ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, March 25, 2017

హాస్యానికి శంకర భాష్యం
హాస్యావధానాలపేరిట సభల్లో ఆడవారిమీద కొన్ని పిచ్చి జోకులు వేస్తారనే అపప్రధ కొంత ఉన్నమాట నిజమే గానీ శంకరనారాయణ డొక్కశుద్ధి ఉన్నవాడు. భాషమీద మంచి పట్టు ఉంది కనుకనే ‘పన్’డితుడుగా రాణించడమే కాదు హాస్యబ్రహ్మ బిరుదాంకితుడయ్యాడు. శంకరుడు నారాయణుడు ఎలాగూ పేరులోనే వున్నారు కనుక బిరుదులో అభిమానులు బ్రహ్మను చేర్చారు. అందుకే బ్రహ్మాండమైన భాషా సాహిత్య విమర్శలు హాస్యస్ఫోరకంగా వెలయించగల దిట్ట అయ్యాడు.

ప్రముఖ పాత్రికేయుడుగా మూడు దశాబ్దాలకు పైబడి వివిధ పత్రికల్లో వివిధ సంపాదక హోదాల్లో వృత్త్ధిర్మం నెరపిన శంకరనారాయణ దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చి రాణిస్తున్నారు. ఇంతవరకు ఫన్‌గన్, ఫన్‌దేహాలు, పన్‌పరాగ్, శంకరనారాయణ అప్రస్తుత ప్రసంగాలు, ఆగ్నిసంగీతం, నవ్వేనజరానా, మీ నవ్వు మీ ఇష్టం, కనక దుర్గ శతకం, తీగలాగిన భార్య వంటి గ్రంథాలు వెలయించిన శంకరనారాయణ సరికొత్త పుస్తకాలు ‘ఇంగ్లీషుకు తల్లి తెలుగు’, ‘శంకరాలు’.రెండు కూడా హాస్య వశంకరాలే!

తెలుగే నాకు వెలుగు అనే ఈ శంక‘రాలుగాయి’ ముప్పై రెండు హాస్యభరిత వ్యాసాలను ‘ఇంగ్లీషుకు తల్లి తెలుగు’ అనే గ్రంథంలో సంతరించారు. ఇంగ్లీషు పదాలు అనేకం తెలుగునుంచే పుట్టాయనే ఈయన ప్రతిపాదనలు భాషా శాస్త్ర రీత్యా సమర్ధనీయాలు కాకపోయినా శ్రవణానందదాయకంగా నవ్వులు పూయిస్తూ నిజం అనిపిస్తాయి. బాయ్ మన అబ్బాయ్‌నుండి, మనిషి అని మనం అంటే మాన్,షి అని విడదీసి ఇంగ్లీషువాడు పబ్బం గడుపుకుంటున్నాడుట! చాటడంనుంచి' Chat’, మన తాడునుంచి ‘త్రెడ్’, కాసులోంచి ‘క్యాష్’, వీలునుంచి ‘త్దీళళ’, మన ‘బడుద్దాయి’నుంచి ‘బాడ్’, మనం శరీరానికి వాడే ‘బోడి’ నుంచి ‘బాడీ’ తీసుకున్నాట్ట! ఇలా తమాషాగా అనేక సారూప్య, సాదృశ్య పదాలను చూపుతూ శంకరనారాయణ నిజంగానే ఇంగ్లీషుకు తల్లి తెలుగు అన్నంతగా పద సంపద చూపారు.

‘ఏ భాష లోతుపాతులు తెలియాలన్నా అర్థం చేసుకుంటే సరిపోతుంది. కానీ, తెలుగు అలా కాదు. అపార్థం చేసుకుంటే తప్ప అర్ధం కాదు’ అంటూ రాసిన ‘అపార్థ నిఘంటువు’ వ్యాసం, ‘పలికినట్టే రాస్తాం...రాసినట్టే పలుకుతాం’ అన్నది నిజం కాదని నిరూపించే పదాలతో ‘తెలుగు తిరకాసులు’ వ్యాసం, తిండి ‘తిప్పలు’, కౌ‘గిలి’ గింతలు, వ్యాసాలు అలాగే తన అనుభవాలు- జ్ఞాపకాల భిత్తికమీంచి ‘తెలుగు వాడిగా పుట్టను గాక పుట్టను’ వంటి వ్యాసాలు పాఠకులను ఎంతో అలరిస్తాయి. అలాగే ‘పన్’చాంగం సృష్టికర్త ఫిడేల్‌రాగాల డజన్ కావ్య విశే్లషణా వ్యాసం ఆనందింపచేస్తుంది. భాషపై ఎంతో సాధికారత ఉంటే తప్ప పదాలతో ఇలా శే్లష విశే్లషణలు సాధ్యం కావు. ఆరుద్ర సరదాలను కూడా అందించారు. ‘దుర్ముఖి’ సంవత్సరాన్ని ‘నా మొహం’ నామ సంవత్సరం అంటూ తనమీద తనే జోక్ వేసుకునే సత్తా తనదే! 

ఇక పాకెట్ సైజ్ పుస్తకం ‘శంకరాలు’ ఒకరకంగా చమత్కార గుళికలు, హాస్యమయ నిర్వచనాల సంపుటి. ఈ ‘పంచ్’లన్నీ ఫేస్‌బుక్‌లోను, తెలుగు వెలుగులోనూ పంచి నవ్వించినవి.

సత్యహరిశ్చంద్రుడు వాడింది ‘ట్రూత్‌పేస్ట్’
డబ్బున్నవాడికి ‘గోల్డు’ గిల్లుకోవడమే పని
యాత్రికులకు టూ ‘రిస్టువాచి’ అవసరం
అమ్మవారు అఖి‘ల్యాండ్’ ఈశ్వరి
కొట్టు చప్పుడు కాకుండా చేసేది ఆన్‌లైన్ వ్యాపారం
వంట గదిలో అంతా ‘ఆడ’మినిస్ట్రేషన్
పెన్‌డ్రైవ్ తేలిక-ఫన్ డ్రైవ్  కష్టం

ఇలా తెలుగు ఇంగ్లీషుల కలబోతతో చెడు‘గుడ్’లు ఆడుకోవడం ‘శంకరాలు’ మీ కరాలులో ఉంటే బోలెడు నవ్వులాటే!

నా వెంట పడుతున్నావు
‘అనుభవిస్తావు’ అన్నదో అమ్మాయి కోపంగా
థాంక్యూ మేడమ్
అదే నాకు కూడా కావల్సింది అన్నాడు తాపంగా
ఏం తెలుగో ఏమో
అంటూ ‘శంకరాలు’ పుస్తకంలో ముగింపు చెళుకు!

 ‘ఏం తెగులో ఏమో’ అనుకోకుండా ‘ఏం తెలుగో ఏమో’ అంటూ ‘తెలుగు మాట్లాడే దీపాలు తెల్లవార్లూ వెలుగుతుంటాయి’ అని ఆరుద్ర అన్నట్టు ఆరోగ్యకరమైన హాస్యంతో తెలుగు వెలుగు లీనడానికి హాస్యబ్రహ్మ శంకరనారాయణ ‘త్రిపీట’కాలు వేసి పాఠకులను ఇలానే కూర్చోబెడుతూంటాడని శుభాశంసనలు.

-సుధామ

ఇంగ్లీషుకు తల్లి తెలుగు 
( హాస్యవ్యాసాలు)
వెల:రు.144/-
శంకరాలు వెల: రు.36/-
శంకరనారాయణ
హాస్య గ్రంథాలు
ఎస్.ఆర్.బుక్‌లింక్స్, దానయ స్ట్రీట్, 
మాచవరం, విజయవాడ-4 ప్రచురణలు

-

0 comments: