ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, June 3, 2011

వాహన యోగం!


ఓర్నాయనో! ఏం ట్రాఫిక్! ఏం ట్రాఫిక్! ట్రాఫిక్ ఇలావుంటే-ఎంత సమయపాలన పాటిద్దామన్నా కుదిరి చావదు కదా!- అన్నాడు సన్యాసి, రుమాల్‌తో మొహం తుడుచుకుంటూ, లోపలికి వస్తూ!
‘‘ఇంతకీ కార్లో వచ్చావా? స్కూటర్ మీదా?’’ అని అడిగాడు రాంబాబు సన్యాసికి ఎదురేగి తీసుకొస్తూ.
‘‘వాహనం కూడానా!పొద్దునే్న ఇక్కడికి అర కిలోమీటర్ దూరంలోని మా చెల్లెలింటికి వచ్చాను. సాయంకాలం ఈ సభకు ఇలా నడిచి వచ్చేయవచ్చని, ఓ పది నిముషాల నడకే అనుకుంటే...అరగంట పట్టింది’’ అన్నాడు సన్యాసి ఉస్సురుమంటూ.
‘‘ఏమిటి? నడిచి రావడానికి కూడా ట్రాఫిక్ జామా? అదేమిటోయ్?’’ అన్నాడు ప్రసాద్ ఆశ్చర్యపోతూ.
‘‘అదే బ్రదర్ మరి, హైదరాబాద్ గొప్పతనం అసలు పాదచారులు నడవడానికి ఫుట్‌పాత్‌లంటూ ఉంటేగా! ఉన్నచోట్ల కూడా హాకర్లు, తోపుడు బండ్లవాళ్లు, ఆ జాగాని ఆక్రమించేసి, చిల్లరవ్యాపారాలు చేసుకునేవారు ఎక్కువైపోయారు. ఆధివారం ఓ ఫుట్‌పాత్ నిండా సెకండ్ హ్యాండ్ పుస్తకాలు పరుస్తాడు! రోడ్డుమీద నడుద్దామంటే-ఎక్కడినుంచి ఏ వాహనం, ఎటునుంచి వచ్చి గుద్దేస్తుందో తెలీదు! ఈ ఆర్టీసీ బస్సుల వాళ్లు కూడా ఒకరి వెనుక ఒకరు వెళ్లరు. ఒక బస్సుకన్నా ముందు పోవాలని-అదేదో ప్రైవేట్ బస్సుల వాళ్లు పోటీ పడ్డట్టు, దాటుకుపోవాలని, ఇంకో లైన్లో వస్తారు! ఇక ఆటోవాలాల సంగతి చెప్పనే అక్కర్లేదు! సెవన్ సీటర్లు ఉన్న చోట...అదో జోరు! అసలు ఈ వాహనాలు ఇంతలా పెరిగిపోయి మనిషి నడవడానికి చోటులేకుండా పోతోంది. వాహనాలను, తోపుడు బళ్లను, బస్సు స్టాపులను, అక్రమ పార్కింగ్ ప్లేసులనూ దాటుకుంటూ నడవడం కూడా ఓ సర్కస్ ఫీటులా తయారైంది! దానికితోడు రోడ్ల గతుకులు, గుంటల, తెరిచివుంచిన మ్యాన్‌హోల్స్, ఎ లక్ట్రిక్ పోల్స్, వీటన్నింటినీ ఛేదించుకుని...పాదచారి నడవడం కూడా-నకులుడు చినుక్కీ చినుక్కీ మధ్య రధం నడిపించాడుగానీ, ఈ ట్రాఫిక్ చూస్తే, చికాకెత్తి పారిపోతాడు’’ అన్నాడు సన్యాసి.
‘‘నువ్వన్నది నిజం సన్యాసీ! నడిచి వెళ్లడం కూడా ప్రమాదంగా మారింది నగరంలో! ఏ మోటార్ సైకిల్ మీదో, బస్సులో వెడుతూ స్టాప్‌లో దిగడం జరిగినప్పుడో-జరిగే ప్రమాదాలకన్నా, పాదచారులకు జరిగే ప్రమాదాలు, వాసనాల సంఖ్య పెరుగుదలతో ఎక్కువుతున్నాయి! ఉట్టిపుణ్యాన ఏ స్కూటరో, లారీయో, కారో, మరేదో వాహనాన్ని తప్పించబోయి నడుస్తున్నవారిమీదకు దూసుకు వస్తున్న కథనాలు ఎక్కువవుతున్నాయి! నడవడం కంటే ఏ వాహనం మీద రావడమే బెటర్! అనిపిస్తుంది. యాక్సిడెంట్ జరిగినా వాహనంవల్ల అంటే ఎవరన్నా నమ్ముతారు. నడుస్తూంటే యాక్సిడెంట్ అయిందంటే నివ్వెరపోతారు’’ అన్నాడు రాంబాబు.
‘‘నిజమేలే! ఇలాగే ఓ కారువాడు మొన్న సుందరయ్యను గుద్దేయబోయి పైగా-’’ ఏవయ్యా! సరిగ్గా నడవలేవా’’ అని అడిగితే-‘‘నేను పదేళ్లనుంచీ కారును నడుపుతున్నాను. నువ్వు చూసుకు నడవలేదా?’’ అని ఆ కారువాడు సుందరయ్యను ఎదురు ప్రశ్నించాడట. ‘‘నేను యాబయ ఏళ్లనుంచీ నడుస్తున్నాను’’ అని మన సుందరయ్య సమాధానం ఇచ్చాడట. తప్పొప్పుల ప్రసక్తి లేకుండా-ప్రతివాడూ, తనకన్నా చిన్న వాహనం వాడిని తిట్టడం, చిన్నవాహనంవాడు తనకన్నా పెద్దవాహనం వాడిమీద తనదే తప్పయినా తిరగబడడం మామూలైపోయింది! ట్రాఫిక్ కంట్రోల్ చేయాల్సిన పోలీసులు వాళ్లకు తోస్తే చేస్తారు, లేదా రోడ్డుకు ఓ మూల ‘తననే ఏ వాహనం గుద్దేస్తుందో!’ అన్నట్లు నిలుచుని ఊరికే ‘విజిల్స్’ ఊదుతుంటారు. లేదూ! చలాన్స్ రాస్తూ ‘వసూళ్ల’ పనిలో ఉంటుంటారు’’ అన్నాడు ప్రసాదు.
‘‘వింటున్నా వింటున్నా! నా గురించీ ప్రస్తావిస్తున్నారుగా’’ అంటూ సుందరయ్య ముందుకొచ్చి- ‘‘ప్రధానంగా పది సమస్యలు ట్రాఫిక్‌కు ఇబ్బందిగా ఉంటున్నాయని ట్రాఫిక్ అదనపు కమిషనర్ ఒప్పుకున్నారు. రాంగ్ పార్కింగ్, ఆక్రమణలు, ట్రాఫిక్ వ్యవస్థ లోపాలు, ఇరుకు (బాటిల్‌నెక్) రోడ్లు, ప్రముఖుల సందర్శనలు, రోడ్డు కట్టింగులు, ధర్నాలు, మూడువేలఅయిదు వందల ఆర్టీసీ బస్సులు, డెబ్బయ వేల ఆటోలు, ట్రాఫిక్ విభాగంలో అసౌకర్యాలు, సిబ్బంది కొరత, ఇవన్నీ ప్రధాన సమస్యలని-ఆయన బాధ’’ అన్నాడు సుందరయ్య వివరిస్తూ.
‘‘అవునయ్యా! వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సింది వారే కదా! దానికి బదులు-‘‘ట్రాఫిక్ చాలా భయంకరంగా ఉంటోంది సాధ్యమైనంత మటుకు ఇంటిపట్టునే ఉండండి. ఊరికే రోడ్లెక్కకండి నడవడానికైనా సరే!’’ అంటూ వాళ్లే ఉచిత సలహాలు పారేయడం ఏమన్నా బాగుందా చెప్పు’’ అన్నాడు సన్యాసి.
‘‘కాదననయ్యా! కానీ పౌరుల సహకారం కూడా ఉండాలి! నిజంగానే ఈ ‘కన్స్యూమరిజం’ తెగ పెరిగి, జనాల కొనుగోలు శక్తులు పెరిగాయో ఏమో, మాల్స్ బజార్లు థియేటర్లు, హోటళ్లు, రోడ్లు అన్నీ జన సమర్ధమేనాయె! అసలు సహజంగా నడకపోయి, డాక్టర్ల సలహా మేరకు నడకలే కనపడుతున్నాయి. ఉదయం వాకింగ్ క్లబ్‌లు, జనాలు. కానీ మామూలుగా పనీ పాటలకు ఈ వాకర్లే-పక్క కూరగాయల షాప్‌కి కూడా మార్నింగ్ వాక్ తర్వాత మళ్లీ ఏ స్కూటర్‌మీదో వెళ్లడమే చేస్తారు. నడక ఎప్పుడయినా ఎక్కడయినా ఎంతయినా నడవచ్చుననే కానె్సప్టు ఇప్పుడు లేదు. అససరం ఉన్నా లేకపోయినా-వాహనం జీవితంలో అనివార్యమైపోయింది. పదేళ్లలో నగరంలో వాహనాల సంఖ్య పదమూడు లక్షలకు మించిందిట తెలుసా! గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం వాహనాలు అన్నీ కలిపి-ఇరవై మూడు లక్షలకు పైగా ఉండగా, సైబరాబాద్ పరిధిలోనే ఆరులక్షలున్నాయట! 2015 నాటికి వాహనాల సంఖ్య ఏడా రెండున్నర లక్షలుగా అదనంగా చేరుతూ, నలబయ లక్షలు దాటుతుందని అంచనాట’’ అన్నాడు సుందరయ్య.
‘‘కుబేరుడిది నరవాహనం అన్నారుగానీ, నరులే కుబేరులవుతూ వాహనాలను పెంచేస్తున్నారు. ‘‘మనిషికి పాదములు ఒకప్పుడు నడుచుటకు ఉండెడివి’’ అని భావి తరాల వారు చదువుకుంటారేమో!’’ అంటూ నవ్వాడు రాంబాబు.

3 comments:

కనకాంబరం said...

Wonderful SUDHAAMA jee .yee mee padaalu ...Wonderful.

‘‘మనిషికి పాదములు ఒకప్పుడు నడుచుటకు ఉండెడివి’’ అని భావి తరాల వారు చదువుకుంటారేమో!’’...Nutakki(Kanakaambaram.)

good said...

రోడ్డు వెడల్పు చేయాలంటే చాలా అంశాలు అడ్డం వస్తాయ్.
కాలక్షేపం షాపింగ్ కొంత,పాలకుల నగర పర్యటన కూడా
ఇంకా చాలా విషయాలు వున్నాఅనుకునేందుకు లేదు
అవును ఈ విషయం లో చేయగలిగింది నగరాన్ని
మరో సువిశాల ప్రాంతంలో పునర్నిర్మాణమేమో!
అందుకు మరెన్ని అడ్డంకులులో ఐనా అది సాధ్యమేనా!

పుట్టపర్తి అనూరాధ said...

నాకో అవిడియా ..వచ్చింది..పాదచారులూ..ఒక పేద్ద శబ్దం వచ్చే..హారను లాంటి దాన్ని మోగించుకుంటూ పోతే ..కొంతలో కొంత బెటరనుకుంటా..