ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, March 25, 2011

కలిపేసుకుందాం రా..
కలిపేసుకుందాం రా..

విడిగా పెట్టుకు తినేయాలన్న ఒకటే ఆబ తప్ప, పాపం పిల్లలు ఏం చేతనవుతుంది? ఏదో తాపత్రయం మటుకు పడతారు’’ అన్నాడు సుందరయ్య.‘‘ఇండిపెండెన్సీ నాయనా! గట్టిగా నాలుగు మాటలు పూర్తిగా రావు. ఏం కావాలో తమకే సరిగ్గా తెలియదు. మారాం తప్ప ఎందుకు కావాలో, ఏం చేసుకుంటారో చెప్పలేరు. అయినా వడ్డించేయమంటారు. నేలకు కాళ్లానవు. కుర్చీకి సరిపోరు. పైన అందదు. అయినా తమ కంచం తమకు అన్న అల్లరి’’ అన్నాడు రాంబాబు సుందరయ్యకు వంత కలుపుతూ.‘‘చిన్న పిల్లల తత్వమే అంతర్రా! తల్లిదగ్గర కాకపోతే ఎవరి దగ్గర మారాం చేస్తారు. అందులో చాలామంది పిల్లలు అల్లరి చేసేదీ తండ్రి దగ్గర. నోట్లో ఓ ముద్ద పెట్టుకుని పరిగెడుతుంటారు. సరిగ్గా తినరు. తిననివ్వరు. కలుపుకోవాల్సి ఉంటుంది గానీ కలుపుకోలేరు’‘ అన్నాడు ప్రసాద్.


సన్యాసి నవ్వేశాడు పెద్దగా! ప్రసాద్- ‘అలా నవ్వుతావేం‘ అని అడిగాడు. ‘‘అబ్బే! సుందరయ్యా, రాంబాబూ ఒకటి మాట్లాడుతుంటే, నువ్వు మరొకటి మాట్లాడుతున్నావేమోనని నవ్వొచ్చింది’’ అన్నాడు సన్యాసి. ‘‘నేనూ, ‘పిల్లలూ-తిండి’ గురించేగా మాట్లాడుతోంది’’ అన్నాడు ప్రసాద్ అమాయకంగా. ‘‘కానీ వాళ్లు మాట్లాడుతోంది దాని గురించి కాదు. ఫక్తు రాజకీయాల గురించి’’ అన్నాడు సన్యాసి నవ్వుతూ ‘‘ఔనా?’’ అన్నట్లు వాళ్లిద్దరివైపూ చూసాడు ప్రసాద్. ‘‘విడిగా పార్టీ పెట్టుకుని ఏదో లాభపడిపోవాలని ఆరాటపడేవాళ్ల గురించే నోయ్ నేను ప్రస్తావించింది! తాపత్రయమే తప్ప, రాజకీయానుభవం లేని పిల్లతనం కాక మరేమిటి కొందరిది’’ అన్నాడు సుందరయ్య.
‘‘నిజమే! పార్టీ పెట్టుకుంటారే తప్ప, ఏం సాధించాలో, ఎలా సాధించాలో ఎరుగరు.. గట్టిగా నాలుగు మాట్లాడడమూ సరిగ్గా రాదు. తమకు నాయకత్వం వహించగల స్థాయి ఉందని, లేని పెద్దరికం ఊహించేసుకుంటారు. ‘‘నా అంతటి వాడిని నేను’’ అని బుడుగులా బింకాలు పోతారు’’ అన్నాడు రాంబాబు. ‘‘కానీ చాలాసార్లు కుదేలైపోతుంటారు’’ అన్నాడు.‘‘సరే అయితే! నేనన్నదీ రాజకీయాల్లోకే వేసుకోండి. సన్యాసీ! నా మాటలూ ఆ సంగతుల్లోకీ వస్తాయి గమనించుకో! నోట్లో ఓ ముద్ద పెట్టుకుని పరిగెట్టే పిల్లల్లానే, ఏదో ఒక పాయింట్ పుచ్చుకుని అదే తమ అధికార ఆకలి తీర్చగలదన్నట్టు, పరుగులు తీస్తుంటారు కదా! కలుపుకోవాలని ఉంటుంది కానీ కలుపుకోలేరు అన్నాను చూసావ్! అది టుకు ఇప్పుడు యదార్ధం. ‘‘నేను కలిసి పెడతా రండి’’ అని సోనియామాతే చొరవ తీసుకోవాల్సి వస్తోంది. చిరంజీవి మొత్తానికి పార్టీని అమ్మచేత కలిపించుకోడానికి తయారైపోయాడు కదా! ప్రస్తుతం కెసిఆర్ తన తెరాసను కూడా ఆశగా అమ్మ కలిపిపెడుతుందనే రెడీ అయిపోతున్నాడు. తనకు కావాల్సినదేమిటో తీసుకోవాలంటే, మరాం మాని, ‘అమ్మ మాట వినాల్సిందే’ అని గ్రహింపుకు వస్తున్నట్టున్నాడు! నువ్వు కలుపుకున్నా, నన్ను కలపనిచ్చినా ఏదయినా సరే! మొత్తానికి నీ పార్టీని కలపడం అనేది తప్పదు. నువ్వడిగిన తాయిలం ఇవ్వాలంటే ఆ పని చెయ్యి. బుద్ధిగా ఉండు’’ అని సోనియాగాంధీ కెసిఆర్ చెవులు మెలికేయకపోయినా, చెవుల్లో మెల్లగా చెప్పినట్లే ఉందంటున్నారు కదా!’’ అన్నాడు ప్రసాదు వర్తమాన వార్తలను ఉటంకిస్తూ. ‘‘్భష్! అయితే నువ్వూ దారిలోనే ఉన్నావన్నమాట! మరోలా ఆలోచిస్తున్నావేమోనని నేనే అనుకున్నాలే’’ అన్నాడు సన్యాసి. ‘‘సన్యాసీ! నువ్వు ఓ మీడియాలాంటివాడివయ్యా! ఎవరు ఏమి అనుకుంటున్నా, అందులోంచి -‘బహుశా వారి ఆలోచన ఇదై వుండచ్చు’ అని, అన్నంలోంచి ‘గుజ్జు’ పిండినట్టు, గోరుముద్దలు వడ్డించడం నీకు అలవాటు!’’ అన్నాడు నవ్వుతూ సుందరయ్య. ‘‘ ‘ఘోరం’ ముద్దలు ముద్దలుగా కనపడుతున్నా అది ‘గోరుముద్దలుగా’ మలిచే కాకమ్మ కథల చాకచక్యమూ మీడియా మాత్రం చూపిస్తుంటుందిగా! ‘నేను కలుపుతాననలేదు, కలుపుకుంటాననీ అనలేదు’ అని పిల్లవాడు అంటున్నా, అది ‘పిల్లచేష్టే’ననీ, తల్లి లాలనకు లొంగని పిల్లగాడెవరనీ?న కథలు చెప్పకుండానే-కలిపేసి తినిపించగల చాకచక్యం అమ్మదగ్గరుందనీ, అనుభవజ్ఞులైన మేనమామలూ, తాతయ్యలకు కూడా తెలుసు! ‘కాంగ్రెస్’ అనే పెద్ద కుటుంబంలో కురువృద్ధులు, గురుబుద్ధులు ఎందరున్నా, ఎన్ని ఉన్నా-తాళం చెవులు బొడ్లో ఉన్న ఆమెదే పెత్తనం! అల్లరి చిల్లరగా తిరిగే పిల్లల్నీ, విడికాపురాలు పెడతానని అలిగి వెళ్లిపోయిన మరుదుల్ని, తోడికోడళ్లనీకూడా నిభాయించగల సత్తా పెద్దరికంతో ఆవిడ గుత్తకు తీసుకున్నట్లే కనపడుతూంటుంది’’ అన్నాడు రాంబాబు.‘‘ ‘ఏటిలోని కెరటాలూ ఏరువిడిచి పోవు. ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు’ అన్నాడు కవి. ‘నదీనాం సాగరో గతిః’ అని, పాయలు పాయలైనవి కూడా, ఫాయిదా లేదని తెలిసాకో, లేదా మరో ‘్ఫయిదా’ కోసమో, ‘విలీనం’ కావడమే వ్యవహారం.... తెలుగుదేశంనుండి విడివడి తెరాస పెట్టిన కెసిర్ అయినా, అసలు మామకోసం తెలుగుదేశంలో చేరి, ఆయన్నిముంచి పార్టీని వంచిన చంద్రబాబు అయినా-అంతరంతరాల్లో ‘కాంగ్రెస్ రక్త’ సంబంధీకులే! పైకి ఇన్ని బింకాలు పోయినా, లోపల ఏమూలో ఆ ప్రేమ పేగుబంధంలా ఊగుతుంటుంది. తెలంగాణ కోసం ‘నేను కలిపి పెడతా’ అని కెసిఆర్‌ని బుజ్జగించుతున్న అధినేత్రి, రాష్ట్రంలో తన పార్టీ ప్రభుత్వం పట్ల పై బింకమే తప్ప మెతకగానే వ్యవహరిస్తున్న చంద్రబాబునీ ఎప్పుడో ఓ దువ్వు దువ్వకపోదన్న సంకేతాలూ వస్తున్నాయి. అంచేత వృధా ‘రేసు‘ పరుగులు మానేసి, ‘కామ్’గా అమ్మతల్లి ’గ్రేస్’ పొంది, కడుపులో చల్ల కదలకుండా కలేసుకుని బతకడం తప్పుకాదనిపిస్తుందేమో!’’ అంటూ సన్యాసి ప్రసాద్ భుజం చరిచాడు.

1 comments:

బొల్లోజు బాబా said...

sudhama gaariki
namasthe

happy to see you in blog world sir

bollojubaba