ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, September 13, 2013

(ఆ)గాలి కబుర్లు



‘‘ఫలానా హీరోయిన్ ఫలానా క్రీడాకారుడితో తిరుగుతోంది, ఫలానా ఆఫీసులో ఫలానావాడు లక్షల ఆస్తులు కూడబెట్టాడు, ఫలానా అతగాడికి ఫలానా ఆమెతో వివాహేతర సంబంధం వుంది.. బాపతు ‘గాసిప్స్’ కొందరికి భలే ఇష్టం. వాళ్ళమీదా వీళ్ళమీదా చెవులు కొరుక్కోవడం గాలివార్తలు పోగేసి నలుగురికీ సరఫరాచేయడంలో గొప్ప ఆనందం పొందుతూ వుంటారు వాళ్ళు. నిజానిజాల సంగతి ఎలా వున్నా ఇలాంటి వార్తలకు మాత్రం భలే రెక్కలు వస్తూంటాయి. అసలు కొందరిది ఇలాంటి వార్తలను సృష్టించే నైజం కూడా అయి వుంటూంటుంది’’ అన్నాడు ప్రసాదు.


‘‘మంది విషయాల్లో కొందరికి ఎడతెగని ఉత్సుకత వుంటూంటుందిలే. ఇంటి సంగతులు పట్టకున్నా ఇరుగిల్లు పొరుగిల్లు వ్యవహారాల పట్ల కొందరికి తెగ ఆసక్తి. కొందరు అవతలి వారినుంచి విషయాలు రాబట్టడంలో గొప్ప చలాకీగా వుంటారు. తమ సంగతులు మాత్రం చెప్పరు. పొక్కకుండా చూసుకుంటూంటారు. అదో తరహా! అందరి నైజాలూ ఒక్కలా వుండవు కదా! కానీ మానవ నైజంలోని ఈ విచిత్ర కోణాలు సమాజంలోని పలువురిలో కనిపిస్తూనే వుంటాయి. కానీ చూసావ్! ఇలాంటి ‘గాసిప్స్’ ఎక్కువగా ‘సెలబ్రిటీ’లకు సంబంధించి, మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెంది అధికంగా వినవస్తూంటాయి. సెలబ్రిటీల రహస్యపు కబుర్లు వినవేడుక చాలా మందికి. అందుకోసం ఆ తరహా పత్రికలూ వున్నాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. మునుపు తెలుగులో ‘కాగడా’, ‘కినిమా’ వంటి పత్రికలు ఈ తరహా కబుర్లు తెగ అచ్చు వేస్తూండేవి. ‘కాగడాశర్మ’ ఆ తరహా సంపాదకుడిగా, కామెంట్స్ చేసే వాడిగా ఆ రోజుల్లో ప్రసిద్ధం కూడాను’’ అన్నాడు శంకరం.


‘‘ఎల్లో జర్నలిజం అనే మాట మీరు వినలేదూ! అందులో ఓ భాగమే ఇదీను. అవినీతి వృత్తాంతాలు, అసభ్య కథనాలు, నీలి వార్తలు చెలామణీ చెయ్యడమే కొందరి దృష్టి. నీతి పేరిట బూతుల బుంగలను విస్తరించడంలోనే వారి సృష్టి.. సహజంగానే బలహీనతలు ఆకర్షించినంతగా సంచలనాలు ఆకట్టుకున్నంతగా మంచి పనులు, ఋజువర్తనలు ఆనవు. అందుకే ఇవాళ పత్రికలలో, ఛానల్స్‌లో ఇలాంటి కథనాలు ఏదో రూపంలో వస్తూనే వుంటాయి. క్రైం స్టోరీలు, నేరాలు- ఘోరాలు ఆసక్తిగా ‘వాచ్’చేసే వారున్నారు. ఛానెల్స్‌లో కూడా నెగిటివ్ క్యారెక్టర్లున్న సీరియల్స్‌కు వున్న వీక్షకులు ఎక్కువట!. సమాజంలో ఈ వైఖరులు అంతకంతకు పెరిగి పోతున్నాయి కూడాను’’ అన్నాడు సన్యాసి సంభాషణలో కల్పించుకుంటూ.


‘‘తమాషా ఏమిటంటే ఇప్పుడు రాజకీయాల్లోనూ ఈ గాలి వార్తలు, పుకార్లు బానే చొరబడిపోతున్నాయి. ఎవడికి తోచిన వ్యాఖ్యానాలు వాళ్ళు వార్తలకు జంటించేస్తున్నారు. దానికితోడు ఇప్పుడు పత్రికలకు, ఛానెల్స్‌కూ ఎవడి రాజకీయ దృక్పథం వాడికి వుంది. ఎవడి పాక్షిక దృష్టి వారికి వుంది. తమ అభిప్రాయాలు, అభిరుచులు, దృక్పథాలు వెల్లడించుకుంటామంటే అభ్యంతరం లేదు. కానీ వచ్చిన చిక్కల్లా అవతలి వారిని వేలెత్తి చూపడం, దుమ్మెత్తిపోయడం, ఎద్దేవా చేయడం, ఆట పట్టించడం, వక్రీకరణలతో అవతలివారి ‘క్రెడిబిలిటీ’ని దెబ్బతీయాలని చూడటం పెరిగిపోతోంది. వర్తమానం సంగతే చూడండి! రాష్ట్ర విభజన విషయంలో తెలంగాణం ఒకవైపు, సమైక్యం ఒకవైపు ఎదురెదురు ఉద్యమాలుగా వున్నాయి. ఎవరి ఉద్యమం వారు చేసుకోవడంకన్నా అవతలి వారిని రెచ్చగొట్టడం, కించపరచడం, గేలిచేయడం ఎక్కువైపోతోంది. ఇవాళో రేపో తెలంగాణా ఖాయం అంటారొకరు. అబ్బే లేదు లేదు అదేమీ అంత తేలిక కాదు!. అసలు బిల్లు పాస్ కాదు. బిల్లు పాసయినా కూడా విభజన కాకుండా రాష్టప్రతి అయినా అడ్డుపడవచ్చు అంటారొకరు. అసలు కలిసివున్నా, విడిపోయినా అందువల్ల అసలు మామూలు సగటు మనిషికి ఒరిగేదేమిటో, తరిగేదేమిటో తెలియదు. రాజకీయంగా లబ్ధిపొందే వాళ్ళెవరో కొంతయినా చెప్పగలమేమో గానీ కాయగూరలమ్ముకునే వాడికి, కట్టెలంగడివాడికి, ఇస్ర్తిపెట్టెవాడికి కలిగే ప్రత్యేక ప్రయోజనాలేమిటంటే ఏం చెబుతారు? విద్యార్థులకూ, ప్రభుత్వోద్యోగులకూ బోలెడు ప్రయోజనం అన్నట్లు చెబుతూంటారు కొందరు. అసలు ప్రభుత్వమే ప్రైవేటీకరణను అమితంగా ప్రోత్సహిస్తూ ప్రభుత్వరంగాన్ని ఉపేక్షిస్తూంటే ఉద్యోగాలకోసం గవర్నమెంట్ పైనే ఆధారపడడం అనేది ప్రముఖంగా వుండడమే తగ్గిపోయింది. కవులూ కళాకారులు అసలు ప్రాంతాలకూ, సంకుచితత్వాలకూ అతీతంగా విశ్వశ్రేయస్సు కాంక్షించవలసినవారు. మానవీయంగా ఆలోచించి మానవ సంబంధాలను మెరుగుపరచవలసిన వారు. వారిలోవారే వైషమ్యాలు పెంచుకుంటూ ఆ వైమనస్యతనే జనంలో పెంచడమంటే అసలు ‘సాహిత్యం’ ‘కళ’ అన్న దానికే ఆఘాతం కాదా! అందరి హితాన్నీ కోరే సాహిత్యం కొన్ని వాదాలకూ, ఇజాలకూ, సంకుచితంగా వర్గాలకూ పరిమితమై ఎవరికివారు తమదైన నాయకత్వ లాలసతో అసలు భాష, సంస్కృతి అనే వాటి మధ్యనే చిచ్చుపెట్ట చూడడం ఆహ్వానించదగిన పరిణామమవుతుందా? ఇంట్లో ఎలుకలున్నాయని ఇంటికి నిప్పు పెట్టుకుంటారా? సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశాలను మూసివేసుకుని ఎవరికివారు ‘తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళు’ అన్న మూర్ఖత్వంతో వ్యవహరించడం తెలుగుజాతి తల ఎత్తుకు తిరిగేదిగా కాక తల వంపులకు గురిఅయ్యేదిగా స్వయంకృతాపరాధాలు కావించడం క్షమార్హమేనా? తెలుగు దర్పం, దర్పణం మూడుముక్కలు చేయచూసేవారు అభినందనీయులేనా!’’ అంటూ ఆర్తితో లేచాడు ప్రసాదు.




0 comments: