ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, April 29, 2011

సుమ పరిమళాలు









''పూల బాసలు తెలుసు నా ఎంకికి’’...అని నండూరి వారు ఆనాడు ఆనందించారు కానీ, ఇప్పుడు చాలామంది ఆడవాళ్ల తలలో పూలే కనిపించడంలేదు. ముఖ్యంగా ఈ తరం ఆడపిల్లల్లో పూలపట్ల మోజు, తలలో చక్కగా పూలు తురుముకోవడం, అనేది గగనమైపోతోంది!’’ అన్నాడు రాంబాబు.



‘‘నిజమే! ఒకప్పుడు ఎండాకాలం అంటేనే మల్లెపూలూ, మామిడిపళ్లు. ‘ఓ పావలా మల్లెపూలయినా ఎప్పుడయినా కొనిపెట్టారూ!’ అని పూర్వం భార్యలు భర్తదగ్గర అలగడం, ఆఫీసునుంచి ఇంటికి వస్తూ మల్లెపూల పొట్లం తీసుకువస్తే-అతగాడికి భార్యమీద బోలెడు అనురాగం ఉన్నట్టు భావించడం జరిగేది. తలలో పూలు ముడుచుకోవడం-‘ముతె్తైదువ’ లక్షణం. అమ్మాయిలకు పూలజడ కుట్టించి మురిసిపోయేవారు! అందులో ‘మొగలి పూల జడ’ అంటే మరీ స్పెషల్! పూల జడ వేసుకుని, అద్దంలో అది కనిపించేలా ఫోటో తీయించుకోవడం-ఆ రోజుల్లో గొప్ప క్రేజ్’’ అన్నాడు ప్రసాద్ కూడా నవ్వుతూ.




‘‘అసలు ప్రకృతికి సౌందర్యం అనే తొలి భావన కలిగించిందే ‘పువ్వు’ అనాలి! పూలు పూచింది నా కోసం, గాలి వీచింది నా కోసం’’ అనే మధుర భావన ఉండేది! పూలు గుసగుసలాడతాయనేది ఒక తీయని తలుపు! పువ్వు వికసిస్తే, ముఖంలో నవ్వు వికసించినట్టే! ‘‘ఈ ముసి ముసి నవ్వుల విరసిన పువ్వులు గుసగుసలాడినది ఏమిటో..’’ అని కవులు ఊహాగీతాలు రాసేవారు. శోభనం రాత్రి అంటే ‘పూలపాన్పు’ విధాయకంగా ఉండేది. పూలమొక్కలు పెంచడం-ఇంటి పెరటి తోటలో విధిగా జరిగేది. అసలు ‘తోట’ అంటేనే పూలతో నిండినది అనే భావన! ఫలపుష్ప సమృద్ధం కానిదే-సౌందర్యం ఎక్కడిది? అనుకునేవారు. ప్రక్కప్రక్కల విస్తరించుకునే ఇళ్లూ, ఇరుగూ-పొరుగూ అనేదిపోయి, ఒకరి నెత్తిన ఒకరు ఎక్కి కూచునే అపార్టుమెంట్ కల్చర్ వచ్చాక, ఇంటిముందో, వెనకో పూలమొక్కలు పెంచడం అనే కానె్సప్ట్ పోనేపోయింది! రానురాను కాలపరిణామంలో పూలూ, పూల అనుభూతులూ కూడా దూరమైపోతున్నాయేమోనని పిస్తోంది’ అన్నాడు సుందరయ్య.



‘‘సంతోషం, మంచితనం, సౌమ్యత, సాన్నిహిత్యం అనే భావాల ఉద్దీపనకు పువ్వులు అమితంగా సహకరిస్తాయని ఇటీవలి పరిశోధనల్లో కూడా చెబుతున్నారర్రా! ‘ఎవల్యూషనరీ సైకాలజీ’ అనే పత్రికలో ఆమధ్య-స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూజెర్సీ సైకాలజీ డిపార్ట్‌మెంట్‌కూ, జెనిటిక్స్‌కూ చెందిన పరిశోధకులు కొందరు-పూల ప్రభావం గురించి, విస్తృత అధ్యయనం, పరిశోధన చేసారుట! ‘‘ఉపయుక్త ప్రభావానుభూతులు’’ కలిగించడంలో-పూలు, పూల పరిమళాల పాత్ర అవిస్మరణీయమయిన దంటారు వాళ్లు..’’ అన్నాడు శంకరం కల్పించుకుంటూ.



‘‘అయిదువేల సంవత్సరాలకు పూర్వంనుంచీ-ప్రత్యేకించి పూలమొక్కలు పెంచే సంస్కృతి ఉండేదర్రా! పూలు, పిల్లలు, స్ర్తిలు ఈ మూడింటికీ వున్న‘లంకె’ కూడా గొప్పగా ఉంటుంది! మగ అయినా, ఆడవారయినా, అసలు మెదడుకు సంతోష స్పందనను, జ్ఞాపకాల అనుభూతినీ కలిగించేవిగా-పువ్వులను మించిన ‘పాజిటివ్ ప్రేరకాలు’ వేరు లేవుట!’’ అన్నాడు రాంబాబు.




‘‘ప్రముఖుల మెడలోకీ, దేవుని గుడిలోకీ కూడా పువ్వుల ప్రయాణం సాగుతూంటుంది. అంతెందుకు! పూలతో ముడిపడని సందర్భాలు, సమావేశాలు తక్కువే! పెళ్లి పందిరిలోనూ కనిపిస్తాయి పూలు. ఒకరి మరణశయ్య దగ్గరా కనిపిస్తాయి పూలు. సమాధుల దగ్గరా పువ్వులు వుంచి స్మరించడం ఆచారం! అంచేత-శుభమైనా, అశుభమైనా పువ్వుల పాత్ర అనివార్యం. సానుభూతి, రొమాన్స్, పశ్చాత్తాపం, ఉత్సవం దేనికైనా పువ్వులు నిలుస్తాయి. న్యూజెర్సీ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు-‘అమెరికన్ ఫ్లోరిస్ట్ సొసైటీ’ సహకారంతో చేసిన పరిశోధనల్లో ఎన్నో ఆసక్తిదాయక అంశాలు తెలిసాయట. వాళ్లు ముఖ్యంగా నేటి స్ర్తిలపై పువ్వుల ప్రభావం గురించి అమెరికాలో పరిశోధనలు చేసారట. పరిశోధనకు స్ర్తిలనే ఎన్నుకోవడానికి కారణం ఏమిటని అడిగితే- భావ ప్రకటన స్ర్తిలు తక్షణమే చేస్తారు , తొందరగా మూడ్స్ మారిపోయేది స్ర్తిలకే, సామాన్యంగా పూలను స్ర్తిలకే ఎక్కువగా ఇస్తారు అందువల్ల, అని చెప్పారట! అది నిజం కదా! ‘క్షణ క్షణముల్ జవరాండ్ర చిత్తముల్’ అని వూరికే అనలేదు. పెంచిన మొక్క తాలూకు ఒక పువ్వును చూసినప్పటి, అందుకున్నప్పటి ‘ఆనందం’ వర్ణనాతీతం! కరుణశ్రీగారు- ‘పుష్ప విలాపం’ అని రాసినా,పూలకు స్ర్తిల దగ్గరా, దేవుడి దగ్గరా ప్రముఖమైన సార్ధకత అందం, ఆనందం, పరమార్ధం కూడాను’’ అన్నాడు శంకరం.



‘‘ఇటీవలి కాలంలో స్ర్తిల తలలో కనిపించడం తక్కువైన మాట వాస్తవం కావచ్చుగాక , కానీ, పెళ్లిళ్లలో, పార్టీలలో, రిసెప్షన్‌లో పూల ప్రాధాన్యమే బాగా పెరిగిపోయింది! కానుకలు ఇవ్వడం కూడా తగ్గించేసి, ఓ పూల బొకేతో అభినందించడాలూ, ఆశీర్వదించడాలూ చేసేస్తున్నారు. తాము సత్యనారాయణ వ్రతం చేసుకున్నా-అందరూ పూలబొకేలతో వచ్చారని మొన్న మా రామలింగయ్య (కానుకలేం రాలేదని) వాపోయాడు కూడాను. మీకో సంగతి తెలుసా! ఒక్క అమెరికాలోనే, ఒక్క 2001లోనే, 4.9 బిలియన్ డాలర్ల పూలు అమ్మకాలు జరిగాయట! అప్పటినుంచీ అమ్మకాలు పెరుగుదల ఉంటునే ఉందట. యాబయ అయిదు సంవత్సరాలు పైబడిన వారికి పూలతోటి సాంగత్యం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతోందని నేనూ చదివాను’’ అన్నాడు ప్రసాదు.



‘‘జీవితం సుఖ సంతోషాలతో, సంతృప్తిదాయకంగా, పూలబాటలా-సాగాలంటే, తరుణుల తలలో పూలూ, అందరి తలపుల్లో పూలూ కూడా వర్ధిల్లాలి. పూలూ జిందాబాద్!’’ అన్నాడు సుందరయ్య నినదిస్తూ..


4 comments:

చెప్పాలంటే...... said...

mallelu baavunnayi mi tapaa laa!!

Anonymous said...

Chaalaa madhurangaa cheppaarandee.

CH.K.V.Prasad said...

సామాన్యుడి గగన కుసుమాల గురించి బలే చెప్పారండి!
అలాగే కు సుమాల ఫై(కాగితం పూలు, ప్లాస్టిక్ పూలు)
మీ భావుకత ఏమిటో?

మరువం ఉష said...

పుష్ప లావికలు, పూలసాయిబుల ప్రస్తావన కూడా తెస్తారనుకున్నాను (చదవటం మొదలెట్టినపుడు)