ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, October 5, 2012

నడక కాదు నడత కావాలి
‘‘పాదయాత్రలవల్ల ఫలితం ఏమిటి’’ అడిగాడు ప్రసాద్.

‘‘కాళ్ళ వాపు, అలసట’’ అన్నాడు శంకరం.

‘‘అది కాదోయ్ నేనడుగుతోంది! రాజకీయంగా ఏమిటని?’’

‘‘అదా! అది నువ్వూ-నేనూ అర్రీబుర్రీగా తేల్చే వ్యవహారం కాదు. అది జనం తేల్చేది. యాత్రలన్నీ సత్ఫలితాలిస్తాయనుకోవడం సరికాదు. అందరికీ ‘పాదయాత్రలు’ అచ్చివస్తాయనీ అనుకోలేం! తిరుపతి కొండకు నడచి వస్తానని మొక్కుకున్నవాడే, అది సునాయాసంగా చేయలేకపోవచ్చు. కొండమీదకు వెడుతున్న బస్సులో ఒహాయన సీట్లో కూర్చోకుండా, బస్సులో అటూ ఇటూ తిరుగుతున్నాడట. కండెక్టర్ ‘కూర్చోండి మహానుభావా!’ అంటే- ‘అబ్బే! కుదరదులే! కొండకు నడచి వస్తానని మొక్కుకున్నా అని సమాధానం ఇచ్చాడట. అంచేత పాదాలు కదలాడినంత మాత్రాన, ‘పాదయాత్ర’ అయిపోతుందనుకోవడమే సరికాదు సుమా!’’ అన్నాడు శంకరం.

‘‘అదేమన్నమాట! మునుపు రాజకీయంగా పాదయాత్రలతో లబ్ధిపొందిన వారున్నారు కదా?’’ అన్నాడు ప్రసాదు.

‘‘మరి రాజకీయంగా ఏమిటని నన్నడుగుతావేం? ఏదో లబ్ధిపొందాలనే ‘పాదయాత్ర’ అయితే, అది ‘పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు’ అవుతుంది! అసలు ‘పాదయాత్ర’ అనేది రాజకీయంగా ఓ గొప్ప పనిగా, సాహసకార్యంగా భావిస్తున్నారంటేనే తెలియడం లేదా? అలాంటివారు రోడ్డమ్మట నడవడమే గొప్ప అనుకుంటున్నారన్నమాట! తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎన్.టి.ఆర్, ఆ తరువాత 2004 టైమ్‌లో వై.ఎస్సార్ పాదయాత్రలు చేసారంటే- అప్పటి పరిస్థితులూ, జనాదరణం వేరు. ఇప్పుడు పాదయాత్రలు కూడా ఫ్యాషన్‌గా అయిపోయాయని- జనం అనుకుంటున్నారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్ కన్యాకుమారి నుండి రాజఘాట్ వరకూ ఓసారి పాదయాత్ర చేసాడు. కాళ్లు పులిసిపోయాయి కానీ, ఏమీ ఫలితం దక్కలేదు. ఇప్పుడు బాబుగారు ‘చంద్రయాన్’గా మొదలిడిన పాదయాత్ర- రాష్ట్ర దుస్థితిని జనం కళ్ళకు కట్టించడానికనీ, వాళ్ళ కళ్ళు తెరిపించడానికనీ, ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే వ్యవస్థకు ప్రణాళికలు రచించడానికనీ అంటున్నారు గానీ, ఎలాగయినా 2014లో ఎన్నికలలో గెలిచి, సి.ఎం. పీఠంమీద అధివసించడానికి పడుతున్న ఆరాటంగానే అధికులు భావిస్తున్నారు.’’ అన్నాడు శంకరం.

‘‘అదేం మాట! హిందూపురంలో బాబు పాదయాత్రకు జన స్పందన విపరీతంగా లభించిందట! పైగా ఈమాటు ఆయన వెంట కుటుంబ సభ్యులు- ముఖ్యంగా కుమారుడు లోకేష్ కూడా వున్నాడు.’’ అన్నాడు ప్రసాద్.

‘‘అదే మరి! అది చూడ్డం కూడా ఒక సరదా కదా! ‘జనం కనిపించడం’ ఒక్కటే- కొలబద్ద అనుకోవడం పొరపాటు! మందలు మందలు- తరలించినా ద్యోతకం అవడం, తరలివచ్చినా కనిపించడం మామూలే! రాజకీయ నాయకుల ‘నడత’ముఖ్యంగానీ, వారి ‘నడక’కాదు. ‘నడక’వేరు ‘నడత’వేరు. ఎవరి ‘నడత’లెలాంటివో, ఏ విడతల్లో ఎవరు ఎలా వ్యవహరిస్తున్నారో వారెరుగనిది కాదు. తాము లాభపడడంకోసం-అస్తిత్వాలను, ఒకప్పుడు తాము దూషించి, ధిక్కరించి సవాలుచేసిన వ్యక్తికో, పార్టీకో తాకట్టుపెట్టే వాళ్ళనూ చూస్తున్నాం! ఎవరి ఆసరా, ఎవరి పొత్తూలేకుండా స్వయంగా జనాదరణ మొత్తాన్ని పొందగలిగిన ఒక పార్టీగానీ, ఒక నాయక శేఖరుడు గానీ ఇవాళ కనిపించడం లేదు! తెలంగాణ పేర తాను అధికారంలోకి రావడానికి కాకపోతే- కె.సి.ఆర్. మాత్రం కాంగ్రెస్‌లో విలీనం అయ్యే ప్రతిపాదన ఎందుకు చేస్తాడు? కె.సి.ఆర్.కే తన ప్రమేయం లేకుండా మొన్నటి ‘తెలంగాణా మార్చ్’ అంత భారీగా జరగడం నివ్వెరపరచి వుండచ్చు! జనాలు పోగుకావడం, జనాలను పోగుచేయడం అనే ‘జన సమీకరణం’కూడా ఇవాళ ఒక ‘ఈవెంట్ మానేజ్‌మెంట్’ అయిం ది. పాదయాత్ర- పదవీయాత్ర తప్ప, పేదలకోసం యాత్ర కాదని అనే వారున్నారంటే- తప్పకుండా వుంటారు! ఏ ‘యాత్ర’ అయినా నల్లేరుమీది బండినడక కాదు. ‘అధ్వాన్నం’గానూ వుంటుంది. అసలు అధ్వమంటేనే మార్గం. నిజానికి మార్గమధ్యంలో తినే అన్నం అధ్వాన్నం. పేదల గుడిసెల్లో దూరి, వారి కుండలో కూడు తాము తినేయడం- వారి కష్టసుఖాలతో మమేకంకావడం కాదు. జిమ్మిక్కులుగా కనబడేవి, ’’అన్నాడు శంకరం.

‘‘కావచ్చు! కాదనను. కానీ చూసావ్! ‘మీకోసం’, అన్నా ‘మనకోసం’అన్నా- అది తనకోసమే తను అంటున్నాడని జనం అనుకున్నప్పుడు- అది ‘పాదయాత్ర’అయినా, ‘పేదయాత్ర’ అయినా- జనం గుమిగూడుతారేమోగానీ, తమ హృదయంలో ‘గూడు’కట్టుకోలేని నేతను ఆదరించలేరు. జనాకర్షకాలూ, ప్రలోభాలూ పనిచేస్తాయి కాదనను. కానీ వాటి ఉనికి ‘శాశ్వతం’కాదు, ఇప్పుడు వచ్చిన దౌర్భాగ్యం ఏమిటంటే- అందరూ దొంగలే! అవినీతిపరులే! అని తెలుసు. తమనూ అందులో అనివార్య భాగస్వాములుగా చేసేస్తున్నారనీ తెలుసు! ఎవరిని విశ్వసించి నేతగా తలకెత్తుకోవాలో తలపోయడం కూడా- ‘తలవంపులు’గా మారుతోందిగానీ, తలవని తలంపుగానయినా మేలు ఒనగూరుతుందన్న ఆశ పొడచూపడంలేదు. ‘గుడ్డికన్న మెల్ల మేలు’ సామెతలా- మెల్లమెల్లగా ఉన్నదేదో మేలుఅనుకుని సమాధానపడిపోయే పరిస్థితులొస్తే మార్పు ఎలా సాధ్యం? అందువల్ల ఒక గొప్ప ‘కదలిక’జనంలో రావాలి. అది ఎవరు తేవాలి? సదరు హేతువు మరి కావాలి! పాదయాత్రలో వట్టి ‘నడక’కాక, ‘నడత’ ప్రతిఫలిస్తే- జనం కలలు ఫలిస్తే అంతకన్నా కావల్సిందేముంది.’’అంటూ లేచాడు ప్రసాద్.


4 comments:

Vijayalakshmi Muralidhar said...

chala bagundandee!

సుధామ said...

ధన్యవాదాలు విజయలక్ష్మి గారూ! నా బ్లాగ్ కు మీ విజిట్ ఆనందదాయకం.

సుభ/subha said...

నిజమే కదా.. చాలా బాగా చెప్పారు సార్.

సుధామ said...

మీ భావాల 'కడలి 'దర్శించాను సుభ గారూ! ఉల్లాసపు అలలు తాకాయి.అభినందనలు