ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, September 9, 2011

‘గాలి’ని బంధించి..
''చూస్తుంటే మంచిరోజులు వచ్చేట్లున్నాయ్. ‘ఉందిలే మంచీ కాలం ముందూ ముందునా’ అని పాడుకోవడం వీలయ్యేట్లుగా ఉంది. దేన్ని గురించి అయితే నిత్యం సామాన్యుడు నిస్సహాయుడవుతున్నాడో, ప్రజల సంపదను తిమింగలాల్లా మ్రింగుతున్న పెద్ద పెద్ద చేపలు క్రమంగా సి.బి.ఐ వలలకు చిక్కుతుండడంతో, అవినీతికి ఇక క్రమంగా అడ్డుకట్ట పడక తప్పదన్న ఆశారేఖలు పొడచూపుతున్నాయి’’ అన్నాడు సన్యాసి పేపర్ మడిచి టేబుల్‌మీద పెడుతూ.


‘‘నాన్నా! వార్తలు, చర్చలు చూసి మురిసిపోకు! నువ్వన్నట్లు నిజంగా జరిగితే మంచిదే కానీ, ఈ దేశం లో వ్యవస్థీకృతమైనది ప్రజాస్వామ్యం కాదు; అవినీతి అని ఇన్నేళ్ల స్వాతంత్య్రంలో స్పష్టంగా అర్ధమవుతుండగా-‘‘మన స్వాతంత్య్రం మేడిపండు-మన దారిద్య్రం రాచపుండు’’ అన్న ఆరుద్ర మాటలే సత్యమనిపించడంలేదా! ‘అప్పిచ్చిన వాడికి’ అనుగుణంగా రాజ్యాంగాన్నే మార్చేసుకోగల బుద్ధులు పొడచూపుతున్నప్పుడు, సరళీకృత ఆర్థిక విధానాలు ప్రజల సంక్షేమాన్ని కాక, అవినీతి వ్యవహారాలను సరళీకృతం చేసినట్లుగా స్పష్టంగా కనపడుతున్నప్పుడు, రాత్రికి రాత్రే వ్యవస్థ మారిపోతుందని నమ్మలేం కదా! ’’ అన్నాడు సుందరయ్య.


‘‘పద్నాల్గవ లోక్‌సభలో ‘ప్రశ్నలు’ అడగడానికి కూడా, ఎమ్‌.పీలు కొందరు ముడుపులు తీసుకున్నారంటే, దేశం ఎంత భ్రష్టుపట్టిందో, ప్రజాస్వామ్యానికి ఎంత అవహేళనమో అర్ధం కావడంలేదా? రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉండగా-ఏడాదికి అయిదు లక్షల కోట్లరూపాయల సంక్షేమ పథకాలుంటే, ‘పదిహేను శాతం’ మాత్రమే-అసలు ఉద్దేశించిన వారికి చేరుతోందని, ప్రధానిగా ఆయనే అంగీకరించాడు. అంటే నాలుగు లక్షల ఇరవై అయిదు కోట్లూ ఎటుపోతున్నాయని ఆనాడే నిఘా ఏమయినా వేసారా? లేదే? ఇవాళ మార్కెట్ శక్తుల పెంపు, నూతన ఆర్థిక విధానంవల్ల మనదేశంలో అవినీతి పెరిగిందంటే, రాజ్యాంగాధికారాలు అవినీతిపరుల చేతుల్లోకి పోవడమే హేతువు! ఆంధ్రప్రదేశ్, కర్నాటక ఇవాళ ‘లైమ్‌లైట్’లో కనిపిస్తున్నాయి. కర్నాటకలో ‘గాలి’ సోదరుల వ్యవహారం, ‘ధనార్జనరెడ్డి’ అరెస్టు, పెద్ద దుమారం లేపుతోంది. ఆయనతో సంబంధాలు లేవని బుకాయిస్తున్నా-జగన్ కూడా ఆ ప్రభంజనంలో ఎండుటాకులా వణికిపోతున్నాడన్నది వాస్తవం’’ అన్నాడు ప్రసాద్ గంభీరంగా.....


‘‘ పవర్ బ్రోకర్ ‘అమర్‌సింగ్’ అరెస్టూ జయప్రదంగా జరగడంతో, నేరస్థుల అదుపులో కొత్త అధ్యాయానికి తెర తీసినట్లే అనిపిస్తోంది! లంచం, ముడుపులు పొందిన రాజకీయవేత్తలూ, అధికారులనే సమాజం, చట్టం, న్యాయస్థానాలు దోషులుగా భావించడంనుంచి, ప్రలోభాలకు గురిచేసే, ప్రభుత్వంనుండి అక్రమ విధానాల్లో లబ్ధిపొందిన వారిపై ఇప్పుడు దృష్టి పెట్టడం, సన్యాసి అన్నట్లు- సువ్యవస్థపట్ల ఒక ఆశాకిరణమే! మైన్స్ మాఫియా ‘గాలి’ని బంధించడం, లైసెన్స్ పర్మిట్ రాజుల అవినీతిని నియంత్రించడమే! అవినీతికి లైసెన్సులు ఇచ్చుకుంటే పోయిన స్థితిని ఇవాళ ప్రశ్నించి నిలదీయడం అవసరం. ’’ అన్నాడు సుందరయ్య.


‘‘అమెరికా సామ్రాజ్యవాదం, సామ్రాజ్యవాదం అని మనవాళ్లు తిడుతుంటారు గానీ, అక్కడ ఇలా ‘అవినీతి’ వ్యవస్థీకృతమై మనకేమీ కనపడదు. ఆమధ్య మన జె.పి.గారు చెప్పారు-అరుణ్‌శర్మ, కిరణ్‌శర్మ అనే దంపతులు డాక్టర్లుగా ఉంటూ, రెండువందల కోట్ల రూపాయల అవినీతికిపాల్పడితే, వారికి పదిహేనేళ్లజైలు విధించి నూట తొంభై అయిదు కోట్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇంతకీ వాళ్లు భారతీయులు కావడం నిజంగా మనం సిగ్గిల్లాల్సిన విషయం! ‘‘అవినీతిపరులు ఆస్తులను అనుభవించలేరు. జైలుకు వెళ్లక తప్పదు’’ అన్న భయం పెరిగితే తప్ప, అవినీతిపరులకు కఠిన శిక్షలు పడితే తప్ప, వ్యవస్థ మారదు’’ అన్నాడు సన్యాసి.


‘‘ తపాలా బ్రదర్స్ బెంగుళూరు వారినుండి లీజ్‌కు తీసుకున్న గాలి సోదరులు , మైనింగ్ పర్మిషన్ అక్రమంగా పొంది, కబ్జాలు చేసీ, దొంగ మైనింగ్ చేసీ, నూట అరవై ఎకరాల ఓబులాపురం, అనంతపురం, మహాబలిపురం ప్రదేశాలనుండి అక్రమంగా ఇనుపఖనిజం తవ్వి, రోజుకు పదివేల లారీల్లో తరలించి, కాకినాడ, కృష్ణపట్నం రేవులనుండి విదేశాలకు తరలించి కోట్లు కోట్లు అక్రమంగా వాళ్లు సంపాదించారు. వారికి ప్రభుత్వాల అండ ఉండబట్టేగా ఇదంతా సాగింది! తమ తవ్వకాలకోసం ‘సుంకులమ్మ గుడిని’ కూడా కూల్చారనీ, వారి పాపం ఇవాళ బద్దలు కావడానికి అమ్మవారి ఆగ్రహమూ కారణం అనీ-అక్కడి ఫ్రజలు అనుకుంటున్నారట’’ అన్నాడు ప్రసాదు....


‘‘1950, 1960 దశకాలలో ‘కోల్‌మైన్స్’ జాతీయం చేశారు! ఒరిస్సాలో బాక్సైట్ నిలవలు బోలెడున్నాయి. ధరలు తగ్గినప్పుడు అయిదులక్షల టన్నులు ఎందుకు అమ్మారని మైన్స్‌లో పనిచేసినవారు ప్రతిఘటించిన సందర్భాలున్నాయి. కానీ ఏం లాభం? రాజ్యాంగాధికారం, లైసెన్సు పర్మిట్లు, ఎన్నికలు, అన్నీ అవినీతిమయం కావడంవల్లనే-పదిహేను లక్షల యాభైవేల కోట్ల రూపాయల అవినీతి 1950నుంచి నేటి వరకు జరిగిందనేది ఒక అంచనా! ఈ ‘అవినీతి వృక్షము’ను కూకటివేళ్లతో సహా, పెళ్లగించి వేయాల్సిందే! రాజుకుంటున్న ఈ వ్యతిరేకత చిచ్చుకు గాలి దుమారం తోడై, ఖాండవ దహనం జరిగినట్లు అవినీతిఅంతం అయ్యే శుభ గడియలకు ఎదురు చూడాల్సిందే’’ అన్నాడు సుందరయ్య.

*

2 comments:

యమ్వీ అప్పారావు (సురేఖ) said...

అవునండి ! రోజులు మారాయి, మంచి రోజులొచ్చాయ్ ! అనే ఆశ, "నీ పాపం పండెను నేడు ! నీ భరతం పడతా చూడూ" అని గట్టిగా పాడాలనిపిస్తున్నది.

Anonymous said...

Meeru chaaal amaayakulu anukoval leka congress supporter anukovala artham kavatam ledu. Ippudu only avineeti vallanu matrame arrest chestunnaru anukunte cheyyinche vallu antakanna avineeti parulu. Ippudu jarugutunnadi kevalam rajakeeya kreeda. Repu jagan malli congress to kalisipote ee case lu yemi undavu appudu kuda janalu verrollu vutaru(ippudu avutunnatle).