ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, September 28, 2012

జీవో వైవిధ్య సదస్యులు








‘‘అంతా పైవాడి ఇష్టం
ఎటొచ్చీ అది క్రింది వాడికే ఒక్కోసారి కష్టం
ఇదీ ప్రభుత్వ పరిపాలనా సిస్టం
అందువల్ల ఇప్పటికే కలిగింది బోలెడు నష్టం’’
అంటూ ప్రవేశించాడు సుందరయ్య.

 

‘‘వహ్వా! భేషో భేషు’’ అంటూ చప్పట్లుకొట్టి శంకరం అన్నాడు కదా- ‘‘ఈ పైవాడూ, క్రిందవాడూ అన్నదే మారిపోతూండే ట్రెండయ్యా! ఇవాళ ‘పైచేయి’ అనుకుంటున్నది, రేపు ‘క్రింది’దవుతుంది. ఈ క్రిందుమీదులయ్యే పరిస్థితులు తెలుసుకున్నవారు కనుకే- అధికారంలో వున్నవారు, ‘దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం’ తంతున ‘దోచెయ్యి-దాచెయ్యి’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తూంటారు. తన చేతికి సంపదల వరద అందేందుకు, ఎందరికి ‘బురద’ అంటినా వారికి పట్టదు.’’

‘‘వైఎస్సార్ హయాంలో- ఆయన కొడుకు జగన్‌గారి జగతి పబ్లికేషన్స్‌లోకి నిధుల వరద కొట్టుకురావడానికి ఇరవై ఏడుకు పైగా అక్రమ జీవోలే కారణమనీ, అందుకు ఆరేడుగురుగా మంత్రులూ, ఐ.ఏ.ఎస్ అధికారులూ కూడా కారణమేననీ సి.బి.ఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. దేశంలోనే కాక విదేశాల్లోనూ ‘దేభ్యం’మొహాలు కొన్ని అందుకు సహకరించాయనీ, అవినీతి పంకంలోకి ఇంతలా కూరుకుపోయి, పరువునష్టం కలగడానికి ఆనాడు ముఖ్యమంత్రికి ‘తందానతాన’ పాడిన- తలవూపుడు గంగిరెద్దు మంత్రులే హేతువనీ పేర్కొంది. ముఖ్యమంత్రిని ‘కాదని’కాదు, ఆయన ముఖ ప్రీతికోసం, ఆయనగారి కొడుకుని చంకనెత్తుకుని, ఆనాడు అక్రమ ‘జీ.వో’లతో ‘జీహుజూర్’ అన్నట్లు వ్యవహరించినందుకే, ఇవాళ సి.బి.ఐ. ఎంక్వయిరీలూ తెరుచుకుంటున్న జైలు తలుపులూ ఆహ్వానం పలుకుతున్నాయి. ‘అంతా పైవాడి ఇష్టం’అంటే పాపభీతి, దైవభక్తి అయితే బానే వుండేది. అదికాక పైవాడంటే ‘బాస్’అని ధ్యాసపెట్టి శ్వాసించినందుకే ఇవాళ ఈ ‘లాస్’ మరి’’ అన్నాడు ప్రసాదు.

‘‘పైవాడి ఇష్టం- క్రిందివారికే కాదు, సాటి వారికీ కష్టం, నష్టం కలిగించే సందర్భాలుంటాయర్రా! రేపు వినాయక నిమజ్జనం. ఎల్లుండి ‘తెలంగాణామార్చ్’పేర ఎంత ‘గర్జ నం’, ఎంత‘దుర్జనం’ చెలరేగుతుందో తెలీదు! మార్చ్‌ను వాయిదావేయించే బాధ్యత సి.ఎం.గారు తెలంగాణ మంత్రి అయిన జానారెడ్డి గారికీ, కె.కె.గారికీ అప్పచెప్పారు. ‘‘కరవమంటే కప్పకు కోపం. విడవమంటే పాముకు కోపం’’. వారి పరిస్థితి ‘‘అడ కత్తెరలో పోకచెక్కే’’కదా! తెలంగాణా మార్చ్‌కు అనుమతి లేదుట! ‘‘మీ అనుమతి మాకెందుకు? మా ‘మతి’ననుసరించి, మేం పదాతిదళంగా కవాతు చేస్తాం’’అన్నట్లు కోదండరామ్‌గారు ‘కో’ అని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ కోదండరామ్‌గారు ఉద్యోగమే చేస్తుంటే రాజకీయ కార్యకలాపాలు ఉద్యోగ నిబంధనలకు విరుద్ధం కాదా? అని కొందరి అనుమానం. ఆయన రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధనకోసం కృషిచేస్తున్న దాఖలాలు లేవుకదా అంటారు. కానీ జే.ఏ.సీకి ఆయన ఆధ్వర్యం వహిస్తూండడంవల్లే తెలంగాణ ఉద్యమం చల్లారకుండా చైతన్యవంతంగా వుంది. తెలంగాణ మార్చ్ ప్రజాస్వామిక హక్కు అని ఆయన ‘సాగర హారం’అల్లుతున్నారు’’ అన్నాడు శంకరం.

‘‘జే.ఏ.సీ అనగా ‘జాయింట్ యాక్షన్ కమిటీ’ అన్నదీ ఇప్పుడొక ‘ప్రహసనంగా’ మారింది! రకరకాల ‘జే.ఏ.సీ’లు పుట్టుకువస్తున్నాయి. సామాజిక తెలంగాణ జే.ఏ.సీ ఆవిర్భావ సదస్సుట! మొన్న మంగళవారం- వాళ్ళు తెలంగాణ జే.ఏ.సీ ఛైర్మన్ పదవిలో కొనసాగే నైతిక హక్కు కోదండరాంకు లేదనీ, ఆయన వెంటనే ఆ పదవిలోంచి దిగిపోవాలని డిమాండ్ చేసారు. తెలంగాణ ఉద్యమంతో రెడ్డి, వెలమ, కమ్మ కులాలే మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రమాదం వుందనీ, చెన్నారెడ్డి నుండి కె.సి.ఆర్, కోదండరాంల పోరాటమంతా అగ్ర కులాధిపత్యం కోసమేనని మండిపడ్డారు! తెలంగాణలో నిజాయితీగల నాయకుడు కొండాలక్ష్మణ్ బాపుజీ ఒక్కరేననీ, తెలంగాణకోసం రాజీనామా చేసిన ఆయన మళ్ళీ పోటీయే చేయలేదనీ, అటువంటి మహనీయుడిని కోల్పోవడం తెలంగాణ ‘దురదృష్టం’అనీ అన్నారు. ఎల్లుండి తెలంగాణ మార్చ్‌లో ఒక్క బిడ్డ చనిపోయినా కోదండరాందే బాధ్యత అంటున్న తెలంగాణ వాదులూ వున్నారు’’ అన్నాడు ప్రసాదు.

‘‘ఆశయం ఒకటే అయినా, ఆశయ సాధనలో వైవిధ్యాలు, వైరుధ్యాలు వుంటాయి. వాటిని ఏకత్రితం చేయగలిగి ఏకాభిప్రాయ సాధనే జరిగితే, ఆశించే ఫలితం ఆచరణాత్మకం కావడానికి అడ్డేముంది? కానీ అదే జరగదు! ‘జీవ వైవిధ్యం’ గురించి సదస్సు జరగబోతోంది. కానీ వై.ఎస్సార్ హయాంలో ‘జీ.వో’ వైవిధ్యాలవల్ల- రాష్ట్రం ఎంత నష్టపోయిందో, మన ప్రతిష్ట ఎంత మంటగలసిపోయిందో, ఇప్పుడిప్పుడే బహిర్గతం అవుతోంది మరి! ‘‘ఉద్యమాలతో పాలనకు బ్రేక్ పడిందనీ, రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇబ్బందికర పరిస్థితులనెదుర్కుంటోందనీ’’ సి.ఎం. కిరణ్ వాపోతున్నారు. ఆయన ‘ఇందిర బాట’ సోనియాగాంధీ అనుగ్రహ దృష్టిదాకా వెళ్ళిందో లేదో కూడా తెలియదు. కేంద్రంలోనూ కొత్తకొత్త ‘వైవిధ్య జీ.వో’లు వెలువడుతూనే వున్నాయి. 1242 రూ.కోట్ల పెట్టుబడులు వైఎస్ హయాంలో మంత్రుల వివాదాస్పద జీ.వోల పుణ్యమా అనే - జగన్ దండుకుని, జగమంత అవినీతికి ‘సాక్షి’గా నిలుస్తున్నాడని సుప్రీంలో సీబీఐ అఫిడవిట్! ఐనా ఎంత ధర్మయుద్ధం జరుగుతున్నా- అంతా ఒక ‘విట్’గా, హాస్యాస్పదంగా కనబడుతున్నవి బోలెడున్నాయి! జనాలు ప్రభంజనాలకు కూడా చలించే స్థితిపోతోంది. అంతరించిపోతున్న జాతుల్లో- నీతి, న్యాయం, ధర్మం, పనిచేసే సంస్కృతి కలవారూ చేరిపోయారు. చేవ చచ్చినదే ‘్ఠవ’గా కదులుతోంది. ఇపుడంతా వైవిధ్య సదస్సే!’’అని నిట్టూర్చి లేచాడు సుందరయ్య.

0 comments: