ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, May 14, 2011

ఆవురావురుకాయ



"ఇంతకీ ఆవురావురుకాయ పెట్టారా లేదా మీ ఇంట్లో?’’ అని అడిగాడు శంకరం.
‘‘ఆవురావురు కాయ ఏమిటోయ్’’ నవ్వుతూ అడిగాడు ప్రసాద్.
‘‘ఆవురావురుమని తినే ఊరగాయ ఏదయినా ఉంటే అది ‘ఆవకాయ’ కనుకనే బహుశా మనవాడు అలా అడిగి ఉంటాడు. అంతేనటోయ్ శంకరం! అన్నాడు రాంబాబు.
‘‘ఆ! అదే...అదే...మామిడి కాయలతో ఈ ఎండాకాలంలోనే కదా అది పెట్టేది! ఏడాది పొడుతా నిలవవుంటూ, అన్నంలోకి మరే అధరవులు వున్నా లేకపోయినా, దానితో భోజనం లాగించేయచ్చు! అదో యజ్ఞంలా ఇళ్లల్లో ఈ కాలంలో సాగుతూంటుంది కదా! మామిడికాయలు, ఆవపిండి, ఆవనూనె, ఉప్పుకారం, కాయ తరగడానికి పెద్ద కత్తిపీట, కాయ చెక్కు తీయడానికి ఆల్చిప్పలు అంటూ ఊరగాయలు పెట్టడానికి నానా హంగామా ఉంటుంటుందిగా’’ అన్నాడు శంకరం కుతూహలం వ్యక్తీకరిస్తూ.

 ఇప్పుడు ఇళ్లల్లో ఆ సంబరాలెక్కడిదిలే! కాలం మారిపోయింది. ఉమ్మడి కుటుంబాలు పోయి మైక్రో ఫ్యామిలీలు వచ్చేసాయాయె! అందునా బజార్లో రకరకాల కంపెనీలవి, రకరకాల పచ్చళ్లు, సీసాలలో, ప్యాకెట్లలో దొరుకుతూండగా ఇప్పుడు ఇంట్లో ఊరగాయపెట్టే దృశ్యాలూ కనుమరుగవుతున్నాయి! ఒకప్పుడంటే-ఎవరికి వారు శుభ్రంగా తామే ఆవకాయ, మాగాయ అంటూ పెట్టుకుని జాడీలో గుడ్డలు చుట్టి అటకలమీద భద్రపరుచుకునేవారు. అవసరమైనప్పుడల్లా దింపి వాడుకునేవారు. ఎవరుపడితేవారు ఆ జాడీలు ముట్టుకోవడానికి వీల్లేదు! శుచిగావాటిని తీసి వినియోగించుకునే ఇళ్లుండేవి. ఒక్క ఆవకాయలోనే ఎన్నో రకాలు పెట్టేవారు. ఇంగువ ఆవకాయ, వెల్లుల్లి ఆవకాయ సరే! మాగాయ, ముక్కలపచ్చడి, పెసరావకాయ, సెనగలావకాయ, బెల్లపు ఆవకాయ, పులిహోర ఆవకాయ, గుత్తావకాయ, మిరపావకాయ, క్యాబేజీ ఆవకాయ, తురుము పచ్చడి, ఓహ్! ఒకటేమిటి...ఆంధ్రులు శాకంబరీదేవి-‘గోంగూర’ అన్నారు గానీ...దానికి మించిన విలువ, గౌరవం, వినియోగం ఆవకాయదే! తరవాణి అన్నంలో పొద్దునే్న ఆవకాయ కలుపుకుని, అందులో ఉల్లిపాయ ముక్క, పల్లీలు నంచుకుంటూ దానికి తోడు పెరుగుబిళ్ల మధ్య మధ్యలో నంజుకుంటుంటే..ఓహ్! ఆ మజాయే వేరు! స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్న సుఖం ఫీలయ్యేవాళ్లం’’ అన్నాడు రాంబాబు లొట్టలేస్తూ.
‘‘అబ్బే! ఈ కాలం వాళ్లకు ఆ తిళ్లు సుతారమూ పనికిరావోయ్. వీళ్లంతా హెల్త్ కాన్షస్ కదా! అంతలేసి ఉప్పులూ, కారాలూ, ఆవలు తింటే బ్లడ్ ప్రెషర్స్ అవీ వస్తాయనీ, ఊరగాయ వాడడంతో-‘ఊరు’ ‘కాయం’ వస్తుందీ కూడా వీళ్ల భయం! ఆరోగ్యం చెడిపోతుందనీ, ఆవకాయవల్ల ఎసిడిటీలు, కడుపుమంటలూ పెరుగుతాయని ఇప్పటివాళ్ల ఊహ! అసలు పచ్చళ్లు అంటేనే గిట్టనివారున్నారు. జిహ్వ చాపల్యం చేత కొంచెం తిందామనుకున్నా వారికయినా, రెడీమేడ్ పికిల్స్ ఎలాగూ దొరుకుతాయె!’’ అన్నాడు ప్రసాదు.

సుందరయ్య సంభాషంలో చొరబడుతూ అన్నాడు కదా! ‘‘ఈ నాజూకులు ఇప్పటి కాలం వాళ్లవే! మన తాతలూ తండ్రులూ వాటిని తిని, మనకంటే ఆరోగ్యంగానూ, దృఢంగానూ లేరా! ఏవయినా మోతాదుకు మించకూడదంతే! ‘హితమైనది మితంగా తినా’లన్న సామెత ఉంది కదా! ఊరగాయ నిలవ వుండడానికి ఉప్పు ఎక్కువ వేస్తారనీ, అందువల్ల అది మంచిది కాదనీ, పైగా అంతలేసి కారాలు, అందునా గుంటూరు ఆవకాయ లాంటిది ‘పరమ డేంజర్’ అనీ, భయపడుతుంటారు కొందరు! వాస్తవానికి ‘ఊరగాయ’-జీర్ణశక్తిని పెంచుతుంది. ‘అరగని కూటికి ఆవపిండి’ అని సామెతగానీ, నిజానికి మా మావయ్య జ్వరంవస్తే ఆవకాయ అన్నం పెరుగుతో తిని, దుప్పటి కప్పుకుని పడుకునేవాడు. లేచేసరికి ‘జ్వరం, గిరం హాంఫట్!’’ అయిపోయేవిట! మీకో విషయం తెలుసా! ఇటీవలి పరిశోధనలు కూడా-ఆవకాయ వంటి ఊరగాయలేవయినా-మనిషిలో హుషారునూ, చలాకీనీ, సరదాని పెంచుతాయి తేల్చాయట. పుచ్చా పూర్ణానందంగారు ‘ఆవకాయ-అమరత్వం’అనీ, భానుమతిగారు ‘అత్తగారు ఆవకాయ‘ అనీ, సరదా కథల్రాసి పేరు తెచ్చుకున్నారు. వాళ్లు ఆవకాయ కూడా అతి ప్రీతిగా అన్నంలో తినేవారుట! ‘వేడి వేడి ఆవకాయ అన్నంపై-వెన్న పూస వేసుకు తినాలర్రా!’’ అనేవాడు మా మావయ్య. ఆవకాయ అన్నంలో మామిడిపండు రసం నంచుకుని తినడం ఒక టేస్టు! ’’ అన్నాడు సుందరయ్య
‘‘ ‘పికిల్స్’ పేరుతో ఇప్పుడు విదేశాల్లోనూ మన పచ్చళ్లకు గిరాకీ ఉందర్రా! మన తెలుగువారు అక్కడ చాలామంది- ఇక్కడ దేశంనుంచి తెప్పించుకునే వాటిలో- అగ్రగణ్యమైన ఆహార పదార్ధపు ఎగుమతి ఇదేనట! మన ఆవకాయ రకాల ‘పికిల్స్’ ఇవాళ- పాశ్చాత్యుల కీ మోజు కలిగిస్తున్నాయి! ఏమయినా ఇది మామిడి కాయల కాలం. వసంతానికి, గ్రీష్మానికి మామిడితో విడదీయలేని అనుబంధం మనదగ్గర. ఉత్తర భారతంలో మామిడి ముక్కలు పొడిచేసి ఆమ్‌చ్యూర్‌గాను, మనవాళ్లు ఒరుగులుగాను, తాండ్రగాను-ఏడాది పొడవుతా మామిడిని వాడుతూనే ఉంటారు. జాడీలతో ఆఫీసర్లకు ఆవకాయ సప్లై చేసి మనుమడికి ఉద్యోగం వేయించిన తెలివైన మామ్మగారి కథ కీశే ముళ్లపూడి వారు రాశారు. ఆంధ్రుల ఆవకాయ వైభోగమే వైభోగం! తొక్కుపచ్చడిగా తెలుగు వాళ్లందరికీ ఇష్టమైన అధరువు అది’’ అన్నాడు రాంబాబు.
‘‘ఈ పెళ్లిళ్ల సీజన్‌లో నగరంలో ఇన్ని విందు ‘బఫేల’ భోజనాలు జరుగుతున్నాయే కానీ, ఆవకాయను, మామిడిపండును యదార్ధ రూపంలో రుచి చూపించని-విందూ ఓ విందేనా అనిపిస్తోంది! పల్లెటూళ్లో జరిగే నిండు పెళ్లిళ్లల్లో ‘వడ్డనల విందు’ల్లోనే వాటి దర్శనం! ‘‘ఎండా కాలమనకా, ఆయాస పడక, తమరి కార్యంబంచు తలచి రారయ్య’’ అని శుభలేఖలో ముద్రిస్తే, అందుకే నేటి నగర వాసి- ఊర్లో వివాహాలకు ఎగబడేది’’ అని
నవ్వుతూ లేచాడు ప్రసాదు

(ఫొటోలు: శ్రీ చెన్నూరి రాంబాబు సౌజన్యంతో)

 

3 comments:

Anonymous said...

naakoo oka mukka. please nOru ooripOthOndi guruji. :)

కథా మంజరి said...

భలేగా రాసేరండీ. ఫొటోలో మామిడి కాయ ముక్కలు తరిగే కత్తి పీట ఉంది చూసారూ ? మా స్వగ్రామంలో మాకూ అలాంటి కత్తి పీట ఉండేది.

పెద్ద వాళ్ళు ముక్కలు తరిగేటప్పుడు పిల్లకాయలు జీళ్ళు సంగ్రహించి, వాటితో గోడల మీద దడిగాడు వానసిరా అని రాసి పెద్దల చేత చీవాట్లు తినడం కొత్త ఆవకాయ రుచిలాగ ఎంతో కమ్మనయిన ఙ్ఞాపకం.

CH.K.V.Prasad said...

ఇవి ఆవకాయ గురింఛి తలుచుకునే తరుణాలు!బాగున్నది! ఈ "ఆవురావురు ఆవకాయ" కి రెండు లాలాజలం బొట్లు రాల్చటమే జిహ్వ గలవారు చేయగలిగేది. ఇక విషయానికొస్తే మన చట్టసభలలో కూడా ఈ అవకాయతత్వం ఉంటేనే సామాన్యుడు ధన్యుడు.ప్రజానీకమ్ ధన్యం. మామిడికాయలు,ఆవాలు,మెంతులు,శనగలు, ఉప్పు,కారం,నూనె లాటి సభ్యులు తమ మద్దతుతో ప్రజలకు పనికొచ్చే చట్టాలు తెచ్చి "రుచికరమైన ఆవకాయ" లాటి స్వచమైన పాలన అందించగలిగితే.....అందింతురు గాక!