ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, September 11, 2011

ఆకాశవాణి హీరోయిన్ ఆత్మకథ!


హీరోయిన్’ అనే మాట రంగస్థలంపైనా, సినిమాల్లోనే ఉంటుందనుకుంటే తప్పు. ‘రేడియో హీరోయిన్’ అనిపించుకున్న అసంఖ్యాక శ్రోతల అభిమాన ఆకాశవాణి కళాకారిణి శ్రీమతి శారదా శ్రీనివాసన్.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో - ‘స్టాఫ్ఆర్టిస్టు’ అన్న ఉద్యోగానికి నిజంగా ఒక హోదా నిలబెట్టిన వారిలో ఆమె అగ్రగణ్య. 1995లో రిటైరయ్యేంతవరకు శ్రీమతి శారదా శ్రీనివాసన్‌గారు ఆకాశవాణి కళాకారిణిగా లక్షలాదిశ్రోతల ఇంటింటి అభిమాన పాత్రురాలయ్యారు.

'నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు' అని శ్రీమతి శారదా శ్రీనివాసన్‌గారు రాసిన ఈ పుస్తకం నాటి ఆకాశవాణి వైభవ ప్రాభవాలను కనులముందంచడం మాత్రమే కాదు, జాతి జీవనాన్ని వికాసవంతం చేయడంలో, ఒక ఉదాత్త విలువల పరివ్యాప్తిలో, ఆకాశవాణి పోషించిన పాత్రను విశదీకరించేదిగా ఉంది.

రేడియోలో మాత్రమే వినబడే విరామ సంగీతం పద్ధతిని ఈ పుస్తకంలో శారదగారు 153వ పేజీలో తమ సహోద్యోగి, గొప్పసామ్యవాది, నాటక ప్రయోక్త, రచయిత, నటుడు ,రేడియోలోస్టాఫ్ఆర్టిస్టుల అభ్యున్నతికై గొప్ప కృషిచేసిన కార్యశీలి ,కొపరేటివ్ సొసైటీ, క్రెడిట్ సొసైటీ వంటివాటి స్థాపనతో ఉద్యోగుల సంక్షేమానికి వెన్నుదన్నయిన శ్రీ కె.చిరంజీవిగారి అభిప్రాయాన్ని ప్రచురించడం విలక్షణంగానూ, సముచితంగానూ, ఎంతో ప్రశంసనీయంగానూ వుంది.

శ్రీమతి శారదగారి ఈ అనుభవాలు- జ్ఞాపకాలలో రేడియోలో క్యాజువల్స్‌గా పనిచేసిన యువత దగ్గరనుండి ,తనతో పనిచేసిన సహోద్యోగులు, అధికారులు అందరినీ కూడా దాదాపుగా పేరుపేరున తలచుకోవడం ఒక విశేషం.

అయితే ఆవిడ పాలనూ నీటినీ వేరుచేసి చూసే రాజహంసలా, గుణగ్రహణం చేసినంతగా- తన అసంతృప్తులను, విషాదాలను, వైఫల్యాలను, ఎదుర్కొన్న సమస్యలను ,ఎక్కడా ద్విగుణీకృతం చేసి చూపలేదు. పోనిమ్మని వదిలేసిన తావులే ఎక్కువ. అది ఆవిడ సంస్కార లక్షణం.

తన భర్త, ప్రముఖ వేణు విద్వాంసులు, రేడియోలో మ్యూజిక్ ప్రొడ్యూసర్‌గా చేసిన శ్రీ ఎన్.ఎస్. శ్రీనివాసన్‌గారి గురించి ఆవిడ ఒక పుస్తకమే రాయవచ్చు. కానీ ఆవిడ ఎంతో కుదించుకుని రాసారుగాని ఆయన బహుముఖీన వ్యక్తిత్వాన్నీ, సృజనశీలతనూ సముచితంగా ఆవిష్కరించారు.

'కృష్ణశాస్ర్తీ, స్థానం నరసింహారావు, మునిమాణిక్యం, నాయని సుబ్బారావు, గోపీచంద్, బుచ్చిబాబు, భాస్కరభట్ల, దాశరథి, రజనీకాంతరావు, పాలగుమ్మి విశ్వనాథం, కేశవసుతుల నరసింహశాస్ర్తీ వంటి సాహిత్యసంగీత రంగాల దిగ్ధంతులు ఏక కాలంలో ఒకే ఆఫీసులో పనిచేయడమనేది ప్రపంచంలో బహుశా ఒక్క ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో తప్ప మరెక్కడా జరిగిఉండని ఘటనేమో! 'అన్న చిరంజీవిగారి మాటలు యదార్థం. ప్రసారభారతి కార్పోరేట్ సంస్థగా రేడియో, టీవీల భవిష్యత్తును ఏనాడో ఊహించి చిరంజీవిగారు ప్రసారభారతి ఏర్పడుతున్న కొత్తల్లోనే ఒక వ్యాసం రాశారు.

శారదగారి ఈ పుస్తకం చదువుతుంటే ఒకనాటి ఆకాశవాణి వైభవం కనులముందుండడమేగాక ,నేటి స్థితికి తులనాత్మక ఆలోచనలు కలిగి శ్రోతలు వగచే వీలూవుంది.

‘‘నిజమే. ఆ గొప్ప గొప్ప మేధావులున్నప్పటివి బంగారపురోజులే. కాదనను.కానీవాళ్ళు మనకొక మార్గంచూపి వెళ్లారు.ఆమార్గానే్ వెళుతున్నాం కూడా. మరెందుకిలా? విమర్శించడానికి ముందు మనమొక సంగతి ఆలోచించాలి. ఏ ప్రోగ్రామైనా విని అది బాగా ఉన్నప్పుడు మనం బాగా వుంది అని ఒక్క ఉత్తరం ముక్కయినా రాశామా? లేదు పోనీ ఫోన్‌లో చెప్పామా? అదీ లేదు. మా రోజుల్లో మేధావులైన శ్రోతలుకూడా వాళ్లకు నచ్చిన ప్రోగ్రాము గురించి ఉత్తరాలురాసి మమ్మల్ని ప్రోత్ససించేవారు. ఒక చిన్న ఎంకరేజ్‌మెంట్ ఆర్టిస్టు సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తుంది’’ అంటూ పేర్కొని శారదగారు చివరలో -

‘‘ప్రజలకు సమాచారాన్నందించటం, వివిధ విజ్ఞానాలతోపాటు సామాజిక అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలను రూపొందించి వైవిధ్యభరితంగా ప్రసారం చెయ్యడం రేడియో కర్తవ్యం. ఆ పవిత్ర కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పూర్వ వైభవాన్ని తిరిగి సంతరించుకోవాలని కోరుతున్నాను’’ అంటూ ఎంతో ఆశావహంగా ముగించారు.

ఆవిడే అన్నట్లు ‘‘ఎంత జ్ఞాపకం పెట్టుకుని రాసినా ఇంకా ఎవరినో మరిచిపోయినట్లు, చెప్పవలసిన సంఘటనేదో వదిలి వేసినట్లు అనిపిస్తుంది’’ అంటే దానికి కారణం శారదగారి నుంచి ఇంకా వినదగ్గ విషయాలెన్నో ఉన్నాయని పాఠకులకు అనిపించడమే.

నిజానికి ‘ఆకాశవాణి’ జన జీవన అనుబంధాన్నీ, సాహిత్య సాంస్కృతిక సామాజిక అభ్యున్నతికి చేసిన సేవలను గ్రంథస్థం చేయడంవల్ల చరిత్రను రికార్డు చేయడం మాత్రమేకాక, మరెంతో ప్రయోజనం కలుగుతుంది. ఆచంట జానకీరాం, రజనీ ప్రభృతులు అడపా దడపా తమ రచనలలో ప్రస్తావించడం జరిగింది . ప్రస్తుతం 'రచన' మాసపత్రికలో శ్రీ డి.వెంకట్రామయ్య, 'కౌముది’ అంతర్జాతీయ మాసపత్రికలో శ్రీ సుధామ, తమ రేడియో అనుభవాలు, జ్ఞాపకాలు రాస్తున్నారుగానీ. నేరుగా ఆశ్చర్యానందాలను కలిగిస్తూ వెలువడిన రేడియో జ్ఞాపకాల పుస్తకం శ్రీమతి శారదా శ్రీనివాసన్‌గారిదే. ఇలా తొలుత గ్రంథస్థం చేసి నిజంగా ఆ రకంగానూ ఆవిడ ‘హీరోయిన్’గా నిలుస్తున్నారు.

ఆకాశవాణిలో తన వృత్తి జీవన ఆత్మకథే అయినా, తన గళం అలా వింటూ ఉండిపోవాలని శ్రోతలకు ఎలా అనిపిస్తుందో, ఈ పుస్తకం అలా చదువుతుండాలని పాఠకులకూ అనిపిస్తుంది. పదిలపరుచుకోదగిన పుస్తకం ఇది.


(నా రేడియో అనుభవాలు - జ్ఞాపకాలు, శ్రీమతి శారదా శ్రీనివాసన్, వెల: రూ.125/- ప్రతులకు: 204, సీతారామ ఎన్‌క్లేవ్, 3-6-671, స్ట్రీట్‌నెం. 10. హిమాయత్‌నగర్,హైదరాబాద్)

('ఆంధ్రభూమి 'దినపత్రిక ఆదివారం 11.9.2011 'అక్షర 'పేజీలో ప్రచురితం)

2 comments:

శివరామప్రసాదు కప్పగంతు said...

ఒక మంచి పుస్తకం గురించి చెప్పారు. ధన్యవాదాలు. మనకున్న కళాకారుల్లో అత్యధిక ప్రాచుర్యం పొందినది సినీ కళాకారులు. మనకు తెలియక్కర్లేని వివరాలు కూడ వీరి గురించి చాటింపు వేసి మరీ చెప్పే మీడియా ఉన్నది.

రంగస్థల నాటక కళాకారుల గురించి అప్పుడప్పుడూ వార పత్రికల్లో వెలువడుతూ ఉంటుంది, 1980లలో అనుకుంటాను ధారావాహికగా అనేక మంది రంగ స్థల కళాకారుల గురించిన వివరాలు అందించారు.

కాని రేడియో కళాకారుల దగ్గరకు వచ్చేసరికి, పాపం వారు ప్రభుత్వ అధీన మీడియం లో పని చేయటం వల్ల, వారిని గుమాస్తాలుగానే పరిగణించి, వారి గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. చివరికి ఎవరికి వారు ఆత్మకథలు, జీవిత చరిత్రలు ప్రచురించుకుంటేనే కాని వారిగురించి తెలియని పరిస్థితి!

ఆకాశవాణి, విజయవాడ కేద్రానికి సంబంధించిన హేమా హేమీలు, శ్రీ ప్రయాగ నరసిమ్హ శాస్త్రి, శ్రీ బందా కనకలింగేశ్వర రావు, శ్రీ చివుకుల రామమోహనరావు, శ్రీ నండూరి సుబ్బారావు, శ్రీమతి పి శీతారత్నం మున్నగుగా గల వారి గురించిన వివరాలే కాదు, చివరికి ఒక మంచి ఫొటో కూడా దొరకటం లేదు. ఈ విషయంలో నేను ఆకాశవాణిని ఒక సంస్థగా తప్పుపడతాను. వారు ఇప్పటికైనా (వాళ్ళ గుమాస్తాలు ఈ పని చెయ్యగలిగితే) వారి సంస్థకు పేరు ప్రఖ్యాతులు గడించిపెట్టిన అనేకానేక అలనాటి కళాకారుల గురించి ఒక చక్కటి పుస్తకం తీసుకు రాగలిగితే ఎంతైనా బాగుంటుంది. ఆ పుస్తకం తో బాటుగా, ఆయా కళాకారుల గళాలను కూడా వినిపించే ఒక కదంబ కార్యక్రమాన్ని సి డి ద్వారా ఆ పుస్తకంతో బాటుగా అందిస్తే ఆ కళాకారుల ఋణం తీర్చుకున్న వారౌతారు, శ్రోతలకు వివరాలు అందించిన వారు అవుతారు.

ఈ విషయంలో నేను కొంత కాలం క్రితం ఆకాశవాణి వారికి వ్రాసిన బహిరంగ లేఖ ఈ కింది లింకు సహాయంతో చదువవచ్చు :

http://saahitya-abhimaani.blogspot.com/2010/10/blog-post_03.html

సుధామ said...

sivarama prasad garu meerannadi akshra satyam.kaanii nedu vaariki anta shradda ledu.ade duradrushtam