ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, May 22, 2011

కవిత్వ పుస్తకంతో కాసేపు


గమ్యం కాదు గమనం!

-సుధామ

కవిత్వానికి నిడివి అనేది ఎవరో నిర్దేశించడం కంటే కవి తన హృదయావిష్కరణకు అనుగుణంగా కవిత ఇతివృత్తాన్నిబట్టి కూర్చుకోవడమే సబబు.

 ఏది ఖండకవితగా రాయాలో, ఏది దీర్ఘకవితగా మలచాలో, క్లుప్తంగా ఎక్కడ ఎలా అభివ్యక్తం కావాలో కవి తనకు తాను నిర్ణయించుకోవాల్సిందే. అయితే కవిభావం అక్షరాకృతి దాల్చిన తరువాత మటుకు ఇక దాని గురించి పాఠకుడే ఏం అనుభూతి పొందినా.

‘‘పాదనియమం ఉన్న లఘురూపాల్లో కంటే మినీ కవితలో ఎన్నో శిల్ప వైఖరుల్ని ప్రదర్శించే వీలు బాగా ఉంది. ఇంకో విషయం ఏమిటంటే ఒక్కొక్క లఘురూపం వెనక కవిలో ఒక్కొక్క విధమైన మానసిక తత్త్వం నిర్దిష్టంగా ఉంటుంది’’ అన్న అద్దేపల్లి మాటల్లో ఎంతో ఔచిత్యం ఉంది.

డా.విప్లవ్‌దత్ శుక్లా వెలువరించిన మినీకవితా సంకలనం ‘విపుల’. ఇవాళ కళ ఏదయినా శుద్ధ కళకోసం అన్నది ఎవరూ సామాజిక చైతన్యం అనేది లేకుండా అంగీకరించరు. ప్రయోజనం ఎదో లేనిదే ప్రయుక్తం అయ్యేదానిలో అర్ధం లేదనేది భావన. శుక్లా మినీ కవితలు అందుకే ఒక చైతన్య లక్ష్యంతో అభ్యుదయ పథగాములై వ్యక్తమవుతున్నాయి. వైరుధ్యాల సమాజంలో వ్యక్తిని ప్రగతి చేతనతో ముందుకు సాగేలా ఉన్ముఖపరచడమే అతని ఆశయంగా భావించడానికి వీలుంది.

‘విపుల’ మినీ కవితల్లో విప్లవ్ దత్ పేరులోని విప్లవ భావాలనే వెలిగ్రక్కాడనుకుంటే పొరపాటు. ఏ శుక్లాలు అడ్డుపడని నిశిత దృష్టి అతనికి ఉంది. ప్రారంభంలోనే ‘వంగి పనిచేయడం తప్పుకాదు. వంగి ఉండడం తప్పు వంగి కొడవలిగా పదునెక్కకపోవడం తప్పు’ అంటాడు. వినయంతో అణిగి ఉండడానికి, భీరువుగా అణగి మణగి ఉండడానికి, వంగిన విల్లునుండే బాణంలో దూసుకుపోవడానికీ వ్యత్యాసం ఉంది కదా. ఇవాళ రాజకీయంలో ప్రతి పార్టీ కూడా ఓ ‘రంగు’తో మమేకమవుతోంది. ‘వర్ణ’ వ్యవస్థ ఆ రీతిలోనే విస్తరిస్తోంది. రంగునుబట్టి మనిషినీ రాజకీయాన్ని అంచనావేసే ధోరణి ప్రబలింది. ఈ విషయం గ్రహించిన వాడు కనకనే-‘రంగులతో గిరి గీసుకునేందుకు నాకు లేదు.. ఏ జెండా రంగం ఏదైనా మనిషి ‘మనీషి’గా నిలిచే మనుష్యుడే నా ఎజెండా’-అంటాడు.

సమాజంలో మానవ సంబంధాలు వ్యష్టినుండి సమష్టిగా రూపొందడానికి అత్యావశ్యకాలు. మనిషి సంఘజీవి కదా
అవసరాన్నిబట్టి/
మారే ‘సం’ బంధాలు/
కలుపుకుంటూ ‘కొత్తిమీర’/

కలువకపోతే ‘కరివేపాకు’

అనడం బాగుంది కరివేపాకునయినా తీసి పక్కన పెట్టేయకుండా సవ్యంగా పుచ్చుకుంటేనే కదా ‘గ్లాడ్‌బాడర్’ పటిష్టంగా పని చేసేది.

విప్లవ్‌దత్‌లో చైతన్యతత్వంతో పాటు ఒక తాత్త్విక పార్శ్వ మూ ఉంది.

‘నిన్న రావడం-
నేడు ఉండడం-
రేపు వెళ్లడం-
జీవిత ప్రయా ణం’ అంటాడు

‘కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం’ అని గతంలో ఓ కవి అన్నదానికి కాలంతో తద్గత భావాన్ని అనుసంధానం చేయడం సముచితం. ఇటువంటి కాలగతిలో ఏ మనిషికయినా-

‘మలుపు-కొత్తమార్గం.. గెలుపు-మరో మైలు రాయి.. గమ్యం కాదు గమనం-జీవితం!’ అన్నది యధార్థం.
‘యుద్ధం తెలిసిన యోధునికి ఓటమి అత్యల్పమని ఓటమి తెలిసిన విజయం తథ్యమని తెలుసు’
‘‘ప్రపంచం ‘కు’గ్రామం బ్రతుకు నిత్య సంగ్రామం అంతా ప్రపం‘్ఛ’కరణం-


అని వర్తమానాన్ని గొప్పవ్యంగ్య వైభవంతో ఆవిష్కరించాడు.

కరీంనగర్ హుజూరాబాద్‌కు చెందిన ఈ కవి ధైర్యంగా ‘‘విడిపోవడానికి-మార్గాలు వెతికితే-దూరాలు-అగాథాలౌతాయి. కలిసుండడానికి-ఆలోచిస్తే-జీవితాలు-గాధలై మిగులుతాయి’’ అని ప్రకటించడం కవి ప్రాంతీయతలనధిగమించిన ‘విపుల’ మానవుడు అని చాటుతాయి.

విపుల (మినీ కవితా సంకలనం)
రచన: డా.విప్లవ్‌దత్ శుక్లా
వెల. రూ.45/-
ప్రచురణ: మిత్రమండలి,
హుజూరాబాద్, 11-48, శుక్లాహౌస్
హుజూరాబాద్, కరీంనగర్ 505468


(అంధ్రభూమి దినపత్రిక ఆదివారం 22 మే'2011 'అక్షర ' పేజీలో)

0 comments: