనేది ఉండదు నిజానికి. ప్రధాన పాత్రలుగా నవలలో కొన్ని ఉంటాయంతే! ‘రామాయణం’ రాసిన ‘వాల్మీకి’ అగ్రకులస్తుడు కాదు. ఒక ‘బోయవాడు’. వాల్మీకి రాముడిని, రావణుడిని ఇద్దరినీ చిత్రించాడు. రెండు పాత్రలూ సహజసిద్ధంగా రూపొందినవే! ఏ పాత్రను హీరో చేసి ఆదర్శంగా ఏ సమాజం తీసుకుంటుందో, ఆ సమాజ గతి తదనుగుణంగానే ఉంటుంది. రావణరాజ్యం నెలకొనాలని కాంక్షించే కాలంలో - ‘శ్రీరామరాజ్యం’, ‘ఔట్‌డేటెడ్’ అనే వారున్నా నివ్వెర పోనక్కర్లేదు! ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అయినట్లే - హీరోలు విలన్లు అవుతారు. విలన్లు హీరోలు అవుతారు. మనిషి మానసాన్ని బట్టే ముడివడే చిత్రగ్రంథి’’ అంటూ లేచాడు సుందరయ్య.

0 comments: