ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, October 14, 2011

ఈ పుస్తక దీప్తి




‘‘ఈ పుస్తకం చూసావా?’’ అడిగాడు సుందరయ్య.

‘‘ఏ పుస్తకం?’’ అడిగాడు సన్యాసి.

‘‘ఈ పుస్తకమే’’ అన్నాడు నవ్వుతూ సుందరయ్య

‘‘పుస్తకం యొక్క స్వరూప స్వభావాలుకూడా మారుతున్నాయర్రా! తాళపత్ర గ్రంథాలనుండి, తరం... తరంగా... చాలా దాటి వచ్చేసాం! ఇప్పుడు ‘ఈ బుక్స్’ వచ్చాయి. అక్షరం ‘ఎలక్ట్రానిక్’ అయిన మరింతగా ‘అక్షర’మవుతోంది! కాగితాలు, ముద్రణ అనేదాన్నికూడా అధిగమించేస్తున్నాం’’

‘‘కానీ కావలసినప్పుడు, మనకు కావాల్సిన పొజిషన్‌లో కూర్చునో, పడుకునో, కావాల్సిన పేజీ నుంచి చదువుకోవడం అచ్చు పుస్తకంనుండి కుదిరినట్టుగా, మరెక్కడా కుదరదుకదా!’’ అన్నాడు సన్యాసి.

‘‘అదేం లేదు! ఇప్పుడు ఆ సౌలభ్యం వచ్చింది. ‘కిండిల్’ అనేది పుస్తకం కొనుక్కుని దాచుకునే గ్రంథాలయంలాగా, ఈ బుక్స్ కొనుక్కుని భద్రపరచుకుని, ఎప్పుడు కావలిస్తే అప్పుడు చదువుకోగలిగే ఎలక్ట్రానిక్ పరికరమే! మనం చెప్పుకునే 1/8 డెమీ సైజు పుస్తకం లాగానే కొంచెం వెడల్పుగా, అదే సైజులో ఉండే ‘కిండిల్’ ద్వారా, మనం అందులోని పుస్తకాలను పడుకునికూడా చదువుకోవచ్చు! ఏ పుస్తకం మీదయినా కాంతి పడుతుండాలనేది ఎలాగూ ఉన్నమాటే! కానీ అసలు పుస్తకం చదవడంవల్ల కలిగే జీవితపు వెలుగు గొప్పది కదా!’’ అన్నాడు సుందరయ్య.

‘‘పైగా పుస్తకంలో ఏ పేజీలో చదవడం ఆపావో అదే పేజీనుండి మళ్ళీ చదవడం మొదలెట్టగల సౌలభ్యమూ ఇందులో వుంది! అందులో భద్రపరచుకున్న ఏ ‘ఈ బుక్కు’నయినా, ఏ పేజీ దగ్గర ఆపినా, మళ్ళీ ఆ పేజీ దగ్గరే ‘బుక్‌మార్క్’ చేసుకున్నట్టుగా, ఓపెన్ చేయగానే మొదలు పెట్టవచ్చు. మొదటినుండీ ప్రారంభించి చదువుకోవాలన్నా చదువుకోవచ్చు’’ అనికూడా అన్నాడు సుందరయ్య.

‘‘ఇదేదో బాగుందే! కంప్యూటర్లకూ, ఎలక్ట్రానిక్ యంత్ర సామగ్రికీ ‘అడిక్ట్’ అయిన యువతకు, కనీసం ‘బుక్ రీడింగ్’ అనగా పుస్తక పఠనం మీద ఆసక్తి పెంచడానికి ‘కిండిల్’ నిజంగా దోహదపడితే. అంతకన్నా కావలసిందేముంది! అయితే తెలుగు పుస్తకాలు కూడా చదివే అభిలాష, శ్రద్ధ ఈ తరానికి కలిగించి పెంచవలసిన అవసరం వుంది మరి’’ అన్నాడు సన్యాసి.

‘‘తెలుగు ‘ఈ బుక్స్’ మీద శ్రద్ధ పెరుగుతోందర్రా! అనిల్ అట్లూరి దీనికొక ఉద్యమంలా పూనుకున్నాడు. అంతెందుకు! మొన్న విజయనగరంలో - గురజాడవారి 150వ జయంతి సందర్భంగా, విశాఖ మెజెయిక్ సంస్థ రామతీర్థ - ‘కన్యాశుల్కం’ నాటకం తొలి ముద్రణను- అంటే 1897 నాటి ప్రతిని, మద్రాసు ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీలో ఉన్నదానిని, ‘డిజిటల్ కాపీ’చేసి ఆవిష్కరించడం జరిగింది. అలా ఒకనాటి తెలుగు సాహిత్యపు ఉత్తమ గ్రంథాలనుకూడా ‘ఈ - బుక్స్’గా మలచి ఈ తరానికి అందించే వీలుంది! ఏమయినా చదివే అలవాటును పెంచడం ముఖ్యం! ‘పుస్తక పఠనం’ అనేది మాత్రమే ఆలోచనను పెంచి. నిజంగా జీవితపు విలువల ‘కిండిల్’ కాగలుగుతుంది’’ అన్నాడు రాంబాబు.

‘‘పుస్తక పఠనం యొక్క ఆవశ్యకతను ఈ తరంలో పంచడం అన్నది తప్పనిసరి. దానికి ఎవరు ఏ మార్గం అనుసరించినా మేలే! ఇటీవల హైదరాబాద్‌లో ‘స్ప్రెడింగ్  లైట్స్’అనే కాన్సెప్ట్ తో - డాక్టర్ సూర్యప్రకాశంగారు జూబ్లీహిల్స్ ‘రాక్ సెడీ’, కుర్రాళ్ళు కూడే ,స్పైసీఫుడ్స్ ఆవరణలో వరుసగా వంద రోజులు వంద పుస్తకాలమీద వందమంది రచయితలు, పాఠకులు రోజుకొకరుగా వంద రోజులు ప్రసంగించే, అభిప్రాయాలు పంచుకునే పనిని ఒక ఉద్యమంలా చేస్తున్నారు! రోజూ సాయంత్రం నాలుగుమంది ఓ గంటసేపు ఎందరు హాజరయినా, నిర్విఘ్నంగా, నిరంతర స్ఫూర్తితో కొనసాగుతున్న కార్యక్రమం ఈరోజు 89 రోజులకు చేరుకుంది. ఇంకో పదకొoడు రోజులు సాగుతుంది. ‘దీప్ సే దీప్ జలాతే రహో’ అన్నట్లు ఈ సమావేశాలకు ఇటీవల అమెరికానుంచి హజరైన ఒక యువకుడు, తిరిగి ఆ దేశం వెళ్లి తను ఉన్నచోట తెలుగు పుస్తకాలపై ఇలాంటి కలయికనే స్ఫూర్తిమంతంగా మొదలెట్టాడట కూడాను! అన్ని రకాల వయస్సుల వారూ పుస్తకపఠనం మీద శ్రద్ధాసక్తులు కలిగించుకునేలా చేస్తున్న ‘ఈ కృషి’ నిజంగా మెచ్చదగింది మరి!’’ అన్నాడు సుందరయ్య.

‘‘ఓహ్! చాలా బాగుందే! నువ్వు చెబుతూంటేనే ఇంట్రెస్టింగా వుంది. ఇంతకూ కుర్రవాళ్ళు వస్తున్నారా లేదా అది చెప్పు’’ అన్నాడు సన్యాసి.


‘‘వక్త మాట్లాడుతుంటే ఎదురుగా కూర్చుని వినేవారు సరే; లోపల టేబుల్స్ ముందు కూర్చునీ, పైన మేడమీద వుండీ, ముందు మామూలుగా ఓ చెవి ఇటు పారేసినవారిలో సైతం, క్రమంగా పుస్తకంపట్లా, పుస్తక పఠనం పట్లా ఆసక్తి కలుగుతోందిట! రామకృష్ణయో, శ్రీకాంతో, దీప్తో, రాజుయో, అనూరాధయో.... ఏదయితేనేం, చదువుతున్నది ఇంజనీరింగ్, చేస్తున్నది ఏ మీడియా ఉద్యోగమో అయినా అలాంటి అలవోక శ్రోతలే పఠితలుగామారి, తాము చదివిన పుస్తకం గురించి మాట్లాడేందుకు సంసిద్ధమవుతున్నారంటే., ‘మంచి కదలిక’ మొదలైనట్లేగా’ అన్నాడు సుందరయ్య.

‘ఆలోచనామృతమైన సాహిత్యంపట్ల అభిరుచి పెంచే కృషీ, అందుకు మూలాధారనాడియైన ‘పుస్తకం - జిందాబాద్!’ అన్నాడు రాంబాబు నినదిస్తూ లేస్తూ.


0 comments: