ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, March 2, 2012

‘మందు’ భాగ్యులు
‘‘ఇందుగలదందు లేదను సందేహము వలదు... ఎందెందు వెదకి జూచిన అందందే గలదు ‘మందు’...’’ అని పద్యం ఎత్తుకున్నాడు శంకరం.

‘‘వెదకి చూడడం కూడా ఎందుకు నాయనా? ‘ప్రత్యక్ష సర్వవ్యాపి’యే అది! అంతేనా! డబ్బు తర్వాత పనులు అయ్యే సాధనంగా కూడా- తయారై కూచుంది. ప్రభుత్వంకు ప్రధాన ఆదాయ వనరుగా మద్యమే ‘అనవద్యం’గా నిలుస్తోందంటే, ఇంక అనేదేముంది’’ అన్నాడు ప్రసాదు.

‘‘ఒరేయ్ ప్రసాదు! అసలు ‘ప్రసాదు’అని ఇవాళ ప్రభుత్వ సారాయి దుకాణాన్ని వ్యవహరించుకుంటున్నారు సుమా! ఆంధ్రప్రదేశ్ ‘మద్య’ప్రదేశ్‌గా రాణిస్తోంది. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు అందరికీ- వారి సంపన్నతకూ, ఎదుగుదలకూ ‘మూలాధారనాడి’యై కూచుంది! పైకి ఎవరిమటుకు వారు- అవతలివారే మద్యం ఏరులై పారేందుకూ, అవినీతికీ ఆధారమైనవారనీ, తాము మాత్రం ‘సచ్ఛీలుర’మన్నట్లు అసెంబ్లీలో సహితం ఊదరగొడుతూంటారు. ‘మద్యపాన నిషేధం’ అన్నమాటే ఒక ప్రహసనం అయి కూర్చుంది’’ అన్నాడు శంకరం.

‘‘ ‘నిషేధం’ అనే మాట కుదిరే పని కాదు లేవోయ్! అదో ‘ఉటోపియా’. అంతే! పాపం మద్యపానాన్ని నిషేధించాలని ఇవాళ ఏ ప్రభుత్వం తలపెట్టినా, అది ఆచరణలో అమలయ్యే వ్యవహారం కాదులే! అది చరిత్రేకాదు! పురాణేతిహాసాల కాలమూ చెప్పిన సత్యమే! అతని దగ్గరున్న మృత సంజీవని విద్యను కొట్టేయడానికి- శుక్రాచార్యుని దగ్గరకు దేవతలు... బుద్ధికి బృహస్పతి అయిన బృహస్పతి కొడుకు కచుడిని పంపితే, కూతురు దేవయాని ప్రేమించడంవల్ల రాక్షసులు కచుడిని చంపి మద్యంలో అతని బూడిదను కలిపి శుక్రాచార్యుడిచేతే త్రాగించారు. దేవయాని బాధ చూడలేక- తన ‘సుర’వ్యామోహంవల్లే- కచుడు తన కడుపులో వున్నాడని గ్రహించి, శుక్రుడు కడుపులోని అతన్ని బ్రతికించి, తన పొట్ట చీల్చుకుని బైటికొచ్చే తను, తిరిగి తనను బ్రతికించడానికి ‘మృత సంజీవని’ బోధించక తప్పలేదు! ‘మద్యం’ నిషేధింపదగిందని ఆ రోజుల్లోనే ఆయన గ్రహించి రాక్షసుల గురువుగా ‘త్రాగకండర్రా!’ అని శాసించాడు కూడాను.

‘‘మొదలి పెక్కు జన్మముల ఋణ్యకర్మముల్, పరగ బెక్కుసేసి పడయబడిన యెట్టి యెఱుక జనులకాక్షణమాత్రన, చెఱచు మద్యసేవ సేయనగునె’’ అని హితవు పలికి, ‘‘భూసురులాదిగ గల జనులీసుర సేవించిరేని నిదిమొదలుగ బాపాసక్తి పతితులగుదురు చేసితి మర్యాద దీని జేకొనుడు జనుల్’’అని హెచ్చరించాడు. ‘పాపాసక్తి పతితులవుతారు’ అన్నమాట తెలిసీ, ‘చేసితి మర్యాద దీని జేకొనుడుజనుల్’ అన్న మాట మాత్రం ‘మర్యాదకోసం మందు పుచ్చుకోండని’- నాటినుంచీ నేటివరకూ మనవాళ్లు అన్వయం చేసుకోవడంవల్ల, మద్యం సిండికేట్లు దినదిన ప్రవర్థమానమవుతున్నాయి’’ అంటూ పలికాడు సుందరయ్య.

ప్రసాదు పకపకా నవ్వి ‘‘భలే అన్నావోయ్!’ మద్యం పుచ్చుకోవడమే మర్యాద’ అయిపోయింది. ప్రభుత్వానికి ఆదాయం పెరగాలంటే మరి ప్రజలు ‘మర్యాదగా’ ఎంత వుంటే అంత మంచిది కదా! రాష్ట్రంలో ఆరువేల అయిదువందల తొంభై ఆరు మద్యం షాపులున్నాయిట. నిజానికి మద్యం సీసామీద ఎం.ఆర్.పి. ధర ఒకటుంటుంది. కానీ దాన్ని మించిన ధరకు అమ్ముకోవడం, అక్రమాలకు పాల్పడటం- మద్యం సిండికేట్లకు అలవాటైపోయింది. ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ అధికారులకు ఇచ్చిన ఓ ఏడాది లంచమే 9.37 కోట్ల రూపాయలట! పోలీసుల కోటా అందులో- 3.12 కోట్లుట. అంతెందుకు? ఒక్క కృష్ణా జిల్లాలోనే- గత ఏడాది జూలై నుంచి డిసెంబర్ దాకా, అంటే ఓ ఆర్నెల్లకాలంలో- సిండికేట్లు 7.45 లక్షలు లంచంగా అధికారులకు ఇచ్చారుట! మరి ఇదంతా ‘మద్యం మాఫియా’కాక ఏమిటి? అవినీతి నిరోధకశాఖ ఎ.సి.బి. ఇటీవల ఓ మూడువందల యాభై మద్యం షాపుల మీద, ముప్ఫైనాలుగు మద్యం సిండికేట్ల మీద దాడిచేసిందంతే! వారి ‘రిపోర్ట్’ గురించే- అసెంబ్లీలో మద్యం ముడుపుల గురించి పాలక పక్షం, ప్రతిపక్షం బాహాబాహీ ‘త్వంశుంఠ అంటే త్వంశుంఠ’ అన్నట్లు, పరస్పర నిందారోపణలతో ‘రభస’చేసాయి కదా! ఎక్సైజ్ శాఖామంత్రి ‘మోపిదేవి’గారే- ఖమ్మంలో లిక్కర్ సిండికేట్ల మధ్య సయోధ్య కుదర్చి, పది లక్షలు ఒడుపుకున్నారట! వైన్‌షాపుల లైసెన్స్ వ్యవహారాలు, మద్యం ముడుపుల వ్యవహారాలు ‘సైలెన్స్’స్థితిని దాటి, మీడియా కెమేరాల ‘లెన్స్’లకు చిక్కి, రచ్చరచ్చ అవుతోంది’’ అన్నాడు ప్రసాదు.

‘‘అది సరే ప్రసాదూ! దారుణం ఏమిటంటే- ఎం.ఆర్.పి కంటే అధిక ధరలకు అమ్మడం ఒక పార్శ్వం అయితే, ప్రభుత్వ లేబుళ్లతో రంగురంగుల మద్యం సీసాలలో ‘నాటుసారా’ అమ్మకాలు. పాపం కూలీనాలీ చేసుకు బ్రతికే జనాన్ని-వారికున్న మద్య వ్యసనాన్ని ఆసరాచేసుకుని, మరింతగా దోపిడీకీ, పీడనకూ గురిచేయడం. జనవరి ఒకటి నాడే పద్దెనిమిది మంది కల్తీసారాతో మృత్యువాత పడిన కథనం మనం పేపర్లలో చదివాం కదా! నాటుసారా తయారీలో యూరియాలు, వాడి పారేసిన బ్యాటరీల వ్యర్థపదార్థాలు వాడడం, శుభ్రంచేయని పురుగు మందుల క్యాన్‌లు, డ్రమ్ముల్లో సారా రవాణాచేయడం- పేదల ప్రాణాలను వ్యసన వ్యామోహంవల్ల బలితీసుకుంటోంది. ‘పాపాసక్తి పతితులవడం’కాదు, మద్యం సిండికేట్ల పరపతులతోనే పదవీ, అధికారాలు సాధిస్తున్నారంతా! అలాంటి వారంతా- ‘మందు’భాగ్యులవుతూండగా, మామూలు వెర్రి పేద ప్రజలే ‘మంద భాగ్యులై’ ప్రాణం తీ‘సారా’గా మారుతున్నారు.’’ అన్నాడు ఆర్తిగా శంకరం.

‘‘ ‘మద్యపానం ‘బందు’అనేది-ఈ ‘రాబందు’రాజ్యం ఎప్పటికీ అంగీకరించదు! మందభాగ్యులు మందభాగ్యులుగానే వుంటారు. ‘మందు’భాగ్యులు మాత్రం అధికారాలు, రాజకీయాలు, ప్రభుత్వాలు, శాసనాల చక్రం తిప్పుతూనే వుంటారు. ఈ ‘అమృతం’కోసమే మనుషులు దేవదానవులుగా మథిస్తూ,‘మథన’పడుతూనే వుంటారు’’అని నిట్టూర్చి లేచాడు సుందరయ్య.

 

0 comments: