ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, November 22, 2013

ఏ.టీ.ఎం.

  • 22/11/2013
  • :





‘‘ఈ ‘ఏ.టి.ఎమ్’లు వచ్చాక సుఖంగా వుందనుకో! డబ్బులు కావాలంటే బ్యాంక్‌కు వెళ్ళి, 
విత్‌డ్రాయల్ ఫారమ్ నింపి, గంటలకొలది క్యూలో నిల్చోవడం, డబ్బులు- కౌంటర్‌లో వ్యక్తి
 ఏమైనా తక్కువ ఇచ్చాడేమోనని ఒకటికి పదిసార్లు లెక్కపెట్టుకోవడం, 
బ్యాంక్ మూసేలోపల వెళ్లకపోతే డబ్బు విత్‌డ్రా చేసుకోవడం కుదరదని కంగారుపడటం, 
ఈ బాధలన్నీ తప్పాయి. అర్ధరాత్రయినా, అపరాత్రయినా, ఏ వేళకు డబ్బు అవసరమైనా,
 అప్పటికప్పుడు వెళ్ళి ‘ఏ.టీ.ఎం’ నుంచి- మన బ్యాంక్ అక్కౌంట్‌లోంచి, 
కావలసిన డబ్బు తీసుకోవచ్చు. అప్పుకావాలన్నా ‘క్రిడిట్‌కార్డు’లూ వున్నా యి.
 ఆర్థిక లావాదేవీలకు ఆసరాగా అవుతున్న ‘ఏ.టీ.ఎం’ వ్యవస్థను 
నిజంగా అభినందించాలి’’ అన్నాడు శంకరం.

‘‘ఆటోమేటెడ్ టెల్లర్‌మెషీన్ అనే ‘ఏ.టి.ఎం.’‘ఆల్‌టైమ్ మనీ’గా గుర్తింపు పొంది,
 బ్యాంకు సిబ్బంది పనిని సులభతరం చేశాయిలే! కానీ చూసావ్! 
దాంట్లో వుండే ఇబ్బందులు దాంట్లోనూ వున్నాయ్. 
సమయానికి మనం వెళ్ళిన ఏ.టి.ఎం. పనిచేసి చావదు. 
‘అవుట్ ఆఫ్ ఆర్డర్’అని వుంటుంది. లేదూ! అందులో క్యాష్ అయిపోయి వుంటుంది.
 మన అక్కౌంట్ ఏ బ్యాంక్‌లో వున్నా, మనం ఏ ఇతర బ్యాంక్ ఏ.టీ.ఎం.నుంచయినా 
డబ్బు డ్రాచేసుకునే సౌకర్యం వుంది. కాదనను. కానీ- ‘ఏ.టీ.ఎం’లు వచ్చాక 
చిల్లర దొరకడం సమస్యగా మారింది. అయిదువందల నోట్లు, 
వంద నోట్లు తప్ప యాభైల నోట్లుకూడా రావాయె! 
పొద్దునే్న న్యూస్‌పేపర్ కొనడానికి ‘ఏ.టీ.ఎం.’నుంచి డబ్బు డ్రాచేస్తే, 
అయిదువందల నోటు వస్తుంది. మూడు రూపాయలో, అయిదు రూపాయలో వుండే
 పేపర్ కొనడానికి అయిదు వందల నోటు ఇస్తే- పేపర్ అమ్మేవాడు 
మన మొహం ఎగాదిగా చూసి, ‘చిల్లర లేదు పొ’మ్మంటాడు. 
బ్యాంక్‌లో విత్‌డ్రా చేసుకునేప్పుడయితే- కౌంటర్లో పదులూ, 
ఇరవైలూ కూడా అడిగి తీసుకోగలిగేవాళ్ళం. 
ఇప్పుడు చిల్లర మార్చడం ఓ పెద్ద పని! కూరల వాడికి, 
పాల వాడికి, పనిమనిషికి, దోభీకి డబ్బులివ్వాలంటే; 
పోస్ట్ఫాస్‌లో కార్డుముక్క కొనాలంటే- అఫ్‌కోర్స్! ఇప్పుడది బాగా తగ్గే పోయిందనుకోండి!
 కానీ చిల్లరకు మాత్రం కటకటే! ‘ఏ.టీ.ఎం’లు అందుకు దోహదం చేయవు. 
అంచేత అందులో అసౌకర్యం కూడా వుంది మరి’’ అన్నాడు ప్రసాదు.


‘‘ అమ్మమ్మా! అలా అనకు.‘ఏ.టీ.ఎం’ తప్పకుండా ‘ఎయిర్ కండిషన్డ్’గా వుంటుంది.
 ఎండాకాలం మిట్టమధ్యాహ్నం ‘ఏ.టీ.ఎం’కి వెడితే డబ్బులు డ్రాచేసుకోవడం మాటేముంది గానీ, 
కాసేపు హాయిగా సేద దీరచ్చు మాంఛి ‘కూల్’గా వుంటుంది. కానీ ఒకటుందోయ్! 
కొన్ని ‘ఏ.టి.ఎం’లలో మన ‘కార్డు’మిషన్ లోపలికి పోతుంది. ట్రాన్సాక్షన్
 అంతా ముగిసాక గానీ- అది మళ్ళీ బయటకు రాదు. 
మా మామయ్యకి అలాంటి ‘ఏ.టీ.ఎం’లు గిట్టవు. 
కార్డు బయటకు రాదేమోనని ఆయన భయం! 
బటన్లు నొక్కడంలో ఎక్కడ పొరపాటు జరుగుతుందోననీ, 
ఆ కార్డు అందులోనే వుండిపోతే మళ్ళీ పొందడానికి నానా తంటాలు పడాలనీ
 ఆయన భయం. అదే-కార్డు ‘ఇన్‌సర్ట్’చేసి, వెంటనే తీసేసి 
ట్రాన్సాక్షన్లు చేసుకునే ‘ఏ.టీ.ఎం’లకే ఆయన వెడుతుంటాడు. 
‘ఏ.టీ.ఎం’లకు వాచ్‌మెన్‌లు కూడా వుంటారు. వాళ్ళు తెలియనివారికి
 కొంత సహాయకారులుగానూ వుంటారు. కానీ ‘ఏ.టీ.ఎం’లలో కూడా 
దోపిడీలు జరుగుతున్నాయంటే- ‘నేర వైదుష్యం’కూడా 
ఎంతగా పెరిగిపోయిందో కదా అనిపిస్తుంది’’ అన్నాడు సన్యాసి.

‘‘ ‘ఏ.టీ.ఎం’లలో కూడా డబ్బులకే కాదు, ప్రాణాలకూ రక్షణ కరువవుతోంది. 
మొన్నటికి మొన్న బెంగుళూర్‌లో ‘ఏ.టీ.ఎం’లో డబ్బులు డ్రాచేసుకోవడానికి వెళ్ళిన 
ఒక స్ర్తిమీద లోనికి చొరబడి, షట్టర్ మూసి, ఓ అగంతకుడు ‘దాడి’కి పాల్పడ్డాడు.
 ‘ఏ.టీ.ఎం’ అంటే ‘ఎనీ టైమ్ మనీ’అని కాక, ‘ఎనీ టైమ్ మర్డర్’ అనిపిస్తోంది మరి!
 చక్కగా ఏ.సీ. సౌకర్యం కూడా వుందేమో- ఏ అర్ధరాత్రో నేరస్తుడు 
నేరకపోయి ఏ యువతి అయినా అవసరార్థం డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి వెడితే,
 సుఖంగా ‘ఎనీటైం మానభంగం’కూడా చేసే వీలుంది. 
వాచ్‌మెన్ వుంటాడంటారు గానీ- సగానికి సగం ‘ఏ.టీ.ఎం’లు, 
కాపలాదారు లేకుండానే కనబడుతుంటాయి. నేరాలకు ఆస్కారం ఇచ్చేవిగా
 ‘ఏ.టీ.ఎం’లు పరిణమిస్తూండడం విషాదమే! ‘ఏ.టీ.ఎం’లలో సి.సి. కెమెరాలు వుండడంవల్ల 
మొన్న బెంగుళూర్‌లో జరిగిన నేరం వంటివాటిల్లో నేరస్తుడిని గుర్తించి 
పట్టుకోవడం వీలవుతుందన్నది వాస్తవమే! కానీ నేరబుద్ధులు ఎలా తయారయ్యాంటే-
 ఏ. ‘ఏ.టీ.ఎం’లో నయినా మానభంగం జరిగితే అది సి.సి. కెమెరాలో రికార్డయితే, 
దాన్ని ‘బూతు ఫిలిం’గా చేసి అమ్ముకునే దౌర్భాగ్య వ్యవస్థలోకి 
దిగజారుతున్నాం అనిపిస్తోంది. సాంకేతిక ప్రగతి ఎన్ని సౌకర్యాలను 
ముందుకు తెస్తున్నా, ఆ ప్రగతిని వక్రీకరించి- 
మంచికి కాక, చెడుకు ఉపయోగించుకునే ‘అమానవీయ నైజం’ పెరుగుతోంది.
 అదీ ఖండించవలసిన, నిరోధించవలసిన సంగతి! 
‘ఏ.టీ.ఎం’ అంటే ‘అంతా తీరయిన మంచి’, ‘అంతా తీరైన మనుషులు’-కాగలిగినప్పుడే
 సువ్యవస్థ సాధ్యమవుతుంది.’’ అంటూ రాంబాబు సంభాషణకు ముక్తాయింపునిచ్చాడు.