ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, April 3, 2011

శుభ‘ఖర’ఉగాది

ఇప్పటికీ ఊరిలో- పెంకుటిల్లు స్తంభాల వసారా.
ఇంటి పెరట్లో మామిడిచెట్టు, వేపచెట్టు, అరటి చెట్టు....
పండుగకు వచ్చిన కొత్త అల్లుడు...

‘అక్కా! బావ నన్ను ఏడిపిస్తున్నాడే’’ అని చిట్టితమ్ముడు గారాంపోతే- ‘‘ఉగాదికి వందనాలు అను’’ అని చిలిపిగా సమాధానం ఇచ్చే అక్క.

ఉగాది అన్న మాటను ‘‘ఉ(ట్టిఅడ్డ)గా (డి)ది’’గా ధ్వనింపచేసిందని... ఉడుక్కునే బావగారు!

సర్వాలంకార భూషితమైన కొత్త పెళ్లికూతురు...


కోకిల కూజితాలూ, మల్లెల పరీమళాలూ,
అంతా ఒక నవనవోన్మేషం
!!

కొత్త తెలుగు సంవత్సరం అంటేనే ఒక నూతనోత్సాహం!! కానీ ఈ తెలుగు సంవత్సరాల పేర్లే, ఏటికేడాదిగా చిత్రంగా వస్తూంటాయి కదూ!-



‘‘గాడిద పేర ఒక సంవత్సరం’’ అని గళ్లనుడి కట్టులో ఒక ఆధారం ఇస్తే సమాధానం - ‘ఖర’.

చిత్రమే మరి! తెలుగు సంవత్సరాదుల అరవై పేర్లలో ఒక జంతువు పేరున, అదీ ‘గాడిద’గా వున్నది ఒకే ఒక సంవత్సరం- ‘ఖర’.


అరవై సంవత్సరాల పేర్లలో ఇరవై అయిదవది ‘ఖర’ నామ సంవత్సరం.
అసలు ఈ అరవై పేర్లూ, నారదుడి కుమారుల పేర్లుట! నారదుడు అనకూడదేమో ‘నారది’ అనాలి. ఎందుకంటే బ్రహ్మచారి అయిన నారద మహర్షి ఒకసారి గంగానదిలో స్నానంచేస్తూ, మీన మిథునం చూసి ఉద్వేగానికి లోనయ్యాడట! లోకపు సుఖభోగాలు అనుభవించడానికి, తనూ పెళ్లాడితే బాగుంటుందనుకున్నాడట. కానీ తనకు భార్య దొరికేదెలా?- పదహారువేల నూట ఎనిమిది మంది భార్యలున్న శ్రీకృష్ణపరమాత్ముడినే తనకు వారిలో ఒకరిని భార్యగా ఇమ్మని అడగాలని నిశ్చయించి, స్వతంత్రించి అడిగేశాడట. ‘‘సరే! వారిలో ఎవరింటికయినా వెళ్లు. నాతో లేకుండా ఏ స్ర్తి కనిపిస్తుందో ఆమెను పెళ్లాడుదువుగాని’’ అన్నాడట కొంటె కృష్ణుడు. నారదుడు స్నానంచేసి, సుందరంగా అలంకరించుకుని, శ్రీకృష్ణుని భార్యలు ఒక్కొక్కరింటికీ వెళ్లాడు. ఏ ఇంట్లో చూసినా భర్త కృష్ణుడితో సరస సల్లాపాలతోనో, తమ పిల్లలను భర్తతోపాటు ముచ్చటగా చూసుకుంటూనో, వారంతా కానవచ్చారట! సంసారమంతా ‘కృష్ణమయం’గానే కానరావడంతో, నారదుడు నివ్వెరపోయాడట! మరునాడు గంగాస్నానంచేసి మునకవేసి, బయటకు వచ్చేసరికి, తనను తాను స్ర్తిమూర్తిగా మారిపోవడాన్ని గమనించి, ఆశ్చర్యచకితుడయ్యాడు. బలిష్ఠుడూ, పొడగరీ అయిన ఒక సన్యాసి ఎదురుపడి స్ర్తిగా మారిన నారదుడిని తన ఆశ్రమానికి తీసుకుపోయి, బలిమిని వివాహమాడాడు. ఏటికేడాదిగా సంసారంలో స్ర్తియైన నారదుడు- ‘నారది’గా, అరవై మంది పుత్రులను కన్నాడు. వరుస కాన్పులతో, జీవితమంతా వాళ్ల పెంపకంతో, భర్త సేవలతో, మనసూ, శరీరమూ కూడా అలసిపోయి, ‘‘ఈ బ్రతుకు నాకిక వద్దని’’ శ్రీకృష్ణునే్న ఆర్తిగా ప్రార్థించాడు! అంతే! రెప్ప తెరిచేసరికి గంగానదిలో తాను మరో మునకవేసి లేచాడంతే! ఎదురుగా భర్తకాదు, శంఖచక్ర గదాధరుడైన విష్ణుమూర్తి సాక్షాత్కారం కలిగింది. ‘ఇదంతా విష్ణుమాయ’అని గ్రహించాడు. తిరిగి నారదునిగా యతి స్వరూపుడైనాడు. నారదికి పుట్టిన అరవై మందికీ, విష్ణువు ప్రాపంచిక రాజ్యాన్ని ఇచ్చి, ఒకరి తర్వాత ఒకరుగా వంతులుగా ఏలమని అనుగ్రహించాడు. అరవై సంవత్సరాల కాలం గడిచి, అలా తిరిగి చక్రం పునరావృతం అవుతుంది. అలా పరిభ్రమణ సమయంలో అంతిమ దినమైన కపిలషష్ఠినాడే ‘నారది’ తిరిగి నారదుడయ్యాడు. ఇదీ సంవత్సరాల పుట్టుక గాథ.


ప్రతి సంవత్సరాదినీ మనం ‘యుగాది’ అంటున్నాం. కానీ నిజానికి కృత యుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం అనే ప్రారంభ స్థితినే ‘యుగాది’ అనాలి. పనె్నండు మాసాలు ఒక వత్సరంగా గడిచి, శకంలో కొత్త సంవత్సరం రాగానే, శకాదిని ‘ఉగాది’అనడం మామూలైంది. దానికి కారణం- బ్రహ్మ తన సృష్టిని చైత్ర మాసం తొలి రోజునే ప్రారంభించాడట! శక సంవత్సరం అనేది చైత్రంతో మొదలవుతుంది. చైత్ర మాసం తొలి రోజుని అందుకే ‘యుగాది’ అనడం ఆనవాయితీ అయింది. చాంద్రమానం మొదలిది. బ్రహ్మ రాత్రింబగళ్లనూ, వారాలూ, నెలలూ, ఋతువులూ, సంవత్సరాలూ, కాల గణనానికి రూపొందించగా, వాటికి విష్ణు వరప్రసాదంగా- నారద సంతానం పేర్లు సంవత్సరాలకు వరుస నామధేయాలయ్యాయన్నమాట! వికృతి నామ సంవత్సరంపోయి, ఖరనామ సంవత్సరం ఇప్పుడు ప్రవేశిస్తోంది.
శ్రీ ఖర నామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి సోమవారం మొదలవుతోంది. కలియుగ శకాలు ఈనాటికి 5112 సంవత్సరాలు. శాలివాహన శకం 1933. విక్రమార్క శకం 2071. బుద్ధ నిర్యాణశకం 2555, మహావీర నిర్యాణ శకం 2538, ఫసలీశకం 1420-1421, హిజరీశకం 1431-1433, ఆదిశంకరాచార్య శకం 2056, రామానుజశకం 994, మధ్వాచార్య శకం 894, బ్రహ్మంగారి సజీవ సమాధి శకం 318, గాంధీ శకం 141, హూణ శకం 2011-2012, ఇంగ్లీషు సంవత్సరం 2011, సౌర సంవత్సర ప్రారంభం 1404-1405, స్వాతంత్య్ర శకం ప్రారంభమై 64. ఇదీ ఈ ఉగాది సమాంతర గణనం. శాలివాహన శకం మన జాతీయ శకంగా- గవర్నమెంట్ క్యాలెండర్లలో చూస్తాంగానీ, ఆంగ్ల సంవత్సరం తేదీలనే అనుసరించడం మనకు అలవాటైపోయింది! అందువల్ల ‘ఉగాది’ ఒక పండుగగా అనుకుంటాంగానీ, తెలుగు సంవత్సరాదిగా కాలగణనం తిథి, వార, నక్షత్రాలు, యోగ, కరణాలు అనే పంచాంగాలను అనుసరించడం సకృత్తుగానే సాగుతోంది. అనేకుల్లో, ఇంగ్లీషు తేదీవారాలే గానీ పంచాంగ పరిశీలనం పాతబడింది.



రామాయణ కాలంలో ‘ఉత్తరాయణ’ ప్రారంభమే కొత్త సంవత్సరంగా భావింపబడేది. అందువల్ల చైత్రం అప్పుడు 12వ నెల. 6వ శతాబ్దివాడయిన ‘వరాహమిహిరుడు’ చైత్రశుద్ధ పాడ్యమిని సంవత్సరాదిగా ప్రతిపాదించాడట. రెండు సౌరమానాల మధ్యకాలం 365 రోజులు. చాంద్రమానాల మధ్యకాలం 12 నెలలు. అందుకే అధికమాసం రావడం, ఆ అధికమాసంలో హైందవ ధర్మానుసారంగా- ఎటువంటి పుణ్యకార్యాలూ చేయకపోవడం, వ్రతాలూ, నోములూ నిర్వహించకపోవడం పరిపాటి! భాస్కరాచార్య గణితజ్ఞుడే- చైత్రశుద్ధ పాడ్యమి ప్రభాతంనుండి కాలగణన చేశాడు; ఉగాది నవ వత్సరాదిగా.
‘చైత్రం’ అనగానే ప్రకృతే అందాలు ఆరవోసే పులకితానందకాలం! ప్రకృతిలో సహజ పరీమళాలను పరివ్యాప్తమొనరించే మల్లెపూలూ, రసాలూరు మామిడిపండ్లూ ఈ కాలానివే! హోలీతో రంగు రంగుల ప్రకృతి వర్ణమయ శోభితం కావడం మొదలిడి, చైత్రరథమెక్కి కాలం సోయగాలు పోతుంది! వసంత నవరాత్రులు ఉగాదితోనే మొదలై చివర శ్రీరామనవమిని జరుపుకుంటాయి. ఉగాదికి- సంతోషం, సంపద సమృద్ధిగా వుంటాయి. కొత్తదనానికీ, నూతన కార్యారంభాలకూ శుభసూచకంగా ఉంటుంది. శివపార్వతుల కుమారులైన కార్తికేయుడు, గణేశుడు మామిడిపళ్లంటే తెగ మోజున్నవారట! అందుకే మామిడాకులను గృహ ద్వారాలకు తోరణాలుగా కట్టిన ఇంట, సంపద్వైభవం అలరారుతుందని కార్తికేయుడు ఆదేశించాడట, అనుగ్రహించాడట!


ఉగాది పండుగ పూటా తెల్లవారుజామునే లేచి తైలాభ్యంగన స్నానంచేసి, ఇళ్లముంగిళ్ల గోమూత్రంతో- కల్లాపి చల్లి, గోమయ మలికి, రంగవల్లులు తీర్చి, ఇంటిని అలంకరించుకుని, నూత్న వస్త్రాలు ధరించి, షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ఈశ్వర నివేదనంచేసి ప్రసాదంగా పుచ్చుకుని, ఇంటి యజమాని నవ వత్సర ఫలితాలను వివరిస్తూ పంచాంగపఠనం చేయగా ఆలకించి, పులిహోర, బొబ్బట్లు వంటి వంటకాలతో భోజనంచేసి, సాయంకాలం కవి సమ్మేళనం వంటి వేడుకలతో ప్రొద్దుపుచ్చడం, సకలానంద సంపదే ప్రదమని పెద్దలు అనూచానంగా చెబుతున్నమాట



పేరులో ఏముంది? ఏదయినా ఈశ్వరానుగ్రహంగా తలచి, కాలంలో సుఖ దుఃఖాలకూ, కష్టసుఖాలకూ నిలబడి ప్రవర్తిల్లే తీరులో వుంది. ‘ఖర’లో శ్రీకరం వుంది వాస్తవానికి. శుభకరమూ వుంది. నిజానికి జీవితపు సుఖదుఃఖాలను వేటినయినా భరించగల- భార వాహక శక్తి ‘ఖరా’నిదే! చాకిరేవుకు మన మాలిన్య వస్త్రాలను తరలించి, పరిశుభ్రమొనర్చి, తిరిగి చేర్చే ప్రక్షాళనా ధావళ్యమూర్తి ‘ఖర’యే! నచ్చని వాటిని ఎడం కాలితో తన్నిపారేయగల శక్తీ, కష్టసుఖాల ఉద్యమస్ఫూర్తితో ‘ఓండ్రించే’ తెగువా, గొప్ప సహనం మూర్త్భీవించిన మూర్తి‘ఖర’. వసుదేవుడంతటివాడు కార్యనిర్వహణా విఘ్నహేతువు కారాదని స్వయాన గాడిద కాళ్లు పట్టుకున్నాడు. ‘‘గాడిద గుడ్డు కంకరపీసు’’ అన్నది అసలుకి- ‘‘గాడ్ ది గుడ్ కాంకర్ ది పీస్.’’ -


మన సనాతన ధర్మంలో, చాంద్రమానంలో చైత్రంనుండి ఫాల్గుణంవరకూ గల 12 నెలల కాలంలో క్రమంగా పేర్లతో పిలిచే తెలుగు వత్సరాదులు వస్తూంటాయి. తాను పుట్టిన సంవత్సరాన్ని తన జీవితకాలంలో మళ్లీ తాను చూడగలగడమే ‘షష్టిపూర్తి’. పనె్నండు మాసాలూ, ఆరు ఋతువులూ, ఉత్తరాయణ దక్షిణాయణాలుగా రెండు ఆయణాలూ, అంతా ధర్మసాధనా ఉపాసన కాలమే! ఏదీ భోగంకోసం కాదు. కాలమంతా ఉపాసనా యోగ్యమనే మునులు ప్రవచించారు. ‘‘చైత్రేమాసి జగద్బ్రహ్మ ససర్జప్రథమేహాని శుక్లపక్షే సమగ్రంతు తదా సూర్యోదయేసతి ప్రవర్తయా మాస తథా కాలస్య గణనామపిః గ్రహా న్నగా నృతూన్మాసాన్వత్సరాన్వత్సరాధి వాన్’’ అని చతుర్వర్గ చింతామణి వ్రత ఖండంలో పేర్కొనబడింది. అంటే బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్షం మొదటిరోజు సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టిచేయడంతోబాటు, కాలగమనంలో ప్రకృతి శక్తులను ప్రవర్తింపచేశాడు. బ్రహ్మసృష్టికి ఆరంభ దినం కాబట్టే- ‘యుగాది’యై, అదే నేడు ‘ఉగాది’గా స్థిరమైంది.



ఏం చేసినా చేయకపోయినా- ఉగాది పర్వదినాన ప్రధానంగా చేయవలసిన మూడు విధులున్నాయి. అందులో మొదటిది- ‘తైలాభ్యంగన స్నానం’. నువ్వులనూనె తలకు పెట్టుకుని, పెద్దల ఆశీర్వాదం తీసుకుని, తలంటు స్నానం చేయడంవల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సంప్రాప్తమవుతుంది. సూర్యోదయానికి ముందే లేచి, తలంటి స్నానం చేసేటప్పుడు ఒళ్లంతా కూడా నువ్వుల నూనెతో మర్దించుకోవాలి. కుంకుడుకాయ రసం లేక సున్నిపిండితో చేయాలి స్నానం. నుదుట బొట్టు పెట్టుకుని, కొత్త బట్టలు ధరించాలి. సూర్యునికి పుష్పార్చన, అర్ఘ్యం, ధూప దీపాలను సమర్పించాలి.
అనంతరం ‘ఉగాది పచ్చడి’ని సేవించాలి. ఈ తరం కాఫీగతప్రాణులైపోయి, ముందు కాఫీ త్రాగాకే- ఉగాది పచ్చడి స్వీకరిస్తున్నారు. కానీ ఉగాది పచ్చడిని తీసుకునేందుకు ముందు ఎలాంటి ఆహార పదార్థాలనూ పుచ్చుకోకూడదు. వేపపూత పచ్చడిని సేవించడాన్ని శాస్ర్తియంగా ‘నింబ కుసుమ భక్షణం’ అంటారు. ఈ పచ్చడిలో- లేత వేప పూత, కొత్త బెల్లం, కొత్త చింతపండు పులుసు, మామిడి ముక్కలు, చెరుకు ముక్కలు, మిరియపు పొడి కలుపుతారు. ఉప్పు, మిరపకాయలు వాడటం సబబనీ, మిరియాల పొడి, అరటి పండూ, పండ్ల ముక్కలూ, నెరుూ్య వంటివి కలపడం శాస్ర్తియం కాదనీ కొందరంటారు. ఏమైనా ఉగాది పచ్చడిలోని బెల్లం తీపికీ, చింతపండు పులుపుకూ, మామిడి ముక్కలు వగరుకూ, వేప పూత చేదుకూ, పచ్చిమిరప కారానికీ, ఉప్పు ఉప్పదనానికీ చిహ్నాలు. మనిషి జీవితం ఇలా షడ్రుచుల సమ్మేళనం అనీ, బ్రతుకులో ఎలాంటి రుచినయినా- ఈశ్వర ప్రసాదంగా గ్రహించడం, సంయమన మలవరుచుకుని సాగిపోవడం, అలవరుచుకోవాలనే జీవనసందేశ సార ప్రతీకయే ‘ఉగాది పచ్చడి.’ వాత, పిత్త, కఫ, రోగాలను దునుమాడి, ‘ఉగాది పచ్చడి’ మనిషి ఆయురారోగ్యవంతుడయ్యేందుకు దోహదపడుతుంది! వేప పువ్వు పచ్చడిని ఈశ్వర నైవేద్యం పెట్టి, కుటుంబ పెద్ద సభ్యులందరకూ పంచగా- ‘‘శతాయుర్వజ్రదేహాయ సర్వ సంపత్ప్రదం తథా సర్వారిష్ట వినాశాయ నింబ ప్రతషన్నం శుభం’’ అనే శ్లోకాన్ని పఠిస్తూ- ఉగాది పచ్చడిని సేవించాలి. వేపపువ్వుతోపాటు అశోక సలవాన్ని కూడా ఉగాది పచ్చడిలో మేళవిస్తే, శోకము నివారింపబడి సర్వసంపదలూ, ఆనందాలూ, సుఖశాంతులూ కలుగుతాయని శాస్తవ్రచనం! సీతామహాసాధ్వికి రావణ సంహారానంతరం శ్రీరామకరగ్రహణం అశోక వృక్షఛాయలో లభించిందని ఒక ప్రవచనం!


ఇక ఉగాదిరోజు మూడవ ముఖ్యమైన అంశంగా ఆచరణాత్మకమైనది- ‘పంచాంగ శ్రవణం.’ ఉగాదిరోజు దేవాలయంలో గానీ, గ్రామ చావడిలో గానీ, కూడలిలో గానీ, ఇంట్లో అయితే యజమానే స్వయంగా కానీ, పంచాంగ శ్రవణాన్ని చేయడం ఆచారం. ‘పంచాంగం’ అంటే ఐదు అంగాలని అర్థం. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనేవి ఆ అయిదు అంగాలూ! ఈ అయిదింటితో కూడిన పంచాంగాన్ని- ఉగాదిరోజున వివిధ దేవతలతోపాటు పూజించి, పంచాంగ శ్రవణం చేయాలి. పంచాంగ శ్రవణం చేసేటప్పుడు ఉత్తరాభిముఖంగా కూర్చుని వింటే మంచిదని పండితులు చెప్పేమాట! పంచాంగ శ్రవణం చేసిన వారికీ, విన్నవారికీ కూడా సూర్యుడు శౌర్యాన్ని, తేజస్సునీ, చంద్రుడు వైభవాన్నీ, కుజుడు సర్వమంగళాలనూ, బుధుడు బుద్ధివికాసాన్నీ, గురుడు గురుకృపనూ, జ్ఞానాన్నీ, శుక్రుడు సుఖాన్నీ, శని దుఃఖరాహిత్యాన్నీ, రాహువువల్ల ప్రాబల్యం, కేతువు ప్రాధాన్యతా లభింపచేస్తారు. పంచాంగ శ్రవణంలో- ముఖ్యంగా సంవత్సర ఫలితాలు తెలుసుకోవడం జరుగుతుంది. వివిధ రాశుల వారి ఆదాయ వ్యయాలూ, రాజపూజ్యం, అవమానస్థాయిలూ, కందాయ ఫలాలు, సంవత్సర ఫలాలు తెలుసుకోవడం జరుగుతుంది. పంచాంగ శ్రవణంలో నవనాయకులు, 21 మంది ఉపనాయకులు స్మరింపబడతారు. ప్రతివారూ ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేయడంవల్ల ప్రధానంగా అయిదు ఫలాలు సిద్ధిస్తాయట- ‘‘తిథేశ్చ శ్రీయమాప్నోతి వారాదాయుష్యవర్థనమ్ నక్షత్రాత్థరతే పాపం యోగాద్రోగ నివారణమ్ కరణాత్కార్య సిద్ధిస్తు పంచాంగ ఫలముత్తమమ్ కాలవిపత్కర్మకృద్ధీమాన్ దేవతానుగ్రహం లభేత్.’’ తిథి సంపదనూ, వారం ఆయుష్షు పెంపునూ, నక్షత్రం పాప నివారణనూ, యోగం వ్యాధి నివారణనూ, కరణం కార్యసిద్ధినీ కలిగిస్తుందని దీని అర్థం! అంతేకాదు. కాలాన్ని అవలోకనం చేసుకుని, కర్మానుష్టానం కావించేవాడు- భగవదనుగ్రహ ప్రాప్తినొందుతాడని పరమార్థం. పంచాంగ శ్రవణంవల్ల- గంగా స్నానంచేసిన పవిత్ర ప్రయోజనం నెరవేరుతుందట- ‘‘తిథిర్వారంచ నక్షత్రం యోగఃకరణమేవవ పంచాగస్య ఫలం శృణ్వన్ గంగాస్నాన ఫలం లభేత్’’ అని చెప్పబడింది. కొత్త బట్టలు ధరించి, కొత్త అల్లుళ్లతో, కోడళ్లతో, పిల్లలతో, సంతోష సందోహాలు మిళితం కాగా జరుపుకునే వత్సరాది పర్వం ‘ఉగాది.’ ఉగాది పండుగనాడు ఎలా వుంటే- మిగతా సంవత్సరం అంతా అలాగే జీవితం వుంటుందని ఒక నమ్మకం! ఉగాది పచ్చడిలో ఏ రుచి ముందు నాలుకకు తగులుతుందో, అది ఆ ఏడు ప్రధానంగా బ్రతుకు రుచిగా వుంటుందని భావన. తీపి మాత్రమే తగలాలని ఎక్కువగా పచ్చడిలో బెల్లమూ, అరటిపండూ దట్టించడమూ సరికాదు సుమా! షడ్రుచుల సరిసమ్మేళనంగా, స్వతస్సిద్ధంగా, ‘ఉగాది పచ్చడి’ తయారవ్వాలి! దానినే సేవించాలి.



ఉగాది పండుగను బంజారాలు- ‘ఆటమేర్ ఓరి’ అనే ఉత్సవంగా చేస్తారు. మాంసాహారం, సలోయి భక్షణం వారి ఆచారం. ‘సలోయి’తో పాత సంవత్సరాన్ని పూజించి, ఆ ప్రసాదాన్ని అందరికీ పంచి, వారివారి భాగాలను ఇళ్లకు తీసుకువెళ్లి, వంటలు చేసుకుని తింటారు. ఉగాదినాడు ఇళ్లను శుభ్రపరుచుకుని వెల్లవేసుకోవడం, ఇంటిని కుండలను గోమూత్రంతో శుద్ధిచేయడం, ముంగిటిని ఆవుపేడతో అలికి ముగ్గులు పెట్టి, ద్వారబంధాలకూ, తలుపులకూ పసుపు, కుంకుమల బొట్లు పెట్టడం, వాకిలికి మామిడి, వేపాకుల తోరణాలు అమర్చడం చేస్తారు.



పొయ్యిని అలికి, ముగ్గులు తీర్చి, పసుపుకుంకుమల బొట్లు తీర్చడమూ వుంది. కొబ్బరికాయలు, తంబూలం, అగరవత్తులు, నెయ్యి రెండురకాలు పాయసం, చెంబెడు నీళ్లు అమర్చుకుని- నిప్పులు కుప్పలుగాపోసి, సంవత్సరాది పాయసంతో నెయ్యిని కలిపి, చేతితో తీసుకుని నిప్పులపై వుంచి పైనుండి నెయ్యివేయడం ఒక తెగ ఆచారం! బియ్యప్పిండి పాయసం, నెరుూ్య కలిపి, నిప్పులపై వుంచి వేస్తూ, తాతముత్తాతలూ, ఇతర పెద్దల పేర్లు చెబుతూ, నిప్పులపై పాయసం వేస్తూ పూజిస్తారు. కొబ్బరికాయ కొట్టి, పూజకు కుడిప్రక్క మూడుసార్లూ, ఎడమకు రెండుసార్లూ నీరుపోసి, హారతి వెలిగించి నిలబడి పూజించే ఆచారాన్ని ఆ తెగలో చూడగలం. చాలామందికి ఉగాదినాడు కొత్త పనులు ప్రారంభించడం శుభదాయకమని విశ్వాసం. పండుగ విందు సేవించిన వ్యవసాయదారులు, నూత్న వస్త్రాలతో పొలాలకు వెళ్లి, ఒక్క చాలైనా దున్ని రావడం చేస్తారు. అది భావిజీవన శుభసూచికగా భావనం!



అసలు ఉగాది తెలుగువత్సరాది కనుక, తెలుగువారంతా తమ పుట్టినరోజుని, పుట్టిన తిథినాడే జరుపుకోవడం అభిలషణీయం. అప్పుడే చిరాయుష్షు, మంగళం!!



ఉగాదిని నూతన సంవత్సరాదిగా- కర్ణాటక, మహరాష్ట్ర, కేరళ, తమిళనాడు, పంజాబుల్లో కూడా ఈనెలలోనే పాటిస్తూంటారు. కృతయుగమే సత్యయుగమనీ- అది బ్రహ్మకు ‘పగలనీ’, కలియుగం బ్రహ్మకు ‘రాత్రి’ అనీ, ఒక భావన! ఉగాది త్రిమూర్త్యాత్మక జ్ఞాన ప్రతీక. అలాగే పురాణ, ఖగోళ, సామాజిక అంశాల సమాహారం. చిత్తానక్షత్రంతో కూడిన పౌర్ణమిగల మాసం చైత్రమాసం. వసంత కాలాగమన సందర్భం! చైతన్యం పుట్టుకొచ్చే శుభకార్యాలకు ఆరంభం!



ఈ ‘ఖర’నామ సంవత్సరం అరవై ఏళ్ల క్రితం 1951లో వచ్చింది. అప్పుడు పుట్టిన నాబోటి వారందరికీ ఇది 2011లో షష్టిపూర్తి శుభవత్సరం. మళ్లీ అరవై ఏళ్ల తరువాత 2071లో ‘ఖర’వస్తుంది. తాను పుట్టిన సంవత్సరాన్ని తన జీవితంలో మరలా ఒక్కసారి చూడగలిగే భాగ్యం లభించడమే గొప్ప! ఎవరు బ్రతికారు నూట ఇరవై ఏళ్లు? మళ్లీ వచ్చే ‘ఖర’ను నేను కచ్చితంగా చూడలేను!



ఖర నామ సంవత్సరం 1891-92లో వచ్చిన సందర్భంగా శ్రావణశుద్ధ విదియనాడే అన్నవరంలోని శ్రీ సత్యనారాయణస్వామి దేవాలయం ప్రతిష్ఠాపన జరిగింది. (ఆశ్వయుజ శుద్ధపాడ్యమినాడు అని కోరాడ రామకృష్ణయ్యగారు పేర్కొన్నారు.) అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయం రధాకృతిలో నిర్మాణమైంది. అన్నవరంను అప్పట్లో ‘రత్నగిరి కొండ’ అనేవారు. రాజా ఐ.వి.రామనారాయణం జమీందారుగారు - కిర్లంపూడి సంస్థానాధినేతగా, 1891 ఖర నామవత్సర శ్రావణ శుద్ధ విదియనాడు కొండపై, స్వామిని నెలకొల్పి పూజాదికాలనారంభించారట! ఓ పదంగా ‘ఖర’ప్రస్తావన కృష్ణయజుర్వేద తైతరీయ సంహిత నాల్గవ అనువాకంలో వుంది. వాయువు సోమరసం త్రాగేవారు పాత్రగా ‘ఖర’ అక్కడ వుంది.‘‘ఇంద్రవాయువులారా! సోమమా! నిన్ను మాకొరకు పృధ్వీరూపదారు పాత్రయందు గ్రహించుచున్నాము. పాత్రా! ఖరమ నీకు స్థానమగుచున్నది. ఇంద్రవాయువు సమాన ప్రీతిగలవారు. వారికొరకు నిన్ను ‘ఖర’ స్థానమున ఉంచుచున్నాము’’అని ఖర ప్రస్తావన వుంది అక్కడ. అరణ్యకాండ ఇరవై ఎనిమిదవ సర్గలో రామాయణంలో ఖర దూషణాదుల ప్రస్తావన వస్తుంది. అక్కడ రాక్షసుడు ‘ఖరుడు’ ‘‘నిహతం దూషణం దృష్ట్యా ర జే త్రి శిరసా సహ ఖరస్య అపి అభవేత్ త్రాసో దృష్ట్యా రామస్య విక్రమం.’’ అని పేర్కొనబడింది. ఇక కామకోటి పీఠం ఆచార్య పరంపరలో శ్రీ శంకర భగవత్పాదుల పరంపరలోనే పదమూడవ పీఠాధిపతి ఖర మార్గ శీర్షం శుక్లపక్షం- అంటే క్రీస్తు వెనుక 272లో గురుపీఠమెక్కిన ‘సచ్చిద్ఘన’కాగా, ఖర వైశాఖ శుద్ధ ప.7 క్రీస్తు వెనుక 512లో ఇరవై మూడవ ఆచార్యునిగా శ్రీ ‘సచ్చిత్సుఖ’కంచి పీఠాధిపతి అయ్యారు. వందే ఆచార్య గురు పరంపరా!... ఏమైనా తప్పక ‘ఖర’ సమాదరణీయ నామ సంవత్సరమే! మురికిని మోసినా, చాకిరేవులో ప్రణాళనం చేయడానికీ, బరువు బాధ్యతలను నిర్వర్తించడానికీ, నిరసించదగినవాటిని ఎడమ కాలితో వెనక్కి తన్ని వేయడానికీ, ఓర్పుకీ, సహనానికీ, భారవాహికకూ ప్రతీకగా రాణించడానికీ ‘ఖర’ నిలుస్తుంది, గెలుస్తుంది. ఖర శ్రీకరమై శుభకరమై అలరారుతుందని ఆకాంక్షిద్దాం.


దాశరథి అన్నట్లు కవితాత్మక శుభకాంక్షలు చెప్పుకుందాం-
‘‘ముసలి మొగము పడిన వసుధకు వన మెసగ వచ్చినట్టి ఉగాది! మ్రోడులందు జీవములు పోయు వాసంత లీలకెల్ల నీవెలే పునాది!
‘‘
పాతదనమును పోద్రోలి లేతదనము నామతించిన నీ హృదయాంగణనమున ఎన్ని మల్లెల మూటలో, ఎన్ని తీయ మామిడుల తోటలో చెప్పలేము మేము.’’


‘‘ఇది చైత్ర నవోదయము- ఇది రాగ సుధామయము మదనాంతకుడోడెనులే, మదనునికే ఇక జయము.’’ *

0 comments: